
సాక్షి, ఆంటిగ్వా: క్రికెట్ రికార్డులకు కొత్త పాఠాలు నేర్పుతూ ఎన్నో ఘనతలను తన ఖాతాలో వేసుకున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 11 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. 2008 ఆగస్టు 18న అతను తన తొలి మ్యాచ్ ఆడాడు. ఈ సందర్భంగా తన భావోద్వేగాలను పంచుకున్నాడు. నాటి తొలి మ్యాచ్ ఫోటో, తాజా ఫోటోలను తన స్పందనకు కలిపి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘2008లో సరిగ్గా ఇదే రోజు ఒక టీనేజర్‌గా కెరీర్ మొదలు పెట్టడం నుంచి 11 ఏళ్ల తర్వాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే... దేవుడు నాపై తన ఆశీస్సులు ఇంతగా కురిపిస్తాడని కలలో కూడా అనుకోలేదు. సరైన దిశలో నడుస్తూ మీ అందరూ కలలు నెరవేర్చుకునేలా శక్తినివ్వాలని కోరుకుంటున్నా. ఎప్పటికీ కృతజ్ఞుడిని’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. 11 ఏళ్ల కెరీర్‌లో మూడు అంతర్జాతీయ ఫార్మాట్‌లలో కలిపి 386 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 20,502 పరుగులు చేశాడు.