కోల్‌కతా వీధుల్లో చిందేస్తాం: షారుఖ్
నేడు ఈడెన్‌లో జట్టుకు ఘన సన్మానం
కోల్‌కతా: బెంగాల్ రాజధాని కోల్‌కతా మరోసారి వేడుకలకు సిద్ధమవుతోంది. ఐపీఎల్ ఏడో సీజన్ టైటిల్‌ను గెలుచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు నేడు ఈడెన్ గార్డెన్స్‌లో ఘన సన్మానం జరుగనుంది. ముఖ్య అతిథిగా సీఎం మమతా బెనర్జీ హాజరుకానున్నారు. విజయయాత్రలో జట్టు యజమాని షారుఖ్ ఖాన్ తన నృత్యాలతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. కోల్‌కతా వీధులను సందడిగా మారుస్తామని చెబుతున్నాడు. ఈ విజయాన్ని తన చిన్న కుమారుడు అబ్‌రామ్‌కు అంకితమిస్తున్నట్టు చెప్పాడు. ‘ఈసారి హుగ్లీ నది ఒడ్డున డ్యాన్సులతో ఉర్రూతలూగిస్తాం.
అలాగే వీధులను కూడా వదలం. మమతాజీ... ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినట్టుగానే మేం మరోసారి వస్తున్నాం. మేం ఇప్పుడు చాంపియన్లం. పార్టీ ఇప్పటికే ప్రారంభమైంది’ అని షారుఖ్ తెలిపాడు. ఫైనల్లో పంజాబ్‌ను ఓడించిన అనంతరం తమ టీమ్ హోటళ్లో తెల్లవారు జాము దాకా ఆటగాళ్లు పార్టీలో మునిగితేలారు. మరోవైపు ఫైనల్లో తమ జట్టుపై సెంచరీ చేసిన పంజాబ్ ఆటగాడు సాహాను కూడా ఈ వేడుకలకు ఆహ్వానించారు.
కోల్‌కతాకు చేరిన గంభీర్ సేన
ఐపీఎల్ గెలిచిన నైట్‌రైడర్స్‌కు కోల్‌కతా విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. బెంగాల్ మంత్రి మదన్ మిత్రా, క్యాబ్ అధికారులు, వేలాది మంది అభిమానులు స్వాగతం పలికారు.