సొంతగడ్డపైనే కాకుండా ప్రత్యర్థి వేదికపై కూడా భారత స్పిన్ మంత్రం అద్భుతంగా పని చేసింది. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లోనే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/24) చెలరేగిపోయాడు. అతని బంతులను
అర్థం చేసుకోలేక ప్రత్యర్థి ఆటగాళ్లు కంగారు పడ్డారు. కొంత కాలంగా విధ్వంసానికి చిరునామాగా మారిన ఇంగ్లండ్ బ్యాటింగ్ కుల్దీప్ బౌలింగ్ ముందు బేలగా మారిపోయింది.
మాంచెస్టర్: బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి పిచ్‌పై ఇంగ్లండ్ తడబడింది. కుల్దీప్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు స్వయంకృతాపరాధం కలగలిసి ఆ జట్టు తొలి టి20 మ్యాచ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (46 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా... జేసన్ రాయ్ (20 బంతుల్లో 30; 5 ఫోర్లు), డేవిడ్ విల్లీ (15 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఉమేశ్‌కు 2 వికెట్లు దక్కాయి. కడపటి వార్తలు అందేసమయానికి భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 103 పరుగులు సాధించింది.
ఒకే ఓవర్లో మూడు...
భువీ వేసిన తొలి ఓవర్లో రాయ్ రెండు ఫోర్లు బాదడటంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభమైంది. మరోవైపు బట్లర్ కూడా చక్కటి షాట్లు ఆడాడు. చహల్ వేసిన తొలి ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 16 పరుగులు రాబట్టిన ఇంగ్లండ్ తొలి 5 ఓవర్లలో 50 పరుగులు చేసింది. ఈ దశలో రాయ్‌ను ఉమేశ్ బౌల్డ్ చేసిన అనంతరం జోరు తగ్గింది. ఫలితంగా తర్వాతి ఐదు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే వచ్చాయి. పాండ్యా తర్వాతి ఓవర్లో బట్లర్ వరుసగా 4, 6, 4తో చెలరేగాడు. అయితే ఆ తర్వాత కుల్దీప్ మ్యాజిక్ మొదలైంది. తన తొలి ఓవర్లో 5 పరుగులు ఇచ్చిన అతను రెండో ఓవర్లో హేల్స్ (8)ను వెనక్కి పంపించాడు. అతని మూడో ఓవర్ ఇంగ్లండ్ పతనానికి కారణమైంది. తొలి నాలుగు బంతుల్లో అతను మోర్గాన్ (7), బెయిర్‌స్టో (0), రూట్ (0)లను ఔట్ చేసి సంచలనం నమోదు చేశాడు. ఆ తర్వాత అలీ (6) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇన్నింగ్స్‌లో మరో 15 బంతులు మిగిలి ఉన్న దశలో బట్లర్ ఇంకా క్రీజ్‌లో ఉండటంతో కొన్ని మెరుపులు ఖాయమనిపించింది. అయితే కుల్దీప్ మరో చక్కటి బంతితో బట్లర్ ఆట కూడా ముగించాడు. చివర్లో విల్లీ దూకుడు ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించింది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో మొత్తం 20 పరుగులు లభించాయి.
►ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన తొలి ఎడమ చేతివాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్
►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక స్టంపింగ్‌లు (33) చేసిన ఆటగాడిగా ధోని నిలిచాడు. పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (32)ను అతను అధిగమించాడు.
కుల్దీప్ కూల్చేశాడు
Published Wed, Jul 4 2018 1:11 AM | Last Updated on Wed, Jul 4 2018 7:15 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment