న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ సుతి మెత్తగా విమర్శనాస్త్రాలు సంధించాడు. అసలు కోహ్లి కెప్టెన్సీ బాగుండటానికి ఎంఎస్ ధోని, రోహిత్ శర్మేలే కారణమన్నాడు. కొన్నేళ్ల నుంచి మొన్నటి వన్డే వరల్డ్‌కప్ వరకూ కోహ్లి కెప్టెన్‌గా విజయాలు సాధించడంలో ధోని, రోహిత్‌లు కీలక పాత్ర పోషించారన్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కెప్టెన్‌గా సక్సెస్ కాలేని కోహ్లి.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం దూసుకుపోవడాన్ని ప్రస్తావించాడు. ఇక్కడ ధోని, రోహిత్‌ల అండ కోహ్లికి ఉండటమే ప్రధాన కారణంగా చెప్పుకొచ్చాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో ధోని, రోహిత్‌లు తిరుగులేని కెప్టెన్లు అనే విషయాన్ని గంభీర్ ఉదహరించాడు. ఒకసారి వీరు లేకుండా కెప్టెన్‌గా చేస్తే కోహ్లి ప్రతిభ ఏమిటో బయటపడుతుందన్నాడు.
‘ అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా కోహ్లి ఎన్నో విజయాలు సాధించాడు. ఇది కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. సుదీర్ఘకాలంగా ధోని, రోహిత్‌లు కీలక పాత్ర పోషించబట్టే కోహ్లి కెప్టెన్‌గా విజయవంతమయ్యాడు. ఒకసారి ఫ్రాంచైజీ క్రికెట్ పరంగా చూస్తే కోహ్లి ఏమి సాధించాడో గుర్తించండి. నేను నిజాయితీగా చెబుతున్నా. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ ఒక సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా నిలిచాడు. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు తిరుగులేని కెప్టెన్ ధోని. ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న కోహ్లిని పరిశీలించండి. ఫలితాలు ఏమిటో అందరికీ తెలిసిందే’ అంటూ గంభీర్ విమర్శించాడు. ఇక టెస్టుల్లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా సత్తాచాటే అవకాశం వచ్చేసిందంటూ ప్రశంసించాడు. కేఎల్ రాహుల్‌కు ఓపెనర్‌గా చాలా అవకాశాలు ఇచ్చారని, ఇప్పుడు రోహిత్ సమయం వచ్చేసిందన్నాడు. రోహిత్ జట్టులో ఎంపికయ్యాడంటే తుది జట్టులో ఉన్నట్లేనని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతనికి భారత క్రికెట్ జట్టు 11 మంది సభ్యుల బృందంలో చోటివ్వకపోతే, 15-16 మంది సభ్యుల జట్టులోకి తీసుకున్నా ఉపయోగం లేనిదిగా అభివర్ణించాడు. రోహిత్ ఒక అసాధారణమైన ఆటగాడంటూ గంభీర్ కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment