కోల్ కతా రైడింగ్ | Kolkata Knight Riders beat Kings XI Punjab by 6 wickets | Sakshi
Sakshi News home page

కోల్ కతా రైడింగ్

Published Tue, Apr 19 2016 11:35 PM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

కోల్ కతా రైడింగ్

కోల్ కతా రైడింగ్

నైట్‌రైడర్స్‌కు మూడో విజయం
రాణించిన ఉతప్ప, గంభీర్
మరోసారి మెరిసిన బౌలర్లు

 
ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు జరిగితే... 11 మ్యాచ్‌ల్లో లక్ష్యాన్ని ఛేదించిన జట్లే గెలిచాయి. ఇప్పుడు కోల్‌కతా, పంజాబ్ మ్యాచ్‌లో కూడా అదే ఆనవాయితీ కొనసాగింది. ప్రత్యర్థి జట్టులోని హిట్టర్లను స్పిన్ మ్యాజిక్‌తో నియంత్రించిన నైట్‌రైడర్స్... ఓపెనర్ల రాణింపుతో లక్ష్యాన్ని అలవోకగా ఛేదించి సీజన్‌లో మూడో విజయం సొంతం చేసుకుంది.
 
మొహాలీ:  నాణ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకే అవుట్ చేయడం... ఆపై ఓపెనర్ల రాణింపుతో సులువుగా ఛేదించడం.. ఈ సీజన్‌లో కోల్‌కతా విజయమంత్రం ఇది. పంజాబ్‌పై కూడా అదే తరహాలో కోల్‌కతా ‘రైడింగ్’ కొనసాగింది. లక్ష్య ఛేదనలో రాబిన్ ఉతప్ప (28 బంతుల్లో 53; 9 ఫోర్లు), గౌతమ్ గంభీర్ (34 బంతుల్లో 34; 3 ఫోర్లు)లు చెలరేగడంతో ఐపీఎల్-9లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 6 వికెట్ల తేడాతో పంజాబ్‌పై గెలిచింది. ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేసింది. షాన్ మార్ష్ (41 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా, మురళీ విజయ్ (22 బంతుల్లో 26; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. తర్వాత కోల్‌కతా 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 141 పరుగులు చేసింది. అక్షర్, సాహు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.


 మార్ష్ మినహా...
 పిచ్ బౌలర్లకు సహకరించడంతో పంజాబ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడానికి బాగా ఇబ్బందిపడ్డారు. ఓపెనర్లలో మన్నన్ వోహ్రా (8) నాలుగో ఓవర్‌లోనే అవుట్‌కాగా, మురళీ విజయ్‌తో కలిసి మార్ష్ ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యతను తీసుకున్నాడు. వీరిద్దరు అడపాదడపా బౌండరీలు బాదడంతో పవర్‌ప్లేలో కింగ్స్ స్కోరు 41/1 పరుగులకు చేరింది. ఈ దశలో గంభీర్... స్పిన్నర్ల చేతికి బంతి ఇవ్వడంతో పంజాబ్ మిడిలార్డర్ తలకిందులైంది. ఓ ఎండ్‌లో మార్ష్ స్థిరంగా ఆడినా.... రెండో ఎండ్‌లో చావ్లా, నరైన్, యూసుఫ్‌లు వ్యూహాత్మకంగా బౌలింగ్ చేస్తూ వరుస విరామాల్లో విజయ్, సాహా (8), మిల్లర్ (6), మ్యాక్స్‌వెల్ (4)లను పెవిలియన్‌కు చేర్చారు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ 5 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేసింది. ఇక భారీ షాట్లు ఆడతాడనుకున్న అక్షర్ పటేల్ (9)తో పాటు మోహిత్ శర్మ (1), ప్రదీప్ సాహు (1)లు పది బంతుల తేడాలో అవుట్‌కావడం స్కోరుపై ప్రభావం చూపింది. ఆఖరి ఓవర్‌లో మార్ష్ రెండు భారీ సిక్సర్లతో 18 పరుగులు రాబట్టాడు. ఇన్నింగ్స్ మొత్తంలో ఇదే అత్యధికం. మోర్కెల్, నరైన్ చెరో రెండు వికెట్లు తీశారు.


 మెరుపు భాగస్వామ్యం
 లక్ష్యం భారీగా లేకపోయినా... కోల్‌కతా ఛేదన ధాటిగానే ప్రారంభించింది. గంభీర్ సింగిల్స్‌కు ప్రాధాన్యమిచ్చినా.. ఉతప్ప వేగంగా ఆడాడు. ఈ ఇద్దరు ఓవర్‌కు ఒకటి, రెండు ఫోర్లతో పదికి పైగా రన్‌రేట్ నమోదు చేశారు. దీంతో తొలి ఆరు ఓవర్లలో నైట్‌రైడర్స్ 65 పరుగులు చేసింది. స్పిన్నర్ సాహు వేసిన ఏడో ఓవర్‌లో అద్భుతమైన రివర్స్ స్వీప్‌తో ఫోర్ కొట్టిన ఉతప్ప... ఆ తర్వాతి బంతికి సింగిల్స్ తీసి ఈ సీజన్‌లో మూడో ఫాస్టెస్ట్ అర్ధసెంచరీ (24 బంతుల్లో) సాధించాడు. నిలకడగా ఆడుతున్న ఈ జోడిని 9వ ఓవర్‌లో సాహునే విడదీశాడు. ఓ ఫుల్ లెంగ్త్ బంతిని స్వీప్ చేయబోయి ఉతప్ప ఎల్బీడబ్ల్యు అయ్యాడు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలో 82 పరుగులు జత చేశారు.

ఈ దశలో వచ్చిన మనీష్ పాండే (12) మెల్లగా ఆడినా.... సాహు తన మూడో ఓవర్‌లో గంభీర్‌ను పెవిలియన్‌కు పంపాడు. మిడ్ వికెట్ మీదుగా గాల్లోకి లేచిన బంతిని మ్యాక్స్‌వెల్ జంప్ చేస్తూ నేర్పుగా అందుకున్నాడు. ఇక 42 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో అక్షర్ పటేల్ వరుస ఓవర్లలో పాండే, షకీబ్ (11)ల వికెట్లు తీశాడు. కానీ విజయానికి 15 పరుగులు అవసరమైన దశలో యూసుఫ్ (12 నాటౌట్) రెండు, సూర్యకుమార్ (11 నాటౌట్) ఓ ఫోర్ బాదడంతో మరో 17 బంతులు మిగిలి ఉండగానే విజయం లభించింది.


 స్కోరు వివరాలు
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (బి) చావ్లా 26; వోహ్రా (సి) షకీబ్ (బి) మోర్కెల్ 8; మార్ష్ నాటౌట్ 56; సాహా (సి) ఉతప్ప (బి) నరైన్ 8; మిల్లర్ (సి) ఉతప్ప (బి) పఠాన్ 6; మ్యాక్స్‌వెల్ (సి) చావ్లా (బి) నరైన్ 4; అక్షర్ పటేల్ (సి) సూర్య కుమార్ (బి) ఉమేశ్ 9; మోహిత్ శర్మ (సి) ఉతప్ప (బి) మోర్కెల్ 1; ప్రదీప్ సాహు రనౌట్ 1; అబాట్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 138.

వికెట్ల పతనం: 1-21; 2-47; 3-59; 4-72; 5-94; 6-108; 7-115; 8-118.
బౌలింగ్: మోర్నీ మోర్కెల్ 4-0-27-2; ఉమేశ్ యాదవ్ 3-0-17-1; షకీబ్ 4-0-28-0; నరైన్ 4-0-22-2; పీయూష్ చావ్లా 3-0-18-1; యూసుఫ్ పఠాన్ 1-0-6-1; రస్సెల్ 1-0-18-0.

కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప ఎల్బీడబ్ల్యు (బి) సాహు 53; గంభీర్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సాహు 34; మనీష్ పాండే (బి) అక్షర్ 12; షకీబ్ (సి) సందీప్ (బి) అక్షర్ 11; సూర్య కుమార్ నాటౌట్ 11; యూసుఫ్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (17.1 ఓవర్లలో 4 వికెట్లకు) 141.

వికెట్ల పతనం: 1-82; 2-97; 3-110; 4-123.
బౌలింగ్: సందీప్ శర్మ 2-0-21-0;  అబాట్ 3-0-32-0; మోహిత్ శర్మ 3.1-0-29-0 అక్షర్ పటేల్ 3-0-19-2; ప్రదీప్ సాహు 4-0-18-2; మ్యాక్స్‌వెల్ 2-0-17-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement