
రాహుల్‌ను వీడని భుజం నొప్పి!
చాంపియన్స్ ట్రోఫీకి దూరం
బెంగళూరు: రెండున్నరేళ్ల కెరీర్‌లో ఇప్పటికే అనేక సార్లు గాయాలతో పలు మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇదే కారణంతో మరోసారి భారత్ తరఫున ప్రధాన టోర్నీ ఆడే అవకాశం కోల్పోయాడు. భుజం గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో వచ్చే నెలలో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో తాను ఆడే అవకాశం లేదని రాహుల్ ప్రకటించాడు. గాయం వల్లే అతను ఇప్పటికే ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్నాడు. ఆస్ట్రేలియాతో పుణేలో జరిగిన తొలి టెస్టులోనే ఒకీఫ్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టబోయిన సమయంలో అతని భుజానికి గాయమైంది. అయితే అలాగే సిరీస్ కొనసాగించిన రాహుల్ 7 ఇన్నింగ్స్‌లలో 6 అర్ధ సెంచరీలతో సహా 393 పరుగులు సాధించాడు.
సిరీస్ తర్వాత లండన్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నా అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ‘చాంపియన్స్ ట్రోఫీలోగా నేను మ్యాచ్ ఫిట్‌గా మారే అవకాశం లేదు. భుజం నొప్పి వల్ల నేను క్రీజ్‌లో స్వేచ్ఛగా కదల్లేకపోతున్నాను. దాంతో కొన్ని రకాల షాట్లు ఆడకుండా ఆగిపోవాల్సి వస్తోంది’ అని రాహుల్ వెల్లడించాడు. కెరీర్ కొత్తలోనే పదే పదే గాయపడుతుండటం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన రాహుల్... మున్ముందు తన ట్రైనింగ్ విధానంలో మార్పులు చేయడంపై దృష్టి పెడతానన్నాడు.