అరంగేట్రంలోనే అదరగొడుతున్నాడు..
ధర్మశాల: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న చివరిదైన నాల్గో టెస్టు ద్వారా అంతర్జాతీయ మ్యాచ్ ల్లో అరంగేట్రం చేసిన భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అదరగొడుతున్నాడు. ఒక వైపు భారత ప్రధాన స్పిన్నర్లే వికెట్ల వేటలో వెనుబడితే, కుల్దీప్ మాత్రం తన మ్యాజిక్ ను ప్రదర్శిస్తూ ఆసీస్కు షాకిస్తున్నాడు.
ఇప్పటికే మూడు కీలక వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఆసీస్ ను ఇబ్బందుల్లోకి నెట్టాడు. ప్రధానంగా ఆసీస్ తన జోరును కొనసాగిస్తున్న సమయంలో భారత్ మంచి బ్రేకిచ్చాడు కుల్దీప్. తన టెస్టు కెరీర్ తొలి వికెట్ గా డేవిడ్ వార్నర్(56)ను అవుట్ చేసిన కుల్దీప్.. ఆ తరువాత కాసేపటికి మరో టాపార్డర్ ఆటగాడు హ్యాండ్సాంబ్(8)ని బోల్తా కొట్టించాడు. కుల్దీప్ అత్యంత తక్కువ ఎత్తులో సంధించిన బంతిని అర్ధం చేసుకోవడంలో విఫలమైన హ్యాండ్సాంబ్ బౌల్డ్ అయ్యాడు. ఆపై కొద్ది వ్యవధిలోనే మ్యాక్స్ వెల్ (1) ను బౌల్డ్ చేశాడు. దాంతో 178 పరుగుల వద్ద ఆసీస్ ఐదో వికెట్ ను కోల్పోయింది. అంతకుముందు షాన్ మార్ష్(4)ను ఉమేశ్ యాదవ్ మూడో వికెట్ గా అవుట్ చేసిన సంగతి తెలిసిందే.