
సాక్షి, హైదరాబాద్: స్ట్రాంజా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించిన తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కె.తారకరామారావు (కేటీఆర్) అభినందించారు. సోమవారం హైదరాబాద్ చేరుకున్న నిఖత్ తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసింది. తాను గెలుచుకున్న స్వర్ణ పతకాన్ని ఆయనకు చూపించింది. నిఖత్ జరీన్ పోరాట స్ఫూర్తిని, పట్టుదలను ఈ సందర్భంగా కేటీఆర్ కొనియాడారు.
భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ నుంచి బాక్సింగ్‌లో అద్బుతమైన ప్రతిభాపాటవాలతో యువతకు ఒక మార్గదర్శిగా నిలుస్తున్నావని నిఖత్‌ను ప్రశంసించారు. నిఖత్ జరీన్‌కు అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వం తరఫున భవిష్యత్తులోనూ అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇన్ని రోజులుగా తనకు అందిస్తున్న సహకారం పట్ల ప్రభుత్వానికి, కేటీఆర్‌కు నిఖత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో క్రీడల మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాట్స్) చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment