టీమిండియాకు మరో మ్యాచ్ విన్నర్ దొరికినట్టే!
ప్రస్తుత ఐపీఎల్ టోర్నీలో తన స్పిన్ మాయాజాలంతో విశేషంగా ఆకట్టుకున్న యంగ్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా ఈ యువ బౌలర్ టాలెంట్‌తో ఫిదా అయ్యాడు. ఇండియన్ సెలెక్టర్లు కుల్దీప్ యాదవ్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరముందని సూచించాడు.
ప్రస్తుత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగిన కుల్దీప్ చక్కని బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. తాజా మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో కోల్‌కతా ఓడిపోయినా.. ఈ మ్యాచ్‌లో 35 పరుగులకు మూడు వికెట్లు తీసిన కుల్దీప్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ భవిష్యత్తులో టీమిండియాకు మరో మ్యాచ్ విన్నర్ కాగలడని గవాస్కర్ చెప్పాడు. 'అతను అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ యువకుడిపై దృష్టి పెట్టాల్సిందిగా సెలెక్టర్లకు నిజాయితీగా సలహా ఇస్తున్నా. అతను డిఫెరెంట్ బౌలర్. కొంచెం ఓపిక పడితే అతడు భవిష్యత్తులో భారత్‌కు మ్యాచ్ విన్నర్ కాగలడు. కాబట్టి అతనిపై ఓ కన్నేసి ఉంచాలి' అని గవాస్కర్ అన్నాడు.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌కు చెందిన ఈ 22 ఏళ్ల బౌలర్ ప్రస్తుత ఐపీఎల్‌లో మూడు మ్యాచ్‌లు ఆడి ఆరు వికెట్లు పడగొట్టాడు. దేశీవాళి క్రికెట్‌లో నిలకడగా ఆడుతున్న కుల్దీప్‌ను 2014 అక్టోబర్‌లో వెస్టిండీస్ సిరీస్ కోసం ఒకసారి జట్టులోకి తీసుకున్నారు కూడా.