ప్లే ఆఫ్కు కోల్కతా | Kolkata Knight Riders confirms play off berth after defeated sunrisers hyderabad | Sakshi
Sakshi News home page

ప్లే ఆఫ్కు కోల్కతా

Published Sun, May 22 2016 7:29 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

ప్లే ఆఫ్కు కోల్కతా

ప్లే ఆఫ్కు కోల్కతా

కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జూలు విదిల్చింది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్లోనూ సమష్టిగా రాణించిన గంభీర్ సేన ప్లే ఆఫ్ కు చేరింది.

కోల్ కతా: కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ జూలు విదిల్చింది. అటు బ్యాటింగ్ లోనూ, ఇటు బౌలింగ్లోనూ సమష్టిగా రాణించిన గంభీర్ సేన ప్లే ఆఫ్ కు చేరింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఆదివారం ఇక్కడ ఈడెన్ గార్డెన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో కోల్ కతా 22 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ బెర్తును ఖాయం చేసుకుంది. కోల్ కతా నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడిన హైదరాబాద్  20.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి149 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. రాబిన్ ఉతప్ప(25) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, గౌతం గంభీర్(16) నిరాశపరిచాడు. ఆ తరువాత కోలిన్ మున్రో(10) అవుట్ కావడంతో కోల్ కతా 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో మనీష్ పాండే-యూసఫ్ పఠాన్ జోడి ఆదుకుంది. ఈ జోడి నాల్గో వికెట్ కు 87 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన అనంతరం మనీష్ (48;30 బంతుల్లో 2 ఫోర్లు, 3 ఫోర్లు) పెవిలియన్ కు చేరాడు. ఆపై యూసఫ్ పఠాన్(52 నాటౌట్;34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో కోల్ కతా గౌరవప్రదమైన స్కోరు నమోదు చేసింది.

అనంతరం బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ జట్టులో శిఖర్ ధవన్(51) హాఫ్ సెంచరీ మినహా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. డేవిడ్ వార్నర్ (18), నమాన్ ఓజా(15), యువరాజ్ సింగ్(19), విలియమ్సన్(7), దీపక్ హూడా(2)లు నిరాశపరచడంతో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ మూడు వికెట్లు సాధించగా, కుల్ దీప్ యాదవ్ కు రెండు వికెట్లు, షకిబుల్ హసన్ , రాజ్ పుత్ లకు తలో వికెట్ దక్కింది. ఇప్పటికే హైదరాబాద్ ప్లే ఆఫ్ కు చేరిన క్రమంలో కోల్ కతాపై ఓటమి ఆ జట్టుపై పెద్ద ప్రభావం చూపలేదు. ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించడంతో మూడు జట్ల ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యాయి. అంతకుముందు గుజరాత్ లయన్స్ ప్లే ఆఫ్ కు చేరిన సంగతి తెలిసిందే.  మరో ప్లే ఆఫ్ బెర్తుకోసం ఢిల్లీ డేర్ డెవిల్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల ఫలితం కోసం వేచి చూడాల్సిందే. ఇరు జట్ల మధ్య ఆదివారం రాత్రి రాయ్ పూర్ లో షాహిద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో తుది లీగ్ మ్యాచ్ జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement