టీ20: ఆ ఒక్కడి శ్రమపై నీళ్లు గుమ్మరించారు!
చివర్లో ఫుల్ టాస్ బంతిని డీప్‌లోకి ఆండ్రె రస్సెల్స్ తరలించినప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన విరాట్ కోహ్లి.. ప్రేక్షకులకు గుర్తుండిపోతాడు. బ్యాటింగ్‌లో తాను చేయగలిగినంతా చేసి.. ఆఖరికీలో బౌలింగ్‌లోనూ ఓ వికెట్ తీసిన కోహ్లి.. తన ప్రమేయం లేకుండానే టీమిండియా సమిష్టి ఓటమిలో భాగమయ్యాడు.
అసాధారణమైన ఫామ్‌తో ఉన్న 27 ఏళ్ల కోహ్లి టీ20 వరల్డ్‌కప్ సెమీస్‌లోనూ అద్భుతంగా ఆడాడు. టీమిండియా 20 ఓవర్లలో 192 పరుగులు చేస్తే.. అందులో సగానికి మించి 89 పరుగులు ఒక్క కోహ్లి చేసినవే. 11 ఫోర్లు, ఓ సిక్సర్ తో దూకుడుగా ఆడిన కోహ్లి.. సింగల్స్, డబుల్స్‌గా, డబుల్స్‌ను త్రిబుల్స్‌గా మలిచేందుకు క్రీజులో చాలానే కష్టపడ్డాడు. అతడు రాబట్టిన రన్స్‌లో 44శాతం ఇలా పరిగెత్తడం ద్వారా వచ్చినవే.
కష్టకాలంలో కోహ్లిలోని బౌలర్ కూడా బయటకొచ్చాడు. వాంఖడే మైదానంలో కురుస్తున్న మంచు ఇటు స్పిన్నర్లను, అటు పేసర్లను ఇబ్బందిపెడుతూ.. పరుగుల వరద పారుతున్న సమయంలో కోహ్లికి బంతిని అందించాడు ధోనీ. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ జాన్సన్ చార్లెస్ (52)ను పెవిలియన్‌కు పంపాడు కోహ్లి.
18 ఓవర్‌లో మెరుపులు మెరిపిస్తున్న సిమన్స్‌ను ఔట్ చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు జడ్డేజా. బౌండరీ లైన్ వద్ద పరిగెత్తుతూ క్యాచ్ పట్టుకొని.. గాలిలోనే దానిని కోహ్లికి అందించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ కూడా భారత్‌కు అదృష్టం కలిసిరాలేదని చెప్పాలి. జడ్జేజా కాలు కొద్దిగా బౌండరీలైనుకు తగలడంతో దీనిని సిక్స్‌గా ప్రకటించారు.
కోహ్లి అదృష్టంపై ఆశలు పెట్టుకున్న కెప్టెన్ ధోనీ చివరి ఓవర్‌ను అతనికి అప్పగించాడు. మొదటి బంతికి సింగల్ ఇచ్చి.. రెండు బంతికి డాట్ బాల్ వేసి.. ఆశలు నిలబెట్టే ప్రయత్నం కోహ్లి చేసినా.. ఆ వెంటనే రస్సెల్స్ ఫోర్.. ఆ తర్వాత బంతికి సిక్స్ కొట్టి.. భారత అభిమానుల ఆశల్ని ముక్కలు చేశాడు.
ఈ మెగా టోర్నమెంటులో కోహ్లి అసాధారణరీతిలో రాణించాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో 136 సగటు, 147 స్ట్రైక్ రేటుతో 273 పరుగులు చేశాడు. టీమిండియా సమిష్టిగా రాణించి ఉంటే ఫైనల్‌లోనూ కోహ్లి మరిన్ని పరుగులు చేసేవాడు. టోర్నమెంటులో బెస్ట్ బ్యాట్స్‌మన్ ఘనత సాధించే అవకాశం ఉండేది. కానీ ఆ ఒక్కడి శ్రమతోనే టీమిండియా సెమీస్‌కు చేరింది. బౌలర్ల వైఫల్యంతో సెమీస్‌లో దారుణంగా ఓడింది.