లాస్ ఏంజెల్స్: తన భర్త, కూతురి దుర్మరణం తమ కుటుంబాన్ని అగాథంలోకి నెట్టివేసిందని బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రియాంట్ భార్య వెనెస్సా బ్రియాంట్ భావోద్వేగానికి గురయ్యారు. వాళ్లిద్దరూ లేని లోటు ఎవరూ పూడ్చలేరని.. ఈ విషాదం గురించి వర్ణించడానికి మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదకర సమయంలో తమకు తోడుగా ఉన్న లక్షలాది మందికి ధన్యవాదాలు తెలిపారు. ‘బ్లాక్ మాంబా’గా సుపరిచితమైన బాస్కెట్ బాల్ లెజెండ్ కోబీ బ్రయాంట్, కూతురు జియానా(13) సహా మరో ఏడుగురు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. ఆదివారం కాలిఫోర్నియా సమీపంలోని క్యాలాబసస్ వద్ద జరిగిన ఈ దుర్ఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని దుఃఖ సాగరంలో ముంచివేసింది.
ఈ నేపథ్యంలో కోబీ మరణం తర్వాత తొలిసారిగా ఆయన భార్య వెనెస్సా గురువారం సోషల్ మీడియా వేదికగా తన బాధను పంచుకున్నారు. ‘‘నా ప్రియమైన భర్త కోబీ... అద్భుతమైన తండ్రి... నా అందమైన, అద్భుతమైన, చలాకీదైన చిన్నారి జియానా- నా కూతురు, నటాలియా, బియాంక, కాప్రీల సోదరి.. వాళ్లిద్దరినీ కోల్పోవడంతో కుటుంబం మొత్తం విషాదంలో మునిగిపోయింది. కోబీ, గిగీ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నాం అయినా వాళ్లు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నట్లుగా భావిస్తాం.(దిగ్గజం విషాదాంతం)
నేను వాళ్లిద్దరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవాలి.. వారి తలపై ప్రేమగా ముద్దు పెట్టాలి అని ఆకాంక్షిస్తున్నాను. వాళ్లు మాతోనే ఉంటారు. ఈ ప్రమాదంలో నా భర్త, కూతురితో పాటు చనిపోయిన మిగతా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి ముంబా స్పోర్ట్స్ ఫౌండేషన్ తరఫున సహాయం అందజేస్తాం’’ అంటూ భావోద్వేగ పోస్టు పెట్టారు.
కాగా కోబీ- వెనెస్సా(డ్యాన్సర్)లు 2001లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు నలుగురు ఆడ పిల్లలు.. నటాలియా (17 ఏళ్లు), జియానా (13 ఏళ్లు), బియాంకా (3 ఏళ్లు), క్యాప్రి (7 నెలలు) ఉన్నారు. ఇక సుమారు రెండు దశాబ్దాల పాటు (1996-2016) తన మెరుపు విన్యాసంతో మైదానంలో పాదరసంలా కదిలిన బ్రయాంట్.. తన కూతురు జియానాను సైతం అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని భావించాడు. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో జియానాకు బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి హెలికాప్టర్‌లో వెళ్తుండగా ఇద్దరూ మృత్యువాత పడ్డారు.(కనుమరుగైన ‘బ్లాక్ మాంబా’)
Comments
Please login to add a commentAdd a comment