హంపికి ఆరో స్థానం
టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. మంగళవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో హంపి మొత్తం ఆరు పాయింట్లు సాధించింది. చివరిదైన 11వ రౌండ్‌లో తెల్ల పావులతో ఆడిన హంపి 61 ఎత్తుల్లో ప్రపంచ మాజీ చాంపియన్ అంటొనెటా స్టెఫనోవా (బల్గేరియా)ను ఓడించింది. ఈ టోర్నీలో హంపి మూడు గేముల్లో గెలిచి, రెండు గేముల్లో ఓడిపోయి, మిగతా ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. ఇదే టోర్నీలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక 4.5 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
చివరిదైన 11వ రౌండ్‌లో జు వెన్‌జున్ (చైనా)తో తలపడిన హారిక 50 ఎత్తుల్లో గేమ్‌ను ‘డ్రా’ చేసుకుంది. హారిక ఒక గేమ్‌లో గెలిచి, మూడింటిలో ఓడిపోయి, మిగతా ఏడింటిని ‘డ్రా’గా ముగించింది. హారిక, పియా క్రామ్లింగ్ (స్వీడన్), వాలెంటినా గునీనా (రష్యా) ముగ్గురూ 4.5 పాయింట్లు సంపాదించినా... మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా క్రామ్లింగ్ ఎనిమిదో స్థానంలో, హారిక తొమ్మిదో స్థానంలో, వాలెంటినా పదో స్థానంలో నిలిచారు. మొత్తం 12 మంది అగ్రశ్రేణి క్రీడాకారిణులు పాల్గొన్న ఈ టోర్నీలో జు వెన్‌జున్ 7.5 పాయింట్లతో విజేతగా నిలిచింది.