నైట్‌రైడర్స్ బోణి
తొలి మ్యాచ్‌లో ముంబైపై గెలుపు
రాణించిన కలిస్, మనీష్ పాండే
నరైన్ స్పిన్ మ్యాజిక్
ఐపీఎల్-7కు ఘనమైన ఆరంభం లభించింది. నాణ్యమైన బ్యాటింగ్, అద్భుతమైన బౌలింగ్‌తో షారూఖ్ ఖాన్ జట్టు కోల్‌కతా నైట్‌రైడర్స్... 41 పరుగుల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్‌కు షాక్ ఇచ్చింది.
అబుదాబి: ఇటీవల టెస్టులకు గుడ్‌బై చెప్పిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కలిస్... ఐపీఎల్‌లో తానెంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కోల్‌కతాకు వెన్నెముకలా నిలిచాడు. భారత దేశవాళీ క్రికెటర్ మనీష్ పాండే కూడా కలిస్‌కు తోడుగా చెలరేగడంతో ఐపీఎల్-7లో నైట్‌రైడర్స్ బోణీ చేసింది. షేక్ జాయెద్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో గంభీర్ సేన 41 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌పై నెగ్గింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. కలిస్ (46 బంతుల్లో 72; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మనీష్ పాండే (53 బంతుల్లో 64; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్‌కు ఏకంగా 131 పరుగులు జోడించడం విశేషం. ముంబై బౌలర్లలో మలింగ (4/23) చక్కగా బౌలింగ్ చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. రాయుడు (40 బంతుల్లో 48; 4 ఫోర్లు) మినహా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. నరైన్ (4/20) సంచలన బౌలింగ్‌తో ముంబైకు ముకుతాడు వేశాడు.
నిలబెట్టిన భాగస్వామ్యం
రెండో ఓవర్‌లోనే మలింగ అద్భుతమైన యార్కర్‌కు గంభీర్ (0) వెనుదిరగడంతో పవర్‌ప్లే ఆరు ఓవర్లలో కోల్‌కతా నెమ్మదిగా ఆడింది.
క్రీజులో నిలదొక్కుకున్నాక మనీష్ పాండే చెలరేగిపోయాడు. మరో ఎండ్‌లో కలిస్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర లభించిన లైఫ్‌ను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ సమయోచితంగా రాణించి అద్భుతమైన భాగస్వామ్యంతో కోల్‌కతాను ఆదుకున్నారు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో 20, 16వ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి.
స్లాగ్ ఓవర్లలో మలింగ చకచకా వికెట్లు తీసినా... సూర్యకుమార్ యాదవ్ (5 బంతుల్లో 13 నాటౌట్; 3 ఫోర్లు) చివరి ఓవర్లో మూడు బౌండరీలతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
బౌలర్లంతా సమష్టిగా...
ఆరంభంలోనే ముంబై ఓపెనర్ హస్సీని నరైన్ అవుట్ చేయడంతో డిఫెండింగ్ చాంపియన్ తడబడింది. తారె (24) ఫర్వాలేదనిపించినా... వేగంగా ఆడలేదు. దీంతో 10 ఓవర్లలో ముంబై 54 పరుగులు మాత్రమే చేసింది.
రాయుడు, రోహిత్ క్రమంగా వేగం పెంచి 15 ఓవర్లలో 95 పరుగులకు స్కోరును చేర్చారు. అయితే ఇక్కడి నుంచి నరైన్ మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు. వరుస వికెట్లతో ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముంైబె కథ ముగించాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గంభీర్ (బి) మలింగ 0; కలిస్ (సి) అండర్సన్ (బి) మలింగ 72; మనీష్ పాండే (బి) మలింగ 64; ఉతప్ప (సి) రోహిత్ (బి) జహీర్ 1; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 4; షకీబ్ (సి) రోహిత్ (బి) మలింగ 1; సూర్యకుమార్ యాదవ్ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 163.
వికెట్ల పతనం: 1-4; 2-135; 3-144; 4-145; 5-149.
బౌలింగ్: జహీర్ 4-0-23-1; మలింగ 4-0-23-4; అండర్సన్ 3-0-33-0; ఓజా 4-0-36-0; హర్భజన్ 3-0-25-0; పొలార్డ్ 2-0-19-0.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: హస్సీ (బి) నరైన్ 3; ఆదిత్య తారె (సి)అండ్(బి) షకీబ్ 24; రాయుడు (స్టంప్డ్) ఉతప్ప (బి) నరైన్ 48; రోహిత్ (సి) కలిస్ (బి) మోర్కెల్ 27; పొలార్డ్ నాటౌట్ 6; అండర్సన్ (బి) నరైన్ 2; హర్భజన్ (బి) నరైన్ 0; గౌతమ్ (స్టంప్డ్) ఉతప్ప (బి) చావ్లా 7; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 122.
వికెట్ల పతనం: 1-24; 2-40; 3-101; 4-106; 5-113; 6-113; 7-122
బౌలింగ్: వినయ్ 2-0-15-0; మోర్కెల్4-0-16-1; నరైన్ 4-0-20-4; షకీబ్ 4-0-29-1; కలిస్ 3-0-23-0; చావ్లా 3-0-15-1.
ఐపీఎల్‌లో నేడు
ఢిల్లీ డేర్‌డెవిల్స్
x
బెంగళూరు రాయల్
చాలెంజర్స్
వేదిక: షార్జా; రా. గం. 8.00 నుంచి
సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం