విహారి, సిరాజ్‌లకు చోటు
దక్షిణాఫ్రికా పర్యటనకు భారత ‘ఎ’ జట్ల ఎంపిక
ముంబై: దక్షిణాఫ్రికాలో జరిగే ముక్కోణపు వన్డే టోర్నీ, అనధికారిక టెస్టుల్లో పాల్గొనే భారత ‘ఎ’ జట్లను గురువారం ప్రకటించారు. వన్డే, టెస్టు జట్లలో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్‌కు చోటు లభించగా, ఆంధ్ర బ్యాట్స్‌మన్ హనుమ విహారి టెస్టు టీమ్‌లోకి ఎంపికయ్యాడు. జూలై 26నుంచి ఈ పర్యటన సాగుతుంది. ఇందులో భాగంగా భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు వన్డే టోర్నీ జరుగుతుంది. ఆ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. భారత అండర్–19 తరఫున ఆడిన విహారి ‘ఎ’ టీమ్‌లోకి ఎంపిక కావడం ఇదే మొదటిసారి.
సిరాజ్ గతంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ కోసం ‘ఎ’ జట్టులోకి ఎంపికైనా... మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. వీరిద్దరూ 2016–17 రంజీ ట్రోఫీ సీజన్‌లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విహారి 57.33 సగటుతో 688 పరుగులు చేయగా, సిరాజ్ 41 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ ద్వారా సిరాజ్‌కు కూడా గుర్తింపు లభించింది. వన్డే జట్టుకు మనీశ్ పాండే, టెస్టు జట్టుకు కరుణ్ నాయర్ సారథ్యం వహిస్తారు. వీరితో పాటు మరో సీనియర్ జట్టు సభ్యుడు జయంత్ యాదవ్‌కు కూడా ఇరు జట్లలోనూ చోటు లభించింది.
ఇండియా ‘ఎ’ జట్ల వివరాలు:
వన్డేలకు: మనీశ్ పాండే (కెప్టెన్), మన్‌దీప్, శ్రేయస్ అయ్యర్, సంజు సామ్సన్, దీపక్ హుడా, కరుణ్ నాయర్, కృనాల్ పాండ్యా, రిషభ్ పంత్, విజయ్ శంకర్, అక్షర్ పటేల్, చహల్, జయంత్ యాదవ్, బాసిల్ థంపి, సిరాజ్, శార్దూల్ ఠాకూర్, సిద్ధార్థ్ కౌల్
టెస్టులకు: కరుణ్ నాయర్ (కెప్టెన్), ప్రియాంక్ పాంచల్, ముకుంద్, శ్రేయస్ అయ్యర్, అంకిత్ బావ్నే, సుదీప్ ఛటర్జీ, ఇషాన్ కిషన్, విహారి, జయం త్ యాదవ్, షాబాజ్ నదీమ్, నవదీప్ సైని, సిరాజ్, శార్దుల్ ఠాకూర్, అనికేత్ చౌదరి, అంకిత్ రాజ్‌పుత్.