ఐదేళ్ల తర్వాత... | Knockout stage in Ranji Trophy After Five Year | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల తర్వాత...

Published Sun, Feb 16 2020 6:13 AM | Last Updated on Sun, Feb 16 2020 6:13 AM

Knockout stage in Ranji Trophy After Five Year - Sakshi

ఆంధ్ర జట్టు కెప్టెన్‌ శ్రీకర్‌ భరత్‌

సాక్షి, విజయవాడ స్పోర్ట్స్‌: మాజీ చాంపియన్‌ గుజరాత్‌తో జరిగిన చివరిదైన ఎనిమిదో లీగ్‌ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ... రంజీ ట్రోఫీ టోర్నమెంట్‌లో ఆంధ్ర క్రికెట్‌ జట్టు నాకౌట్‌ దశకు (క్వార్టర్‌ ఫైనల్స్‌) అర్హత సాధించింది. నడియాడ్‌లో శనివారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్‌ చేతిలో ఓటమి పాలైంది. ఆట చివరి రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 216/7తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆంధ్ర 113.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్‌ బౌలర్‌ అక్షర్‌ పటేల్‌ 92 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. అనంతరం 30 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్‌ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్‌ 18 జట్లున్న ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ అండ్‌ బి’లో 35 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది.

ఎలైట్‌ ‘ఎ అండ్‌ బి’ గ్రూప్‌ నుంచి బెంగాల్‌ (32 పాయింట్లు), కర్ణాటక (31 పాయింట్లు), సౌరాష్ట్ర (31 పాయింట్లు), ఆంధ్ర (27 పాయింట్లు) జట్లు కూడా క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాయి. ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీలో నాకౌట్‌ దశకు చేరడం ఇది నాలుగోసారి. గతంలో ఆంధ్ర జట్టు కె.ఎస్‌. భాస్కర మూర్తి సారథ్యంలో 1985–86 సీజన్‌లో... ఎమ్మెస్కే ప్రసాద్‌ కెప్టెన్సీలో 2001–02 సీజన్‌లో... మొహమ్మద్‌ కైఫ్‌ నాయకత్వంలో 2014–15 సీజన్‌లో క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత పొందింది. అయితే ఈ మూడు పర్యాయాలూ ఆంధ్ర పోరాటం క్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. ఈనెల 20 నుంచి 24 వరకు ఒంగోలు వేదికగా జరిగే క్వార్టర్‌ ఫైనల్లో సౌరాష్ట్రతో ఆంధ్ర జట్టు ఆడుతుంది.  

ఈ సీజన్‌లో ఆంధ్ర జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచింది. రెండింటిని ‘డ్రా’ చేసుకొని మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్‌లో హనుమ విహారి, రికీ భుయ్, శ్రీకర్‌ భరత్‌లు ఆంధ్ర జట్టుకు కెప్టెన్‌లుగా వ్యవహరించారు. మరోవైపు హైదరాబాద్‌ జట్టు డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భతో చివరి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. కేవలం ఏడు పాయింట్లతో అట్టడుగున నిలిచి వచ్చే ఏడాది గ్రూప్‌ ‘సి’కి పడిపోయింది. గ్రూప్‌ ‘సి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జమ్మూ కశ్మీర్, ఒడిశా జట్లు వచ్చే ఏడాది ఎలైట్‌ ‘ఎ అండ్‌ బి’ గ్రూప్‌కు ప్రమోట్‌ అయ్యాయి. ‘సి’లో చివరి స్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్‌ ప్లేట్‌ డివిజన్‌కు పడిపోయింది. ప్లేట్‌ డివిజన్‌లో అగ్రస్థానంలో నిలిచిన గోవా జట్టు గ్రూప్‌ ‘సి’కి ప్రమోట్‌ అయ్యింది. ‘ఈ సీజన్‌లో జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా కష్టపడ్డాడు. వారికి సహాయక సిబ్బంది కూడా తమ వంతుగా ప్రోత్సాహం అందించింది. నాకౌట్‌ మ్యాచ్‌లోనూ ఆంధ్ర జట్టు మంచి ప్రదర్శన చేసి ముందంజ వేయాలి. ఆంధ్ర క్రికెట్‌ సంఘానికి మరింత పేరు తేవాలి. సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌ కోసం అందరికీ బెస్టాఫ్‌ లక్‌’ అని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) సెక్రటరీ వి.దుర్గా ప్రసాద్‌ తెలిపారు.  

క్వార్టర్‌ ఫైనల్స్‌ షెడ్యూల్‌
ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు
ఆంధ్ర గీ సౌరాష్ట్ర (ఒంగోలు)
కర్ణాటక గీ జమ్మూ కశ్మీర్‌ (జమ్మూ)
బెంగాల్‌ గీ ఒడిశా (కటక్‌)
గుజరాత్‌ గీ గోవా (వల్సాద్‌)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement