T-20 match
-
కుర్రాళ్లకు భలే చాన్స్
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో క్రికెట్ సందడి నెలకొంది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా గురు వారం రాత్రి 7 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ–20 మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్న ఇరు జట్లు స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్ విక్రయించారు. ప్రపంచకప్ ఫైనల్లో భారత్ ఓటమి తర్వాత క్రికెట్ అభిమానులు చాలా డీలా పడ్డారు. ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. కీలక పో రు ముగిసిన తర్వాత జరుగుతున్న టీ–20 మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో.. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో యువ క్రికెటర్లకు ఈ సిరీస్ గొప్ప సువర్ణావకాశం. ఐపీఎల్, ఇటీవల ఐర్లాండ్ టూర్లో విజృంభించిన కుర్రాళ్లు.. విశాఖ వేదికగా సత్తా చాటి జాతీయ జట్టులో బెర్త్ పదిలం చేసుకోవచ్చు. జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టి శుభారంభం అందించాలని కోరుకుంటున్నారు. వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ సాధించి ఊపు మీదు న్న ఆస్ట్రేలియా నాలుగు రోజుల వ్యవధిలోనే విశాఖ వేదికగా టీ20 సిరీస్‌కి సిద్ధమైంది. భారత్ తరఫున ప్రధాన ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆస్ట్రేలియా తరఫున కొందరు ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరారు. ఫైనల్లో సత్తాచాటిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటికే విశాఖకు చేరుకుని నెట్స్‌లో శ్రమించారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ ఆరంగేట్రం చేసే కుర్రాళ్లు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగనుండగా.. ఆసియా కప్, ఐర్లాండ్ టీ–20 సిరీస్ మినహా పూర్తిస్థాయిలో మేజర్ టోర్నీలు ఆడిన అనుభవం లేని యువ భారత్ జట్టు వారితో ఢీ కొట్టనుంది. భారత్‌కు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్‌కు, కోచ్‌గా వి.వి.ఎస్ లక్ష్మణ్‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భారత్ కుర్రాళ్లు శుభారంభం చేసి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నారు. పరిస్థితికి తగ్గట్టుగా రాణిస్తే విజయమే విశాఖ స్పోర్ట్స్: పరిస్థితులకు తగ్గట్టుగా రాణిస్తే విజయం సాధ్యమేనని భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. టీ–20 సిరీస్లోశుభారంభం చేసేందుకు ఎలాంటి ప్రణాళిక చేశారనే విషయాలను బుధవారం ఆయన మీడియాకు వివరించారు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో చాలా డిస్పాయింట్ అయ్యామని, అయితే టోర్నీ మొత్తం చాలా కష్టపడ్డామన్నారు. ఫైనల్‌కు చేరడంలో ప్రతీ ఆటగాడు సమష్టిగా జట్టుకు తోడ్పడినట్లు చెప్పారు. విశాఖలో పిచ్‌ను పరిశీలించానని, చాలా మంచి పిచ్ అన్నారు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించడం సవాలేనని, దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటానన్నారు. నూతనోత్తేజంతో ముందుకు సాగుతామన్నారు. -
WI Vs BAN, 3rd T20: పూరన్ ధనాధన్
జార్జిటౌన్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను వెస్టిండీస్ 2–0తో సొంతం చేసుకుంది. తొలి మ్యాచ్ వర్షంతో రద్దయింది. కెప్టెన్ నికోలస్ పూరన్ (39 బంతుల్లో 74 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో మూడో టి20 మ్యాచ్‌లో విండీస్ 10 బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. అఫీఫ్ హుస్సేన్ (38 బంతుల్లో 50; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), లిటన్ దాస్ (41 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అనంతరం విండీస్ 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసి విజయం సాధించింది. కైల్ మేయర్స్ (38 బంతుల్లో 55; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడి అర్ధ సెంచరీ చేశాడు. మేయర్స్, పూరన్ నాలుగో వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఈ రెండు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరుగుతుంది. -
మళ్లీ ఓడిన జింబాబ్వే
హరారే: సొంతగడ్డపై ముక్కోణపు టి20 టోర్నీలో జింబాబ్వేకు ఒక్క విజయం కూడా దక్కలేదు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. ముందుగా జింబాబ్వే 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. మిరే (52 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఆండ్రూ టై (3/28) జింబాబ్వేను దెబ్బ తీశాడు. ఆసీస్ 19.5 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (38 బంతుల్లో 56; 1 ఫోర్, 5 సిక్సర్లు), హెడ్ (42 బంతుల్లో 48; 3 ఫోర్లు) మూడో వికెట్‌కు 71 బంతుల్లోనే 103 పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
ఈ సెంచరీ అమూల్యం
మాంచెస్టర్: తన కెరీర్లో ఇప్పటి వరకు చేసిన అంతర్జాతీయ సెంచరీలతో పోలిస్తే మంగళవారం ఇంగ్లండ్‌పై చేసిన 101 పరుగులు వెల కట్టలేనివని భారత బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ వ్యాఖ్యానించాడు. ఈ ఇన్నింగ్స్‌కు తన దృష్టిలో ఎంతో ప్రాధాన్యత ఉందని అతను అన్నాడు. ‘ఈ శతకం చాలా సంతృప్తినిచ్చింది. గతంలోనూ నేను అంతర్జాతీయ సెంచరీలు సాధించినా వాటన్నింటికంటే ఇదే గొప్పగా అనిపిస్తోంది. నేను దాదాపు రెండేళ్ల తర్వాత సెంచరీ చేయడమే అందుకు కారణం. ఐపీఎల్లో, టెస్టుల్లో అర్ధ సెంచరీలతో పాటు అడపాదడపా పరుగులు సాధించినా... గాయాలు, జట్టులోకి వచ్చిపోవడంతో ఏడాదిన్నర కాలం కష్టంగా సాగింది. గతంలో ఫలానా లక్ష్యాన్ని అందుకోవాలని ఇంత కసిగా, పట్టుదలగా ఎప్పుడూ కోరుకోలేదు. కాబట్టి ఈ సెంచరీ నా దృష్టిలో ఎంతో ప్రత్యేకం’ అని రాహుల్ ఉద్వేగంగా చెప్పాడు. మంగళవారం రాత్రి ఇక్కడి ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 160 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెరీర్లో రెండో సెంచరీతో లోకేశ్ రాహుల్ (54 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ముందుండి గెలిపించగా, రోహిత్ శర్మ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ (4) ఔటైన తర్వాత జట్టు ఇన్నింగ్స్‌ను రాహుల్ నడిపించాడు. ప్లంకెట్ వేసిన 11వ ఓవర్లో రాహుల్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 20 పరుగులు సాధించడం ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. రోహిత్ ఔటయ్యాక కోహ్లి (20 నాటౌట్) అండగా నిలవడంతో రాహుల్ 53 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లి...అలీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టి20 శుక్రవారం కార్డిఫ్‌లో జరుగుతుంది. -
కుల్దీప్ కూల్చేశాడు
సొంతగడ్డపైనే కాకుండా ప్రత్యర్థి వేదికపై కూడా భారత స్పిన్ మంత్రం అద్భుతంగా పని చేసింది. ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లోనే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/24) చెలరేగిపోయాడు. అతని బంతులను అర్థం చేసుకోలేక ప్రత్యర్థి ఆటగాళ్లు కంగారు పడ్డారు. కొంత కాలంగా విధ్వంసానికి చిరునామాగా మారిన ఇంగ్లండ్ బ్యాటింగ్ కుల్దీప్ బౌలింగ్ ముందు బేలగా మారిపోయింది. మాంచెస్టర్: బ్యాటింగ్‌కు స్వర్గధామంలాంటి పిచ్‌పై ఇంగ్లండ్ తడబడింది. కుల్దీప్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు స్వయంకృతాపరాధం కలగలిసి ఆ జట్టు తొలి టి20 మ్యాచ్‌లో సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. జోస్ బట్లర్ (46 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా... జేసన్ రాయ్ (20 బంతుల్లో 30; 5 ఫోర్లు), డేవిడ్ విల్లీ (15 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఉమేశ్‌కు 2 వికెట్లు దక్కాయి. కడపటి వార్తలు అందేసమయానికి భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 103 పరుగులు సాధించింది. ఒకే ఓవర్లో మూడు... భువీ వేసిన తొలి ఓవర్లో రాయ్ రెండు ఫోర్లు బాదడటంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ధాటిగానే ప్రారంభమైంది. మరోవైపు బట్లర్ కూడా చక్కటి షాట్లు ఆడాడు. చహల్ వేసిన తొలి ఓవర్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 16 పరుగులు రాబట్టిన ఇంగ్లండ్ తొలి 5 ఓవర్లలో 50 పరుగులు చేసింది. ఈ దశలో రాయ్‌ను ఉమేశ్ బౌల్డ్ చేసిన అనంతరం జోరు తగ్గింది. ఫలితంగా తర్వాతి ఐదు ఓవర్లలో 27 పరుగులు మాత్రమే వచ్చాయి. పాండ్యా తర్వాతి ఓవర్లో బట్లర్ వరుసగా 4, 6, 4తో చెలరేగాడు. అయితే ఆ తర్వాత కుల్దీప్ మ్యాజిక్ మొదలైంది. తన తొలి ఓవర్లో 5 పరుగులు ఇచ్చిన అతను రెండో ఓవర్లో హేల్స్ (8)ను వెనక్కి పంపించాడు. అతని మూడో ఓవర్ ఇంగ్లండ్ పతనానికి కారణమైంది. తొలి నాలుగు బంతుల్లో అతను మోర్గాన్ (7), బెయిర్‌స్టో (0), రూట్ (0)లను ఔట్ చేసి సంచలనం నమోదు చేశాడు. ఆ తర్వాత అలీ (6) కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఇన్నింగ్స్‌లో మరో 15 బంతులు మిగిలి ఉన్న దశలో బట్లర్ ఇంకా క్రీజ్‌లో ఉండటంతో కొన్ని మెరుపులు ఖాయమనిపించింది. అయితే కుల్దీప్ మరో చక్కటి బంతితో బట్లర్ ఆట కూడా ముగించాడు. చివర్లో విల్లీ దూకుడు ఇంగ్లండ్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించింది. భువనేశ్వర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో అతను 2 ఫోర్లు, సిక్స్ కొట్టడంతో మొత్తం 20 పరుగులు లభించాయి. ►ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన తొలి ఎడమ చేతివాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ►అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక స్టంపింగ్‌లు (33) చేసిన ఆటగాడిగా ధోని నిలిచాడు. పాక్ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ (32)ను అతను అధిగమించాడు. -
ఆ రికార్డుకు కార్తీక్ దూరం..
భారత్, ఐర్లాండ్ మధ్య డబ్లిన్‌లోని మలహిదే క్రికెట్ గ్రౌండ్ తొలి టీ-20కు వేదికైంది. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తుది జట్టులో దినేష్ కార్తీక్, లోకేష్ రాహుల్‌లకు స్థానం దక్కలేదు. ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ-20 మ్యాచ్‌తో ఎంఎస్ ధోనీ, సురేష్ రైనాలు అరుదైన ఘనతను సాధించారు. ఈ తొలి టీ20 మ్యాచ్‌తో టీమిండియా 100 అంతర్జాతీయ టీ-20ల మైలురాయిని చేరుకున్న విషయం విదితమే. తొలి టీ-20లో, 100వ టీ-20లో ఆడిన ఆటగాళ్లుగా ధోని, రైనాలు రికార్డును సాధించారు. ఇండయా జట్టు 2006లో మొదటి టీ-20 మ్యాచ్ ఆడింది. ఈ ఘనతను దినేష్ కార్తీక్ కోల్పోయాడు. తొలి టీ-20 మ్యాచ్ ఆడిన కార్తీక్.. 100వ టీ-20 ఆడుతున్న టీంలో తుది జట్టులో స్ధానం దక్కించులేదు. ఇండియా జట్టు 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విషయం తెలిసిందే. టీమిండియా తమ స్థాయికి తగినట్లుగా విజయంపై దృష్టి పెట్టగా... గతంలోనూ పలు సంచలనాలు నమోదు చేసిన ఐర్లాండ్ సొంతగడ్డపై మరోసారి అలాంటి ఆటతీరు కనబర్చాలని పట్టుదలగా ఉంది. జట్టు బలాబలాలు, ఫామ్ దృష్ట్యా చూస్తే భారత్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవలే టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌కు టీ20ల్లో కూడా మంచి రికార్డు ఉండటం, స్థానిక పరిస్థితుల అనుకూలత కారణంగా మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. తుది జట్లు భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్,సురేష్ రైనా,మనీష్ పాండే, హర్దిక్ పాండ్యా,ధోని, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా ఐర్లాండ్: విల్సన్ (కెప్టెన్), స్టిర్లింగ్, షెనాన్, బల్బిర్నీ, సిమిసింగ్, కెవిన్ ఓబ్రైన్, థాంప్సన్, పాయింటర్, డాక్రెల్, రాంకిన్, ఛేజ్. -
బంగ్లాదేశ్‌పై 17 పరుగులతో గెలుపు
-
దర్జాగా ఫైనల్‌కు...
అన్ని రంగాల్లో ఆధిపత్యం... ప్రత్యర్థిపై సాధికార విజయం... రన్‌రేట్, గణాంకాలతో పని లేదు... అవతలి జట్ల ఫలితాలతో సంబంధం లేదు... తుది సమరానికి ఆత్మవిశ్వాసంతో పయనం... టీమిండియా కప్ గెలవడమే ఇక తరువాయి! కొలంబో: టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. దాంతో నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నమెంట్లో భారత్ రాజసంగా ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఇక్కడ జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... కెప్టెన్ రోహిత్ శర్మ (61 బంతుల్లో 89; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు, సురేశ్ రైనా (30 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్ (27 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)ల సమయోచిత ఆటతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం వాషింగ్టన్ సుందర్ (3/22) స్పిన్ ఉచ్చులో చిక్కిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ (55 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) తుదికంటా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. తమీమ్ ఇక్బాల్ (19 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), షబ్బీర్ రహ్మాన్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప మిగతావారెవరూ రాణించలేదు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. రోహిత్ జయహో... రైనా అదరహో ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం, ఆపై బంగ్లా బలహీన బౌలింగ్‌ను తలచుకుని భారత్ భారీ స్కోరు చేసేందుకు మంచి అవకాశంగా అభిమానులు భావించారు. కానీ ప్రత్యర్థి ఇందుకు ఆస్కారం ఇవ్వలేదు. పైగా తొలి ఐదు ఓవర్లను ఒక్కో బౌలర్‌తో వేయించి ఆశ్చర్యపరిచిం ది. టీమిండియా ఓపెనర్లలో ధావన్ ఎప్పటిలాగే జోరు చూపించినా, రోహిత్ టైమింగ్ కుదరక ఇబ్బంది పడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ ఓ మాదిరిగానే ప్రారంభమైంది. పదో ఓవర్ ఐదో బంతికి ధావన్ అవుటయ్యేసరికి భారత్ స్కోరు 70/1. రోహిత్ ఎక్కువ బంతులు ఎదుర్కొన్నా దూకుడుగా ఆడలేకపోయాడు. 13వ ఓవర్లో కాని అతడి అర్ధ శతకం (42 బంతుల్లో) పూర్తవలేదు. గత నెలలో పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో దక్షిణాఫ్రికాపై శతకం తర్వాత ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌కిదే తొలి అర్ధ శతకం కావడం గమనార్హం. అయితే... తర్వాతి నుంచే పరిస్థితి మారింది. కుదురుకున్న రైనా, మెహదీ హసన్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ఊపులోకి వచ్చాడు. ఇద్దరూ జోరు చూపడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. ఇక అబు హైదర్ వేసిన 18వ ఓవర్లో రోహిత్ రెండు, రైనా ఒక సిక్స్ కొట్టి 21 పరుగులు పిండుకు న్నారు. దీంతో కెప్టెన్ వ్యక్తిగత స్కోరు 79కి చేరింది. 19వ ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టిన ‘హిట్‌మ్యాన్’ సెంచరీ చేయడం ఖాయంగా కనిపించింది. కానీ చివరి ఓవర్ అద్భుతంగా వేసిన రూబెల్ హుస్సేన్ 4 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. సుందర్ మాయలో పడి... గత మ్యాచ్‌లో లంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆశ్చర్యపరిచిన బంగ్లాదేశ్‌కు ఈసారి 177 పరుగులు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ బంగ్లా జట్టు భారత యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వలలో పడిపోయింది. టోర్నీలో కొత్త బంతిని పంచుకుంటూ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్న సుందర్ తన మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. వరుస ఓవర్లలో లిటన్ దాస్ (7), సౌమ్య సర్కార్ (1), తమీమ్ ఇక్బాల్‌లను పెవిలియన్‌కు పంపి బంగ్లాను దెబ్బతీశాడు. కెప్టెన్ మహ్ముదుల్లా (11)ను చహల్ అవుట్ చేయడంతో ఆ జట్టు 61 పరుగులకే నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. ముష్ఫికర్, షబ్బీర్‌లు అయిదో వికెట్‌కు 65 పరుగులు జోడించినా అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. భారత బౌలర్లలో చహల్ (1/21), విజయ్ శంకర్ (0/28) రాణించినా, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (1/50) ధారాళంగా పరుగులిచ్చాడు. ►అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ (75 సిక్సర్లు) రికార్డు. ►భారత్ తరఫున టి20 మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన పిన్న వయస్సు బౌలర్‌గా సుందర్ (18 ఏళ్ల 160 రోజులు) గుర్తింపు. అక్షర్ పటేల్ (21 ఏళ్ల 178 రోజులు; జింబాబ్వేపై 2015లో) పేరిట ఉన్న రికార్డు తెరమరుగు. ►టి20ల్లో బంగ్లాదేశ్‌పై భారత్‌కిది వరుసగా ఏడో విజయం. -
ఫైనల్ వేటలో...
రెండు వరుస విజయాల ఊపులో భారత్... శ్రీలంకపై రికార్డు ఛేదన ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్... టీమిండియా గెలిస్తే రాజసంగా ఫైనల్ చేరుతుంది... బంగ్లాదేశ్ నెగ్గితే తుది పోరు రేసులో ముందుంటుంది! కొలంబో: అనుభవం లేని ఆటగాళ్లతో బరిలో దిగి... ఆరంభ విఘ్నాన్ని అధిగమించి గాడిన పడిన టీమిండియా బుధవారం నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది. రోహిత్ సేనకిది చివరి లీగ్ మ్యాచ్. కాగా ముష్ఫికర్ బృందం ఆతిథ్య శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీంట్లో నెగ్గితే... రన్‌రేట్ వంటి సాంకేతికాంశాల అవసరం లేకుండా భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఓడినా ప్రస్తుతానికి రన్‌రేట్ మెరుగ్గా (+0.21) ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది రాదు. అయితే... శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం కోసం కొంత ఎదురుచూడాల్సి రావచ్చు. మార్పుల్లేకుండానే భారత్! టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై పరాజయం నుంచి టీమిండియా త్వరగానే కోలుకుంది. స్థాయికి తగ్గట్లు ఆడి తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకుంది. బంగ్లాదేశ్‌పై ఈ స్థితిలో ప్రయోగాలు చేసి ఇబ్బంది పడటం ఎందుకని భావిస్తే గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలో దించే అవకాశం ఉంది. దీంతో రిషభ్ పంత్ సహా మొహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, దీపక్ హుడా మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. అయితే... ప్రధాన ఆందోళనంతా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించే. మరో ఓపెనర్ ధావన్ రాణిస్తున్నా, రోహిత్ తక్కువ స్కోర్లకే వెనుదిరుగుతుండటంతో శుభారంభాలు దక్కడం లేదు. కీలకమైన ఫైనల్‌కు ముందు కెప్టెన్ ఫామ్ అందుకుంటే జట్టుకు అంతకుమించిన ఆనందం ఉండదు. మరోవైపు కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపి రోహిత్ నాలుగో స్థానంలో వచ్చే ఆలోచనపైనా చర్చ జరుగుతోంది. రైనా మెరుపులకు తోడు మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్‌లతో మిడిలార్డర్ స్థిరంగా ఉంది. అచ్చం బ్యాటింగ్లోలాగే బౌలింగ్‌లో ‘ఓపెనింగ్’ ఇబ్బంది ఎదురవుతోంది. పేసర్ జైదేవ్ ఉనాద్కట్ భారీగా పరుగులిస్తున్నాడు. కొత్త బంతి పంచుకుంటున్న యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పొదుపైన బౌలింగ్, ఆపై శార్దుల్ ఠాకూర్, విజయ్ శంకర్ కొంత కట్టడి చేస్తుండటంతో ప్రభావం కనిపించడం లేదు. వీరితో పాటు చహల్ సైతం మెరుగ్గా రాణిస్తేనే... బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను నిలువరించగలరు. బ్యాటింగ్‌పైనే బంగ్లా ఆశలు తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్‌దాస్, ముష్ఫికర్ రహీమ్ లంకపై చెలరేగి ఆడారు. కెప్టెన్ మహ్మూదుల్లా, షబ్బీర్ రెహ్మాన్ రాణించకున్నా జట్టు ఘన విజయం సాధించిందంటే వీరే కారణం. ఇప్పటివరకు పెద్దగా బయటపడని తన ఆటను లిటన్‌దాస్ గత మ్యాచ్‌లో రుచి చూపించాడు. సౌమ్యను కాదని తనను ఓపెనర్‌గా పంపిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ రెండు మార్పులు చేసేలా కనిపిస్తోంది. భారీగా పరుగులిస్తున్న తస్కిన్ అహ్మద్ స్థానంలో అబు జయేద్‌ను, బ్యాట్స్‌మన్ షబ్బీర్ బదులు ఆరిఫుల్ హక్‌ను ఎంచుకోవచ్చు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న ఈ జట్టుకు... పేసర్లు ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, స్పిన్నర్ మెహదీ హసన్‌ల ప్రతిభ తోడైతే విజయం కష్టం కాబోదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రైనా, రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, చహల్, శార్దుల్ ఠాకూర్, జైదేవ్ ఉనాద్కట్. బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్‌దాస్, ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్/ఆరిఫుల్ హక్, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్/అబు జయేద్, మెహదీ హసన్, నజ్ముల్ ఇస్లాం. పిచ్, వాతావరణం సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. రాత్రి గం. 7 నుంచి డి స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం -
నిదహస్ టోర్నీలో మెరుపు..!
బంతిని ఎక్కడ వేయాలో పాలుపోని బౌలర్లు... వంతులవారీ హిట్టింగ్ అందుకున్న బ్యాట్స్‌మెన్... అచ్చమైన టి20 మ్యాచ్‌ను తలపించిన ఆటతీరు... ఓవర్‌కు పదికి తగ్గకుండా పరుగుల ప్రవాహం... పోటాపోటీగా ఆడి లంకపై బంగ్లా జయభేరి... మొత్తమ్మీద అభిమానులకు మజామజా... కొలంబో: సాదాసీదాగా, చప్పగా సాగుతున్న నిదహస్ ముక్కోణపు టి20 టోర్నీలో ఓ మెరుపు మ్యాచ్. బ్యాట్స్‌మెన్ విజృంభణతో ప్రేక్షకులకు కనువిందు. ఫోర్లు, సిక్సర్ల హోరుతో మోతెక్కిన స్టేడియం. శనివారం ఇక్కడ జరిగిన భారీ స్కోర్ల మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ముష్ఫికర్ రహీమ్ (35 బంతుల్లో 72 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), లిటన్ దాస్ (19 బంతుల్లో 43; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు)ల వీరోచిత ఆటతో ఆతిథ్య శ్రీలంకపై బంగ్లాదేశ్ తమ జట్టు చరిత్రలో రికార్డు ఛేదన నమోదు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఇన్నింగ్స్‌ను ఓపెనర్ కుశాల్ మెండిస్ (30 బంతుల్లో 57; 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా మొదలుపెట్టగా, మధ్యలో కుశాల్ పెరీరా (48 బంతుల్లో 74; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుతో నిలబెట్టాడు. చివర్లో తరంగ (15 బంతుల్లో 32; 4 ఫోర్లు, 1 సిక్స్) తనవంతు బాధ్యత పోషించాడు. దీంతో ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో ముస్తఫిజుర్ (3/48) వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులిచ్చాడు. మహ్ముదుల్లా (2/15) మాత్రమే ప్రత్యర్థిని కొంత కట్టడి చేయగలిగాడు. ఛేదనను బంగ్లా దీటుగా ఆరంభించింది. అనూహ్యంగా ఓపెనర్‌గా వచ్చిన లిటన్ ఆకాశమే హద్దుగా చెలరేగగా, తమీమ్ ఇక్బాల్ (29 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్) అతడికి అండగా నిలిచాడు. ముష్ఫికర్ ఒత్తిడిని చిత్తుచేస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 19.4 ఓవర్లలో అయిదు వికెట్లు కోల్పోయి బంగ్లా 215 పరుగులు చేసి విజయాన్నందుకుంది. లంక బౌలర్లలో నువాన్ ప్రదీప్ (2/37) ఫర్వాలేదనిపించాడు. ప్రస్తుతం టోర్నీలో మూడు జట్లు ఒక్కో గెలుపుతో సమంగా ఉన్నాయి. సోమవారం జరిగే మ్యాచ్‌లో భారత్ శ్రీలంకతో తలపడుతుంది. పరుగు‘లంక’.. లంకకు ఓపెనర్లు గుణతిలక (19 బంతుల్లో 26; 3 ఫోర్లు, 1 సిక్స్), కుశాల్ మెండిస్ అదిరే ఆరంభాన్నిచ్చారు. వీరి జోరుతో 4వ ఓవర్లోనే జట్టు స్కోరు 50 దాటింది. వెంటనే గుణతిలక అవుటైనా, బంగ్లాకు కుశాల్ పెరీరా రూపంలో పెనుముప్పు ఎదురైంది. మొదట అతడు కుదురుకునేందుకు యత్నించడంతో పవర్ ప్లే అనంతరం మూడు ఓవర్లలో 16 పరుగులే వచ్చాయి. పదో ఓవర్ నుంచి ఇద్దరూ జోరు పెంచారు. ప్రత్యర్థి బౌలర్లు పదేపదే షార్ట్ పిచ్ బంతులేస్తూ గతి తప్పడంతో ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. 26 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేసుకున్న మెండిస్... మహ్ముదుల్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి వెనుదిరిగాడు. హిట్టర్‌గా వచ్చిన షనక (0) రెండు బంతుల వ్యవధిలో అవుటయ్యాడు. మరుసటి ఓవర్లో పెరీరా అర్ధ శతకం (34 బంతుల్లో) పూర్తిచేసుకోగా చివరి బంతికి కెప్టెన్ చండిమాల్ (2) క్యాచ్ ఇచ్చాడు. ఈ దశలో తరంగ, పెరీరా బ్యాట్ ఝళిపించారు. 25 బంతుల్లోనే 55 పరుగులు జత చేశారు. చివరి ఓవర్లో కుశాల్, తిసార (0)లను ముస్తఫిజుర్ పెవిలియన్‌కు పంపినా 16 పరుగులిచ్చాడు. ప్రధాన బౌలర్లు తస్కిన్ అహ్మద్, రూబెల్ హుస్సేన్, మెహదీ హసన్ భారీగా పరుగులివ్వడంతో కెప్టెన్ మహ్ముదుల్లా బౌలింగ్‌కు దిగాల్సి వచ్చింది. బంగ్లా తరఫున మొత్తం ఏడుగురు ఆటగాళ్లు బౌలింగ్ చేయడం విశేషం. లిటన్ చితక్కొట్టెన్... ముష్ఫికర్ ముగించెన్ బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ టాప్ స్కోరరే అయినా... లిటన్ ఆట కూడా హైలైట్‌గా నిలిచింది. తామెప్పుడూ ఛేదించనంత లక్ష్యాన్ని అందుకోగలమని అతడు జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు. రెగ్యులర్ ఓపెనర్ సౌమ్య సర్కార్‌ను కాదని తనను ముందుగా పంపిన అవకాశాన్ని లిటన్ సద్వినియోగం చేసుకున్నాడు. లంక బౌలర్లపై విరుచుకుపడి పరుగులు సాధించాడు. ఓపెనర్లు ఎక్కడా తగ్గకపోవడంతో తొలి ఓవర్ నుంచే బంగ్లా 10 రన్‌రేట్‌తో పరుగులు చేసింది. లిటన్ వికెట్ కోల్పోయినా పవర్ ప్లే పూర్తయ్యేసరికి 74/1తో నిలిచింది. అప్పటికీ జోరు కొనసాగించిన తమీమ్‌ను తిసార పెరీరా తన బౌలింగ్‌లోనే క్యాచ్ పట్టి పెవిలియన్ చేర్చాడు. సౌమ్య సర్కార్ (22 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడలేకపోయాడు. కెప్టెన్ మçహ్ముదుల్లా (20; 1 ఫోర్, 1 సిక్స్), షబ్బీర్ రెహ్మాన్ (0) వెంటవెంటనే అవుటైనా, చేయాల్సిన పరుగుల కంటే బంతులు తక్కువగా ఉన్నా ముష్ఫికర్ బెరుకు లేకుండా ఆడాడు. చివరి ఓవర్లో 9 పరుగులు చేయాల్సి ఉండగా... నాలుగు బంతుల్లోనే లాంఛనాన్ని ముగించాడు. -
నేడు బంగ్లాదేశ్‌తో భారత్ ‘ఢీ’
-
గెలవాలంటే కొట్టాలి
కొలంబో: టి20 మ్యాచ్‌లో మోస్తరు లక్ష్యం నిర్దేశించి... విజయం సాధించాలంటే పటిష్ట బౌలింగ్ వనరులుండాలి. ఇలా కాకుంటే భారీ స్కోరు చేసి ప్రత్యర్థిని ముందే ఒత్తిడికి గురిచేయాలి. మొదటి మ్యాచ్‌లో లంకపై రోహిత్ సేన ఈ రెండూ చేయలేక ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌లో సాదాసీదా ప్రదర్శన... తర్వాత పస లేని బౌలింగ్‌తో మ్యాచ్ చేజారింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ మెరుపులూ తోడైతేనే టీమిండియాది పైచేయి అవుతుంది. స్కోరు 200 దాటాలి... ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కనీసం 200 పరుగులు చేయాలి. ప్రస్తుత మన బౌలింగ్ పరిమితులరీత్యా ఈ స్థాయి స్కోరుంటేనే గెలుపుపై నిశ్చింతగా ఉండగలం. దీనికి పునాది వేయాల్సింది కెప్టెన్ రోహిత్ శర్మనే. పేలవ ఫామ్ నుంచి అతడు త్వరగా బయటపడి... అద్భుతంగా ఆడుతున్న మరో ఓపెనర్ ధావన్‌కు తోడైతే ఇదేమంత కష్టం కాదు. బౌలింగ్‌లో తొలి మ్యాచ్‌లో సుందర్ మినహా అందరూ తేలిపోయారు. పేసర్లు శార్దుల్, ఉనాద్కట్ ప్రభావం చూపకపోవడంతో పార్ట్ టైమర్లను ఆశ్రయించాల్సి వచ్చింది. వీరితో పాటు చహల్ కూడా గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో విజయ్ శంకర్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఈ ఒక్కటి తప్ప మార్పులు ఉండకపోవచ్చు. -
మూడో టి20లో భారత్‌దే విజయం
-
'మిషన్' ముగిసింది
దక్షిణాఫ్రికా ఆధిపత్యంతో టెస్టు సిరీస్ ఫలితం ముందే తెలిసిపోయింది. భారత్ దూకుడుతో వన్డే సిరీస్ ఏకపక్షంగా సాగింది. ఉత్కంఠ రేపే టి20 ఫార్మాట్లో మాత్రం రెండు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సిరీస్ విజయం కోసం ఆఖరి మ్యాచ్ వరకు ఆగాయి. ఇందుకు తగ్గట్లే ఒకింత ఆసక్తిగా సాగిన మూడో టి20లో విజయం మన జట్టునే వరించింది. తద్వారా సఫారీ గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా రికార్డు సొంతమైంది. ఏ లక్ష్యంతో దక్షిణాఫ్రికాకు టీమిండియా వచ్చిందో దానిని సాధించి సగర్వంగా తిరుగు పయనం కానుంది. కేప్‌టౌన్: సఫారీ పర్యటనలో ఆఖరి పంచ్ మనదే అయింది. దక్షిణాఫ్రికా పోరాటంతో శనివారం ఇక్కడ ఒకింత ఉత్కంఠగా సాగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో 7 పరుగులతో భారత్ జయకేతనం ఎగురవేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ (40 బంతుల్లో 47; 3 ఫోర్లు), సురేశ్ రైనా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. అనంతరం ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ డుమిని (41 బంతుల్లో 55; 3 సిక్స్‌లు, 2 ఫోర్లు) అర్ధ శతకం, జాన్కర్ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు ప్రొటీస్‌ను గెలిపించలేకపోయాయి. దీంతో భారత్ 2–1 తేడాతో సిరీస్‌ను గెల్చుకుంది. సురేశ్ రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది. మూడో మ్యాచ్‌కు సఫారీ జట్టులో స్మట్స్ స్థానంలో క్రిస్టియన్ జాన్కర్ అరంగేట్రం చేయగా, ప్యాటర్సన్ బదులు ఫాంగిసోను తీసుకున్నారు. భారత్ మూడు మార్పులతో బరిలో దిగింది. వెన్ను పట్టేయడంతో కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కాగా... అతడి స్థానంలో దినేశ్ కార్తీక్ వచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైన చహల్, ఉనాద్కట్‌లను పక్కనపెట్టి అక్షర్ పటేల్, బుమ్రాలకు చోటిచ్చారు. రైనా మెరుపులు... ధావన్ నిలకడ టాస్కు కోహ్లి కాకుండా రోహిత్ శర్మ మైదానంలోకి రావడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. అయితే సారథ్య బాధ్యత కూడా రోహిత్ (11) ఆటలో మార్పు చూపలేదు. ఈ ఫార్మాట్లో అతడి పేలవ ఫామ్ కొనసాగింది. మోరిస్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టినప్పటికీ... రెండో ఓవర్ మూడో బంతికే డాలాకు ఎల్బీగా చిక్కాడు. మూడు టి20ల్లోనూ డాలా బౌలింగ్‌లోనే రోహిత్ అవుటవడం గమనార్హం. భారత ఇన్నింగ్స్‌లో హైలైట్ ఆటంటే రైనాదే. వన్‌డౌన్‌లో మరోసారి మెరుపులు మెరిపించాడీ లెఫ్ట్ హ్యాండర్. ఎదుర్కొన్న తొలి బంతినే స్క్వేర్ లెగ్‌లో సిక్స్ బాదాడు. ఓవైపు ధావన్ టైమింగ్ కుదరక ఇబ్బంది పడుతుంటే తను మాత్రం స్వేచ్ఛగా ఆడాడు. చకచకా సింగిల్స్, డబుల్స్ తీస్తూనే అలవోకగా ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 49 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. ఇదే ఊపులో షమ్సీ బంతిని భారీ షాట్ ఆడబోయిన రైనా లాంగాన్‌లో బెహర్దీన్‌కు చిక్కాడు. మరోవైపు రెండు లైఫ్‌లు పొందిన ధావన్ 29వ బంతికి తొలి బౌండరీ సాధించాడు. వెంటవెంటనే ఇంకో రెండు ఫోర్లు కొట్టినా... జట్టు అవతలి ఎండ్‌లో మనీశ్ పాండే (10 బంతుల్లో 13; 1 సిక్స్) వికెట్ కోల్పోయింది. కొద్దిసేపటికే రెండో పరుగుకు యత్నించిన ధావన్ డీప్ మిడ్‌వికెట్ నుంచి డాలా విసిరిన డైరెక్ట్ హిట్‌కు రనౌటయ్యాడు. హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 21; 1 సిక్స్), ధోని (11 బంతుల్లో 12) బ్యాట్ ఝళిపించలేకపోయారు. క్రీజులో కీలక బ్యాట్స్‌మెన్ ఉన్నా ఆతిథ్య జట్టు బౌలర్లు పుంజుకోవడంతో ఒక దశలో టీమిండియాకు 29 బంతుల పాటు బౌండరీ కూడా రాలేదు. చివర్లో దినేశ్ కార్తీక్ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) దూకుడుతో స్కోరు బోర్డులో కొంత కదలిక వచ్చింది. డుమిని నిలిచాడు... జాన్కర్ భయపెట్టాడు 173 పరుగుల ఛేదనలో ప్రొటీస్‌కు శుభారంభం దక్కలేదు. భారత ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, శార్దుల్‌తో పాటు హార్దిక్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆ జట్టు లక్ష్యం దిశగా పరుగులు చేయలేకపోయింది. మూడో ఓవర్లో హెన్డ్రిక్స్ (7)ను అవుట్ చేసి భువీ బ్రేక్ ఇవ్వగా, ఓపెనర్‌గా వచ్చిన మిల్లర్ (23 బంతుల్లో 24; 1సిక్స్, 2 ఫోర్లు)ను రైనా వెనక్కుపంపాడు. విధ్వంసక క్లాసెన్ (7) ఆటలు ఈసారి సాగలేదు. కానీ కెప్టెన్ డుమిని పోరాటం సాగించాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇతడిని శార్దుల్ ఔట్ చేశాడు. వెంటనే మోరిస్ (4) కూడా అవుటయ్యాడు. అప్పటికి విజయ సమీకరణం 21 బంతుల్లో 59. అయితే... అరంగేట్ర ఆటగాడు జాన్కర్ తన విధ్వంసంతో భయపెట్టాడు. బెహర్దీన్ (15 నాటౌట్) తోడుగా విరుచుకుపడ్డాడు. జాన్కర్ ధాటికి 17, 18, 19 ఓవర్లలో కలిపి సఫారీ జట్టుకు ఏకంగా 45 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో 19 చేయాల్సి ఉండగా భువీ 11 పరుగులతోనే సరిపెట్టాడు. -
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా
కేప్‌టౌన్: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. చెరో మ్యాచ్ గెలిచి సమంగా ఉన్న భారత్-దక్షిణాఫ్రికాలు ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పంతం పట్టాయి. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇరు జట్లకు చివరి టీ -20 కీలకంగా మారింది. దీంతో క్రికెట్ అభిమానులకు ఈ మ్యాచ్ అసలైన టీ-20గా నిలిచే అవకాశం ఉంది. కాగా, ఈ మ్యాచ్ పలు రికార్డులకు వేదిక కానుంది. -
స్వయంకృతం
సాక్షి క్రీడా విభాగం : తరిమిన మేఘావృత వాతావరణం... చేజారిన కొన్ని అవకాశాలు... కీలక సమయంలో నిర్ణయ లోపాలు... ప్రత్యర్థి జట్టులో ఓ అద్భుత భాగస్వామ్యం... సెంచూరియన్ పిచ్‌పై సరిపడా పరుగులు చేసినా రెండో టి20లో భారత్ ఓడిపోవడానికి కారణాలివే! ఇప్పుడో అప్పుడో వాన కురుస్తుందేమో అన్న ఊగిసలాట మధ్య సాగిన ఆటలో ప్రొటీస్ది పైచేయి కావడానికీ ఇవే ఆస్కారమిచ్చాయి. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ వరకు వర్షం వెంటాడింది. దీంతో ‘డక్‌వర్త్ లూయిస్’ లెక్కలు బయటకు వచ్చాయి. తొలుత దక్షిణాఫ్రికా దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆడింది. అలా వర్తింపజేసినా గెలుపు మనవైపే ఉంది. ఎప్పుడైతే వాన ముప్పు తప్పిందో... అప్పుడే మరో ప్రమాదం క్లాసెన్ రూపంలో ముంచుకొచ్చింది. నాలుగో వన్డేలో మన జట్టు జోరును సైంధవుడిలా అడ్డుకున్న ఈ సఫారీ వికెట్ కీపర్ ఈసారి టి20లో సరిగ్గా అదే పాత్ర పోషించాడు. ఒక్కసారిగా విరుచుకుపడి సమీకరణాలు మార్చేశాడు. ఆరంభం మనదే అయినా... 186... సెంచూరియన్‌లో టి20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్ల సగటు స్కోరిది. టీమిండియా దీనికి రెండు పరుగులు అదనంగానే చేసింది. భువనేశ్వర్, శార్దుల్ ప్రారంభ ఓవర్ల బౌలింగ్, ఓపెనర్లు త్వరగా వెనుదిరగడం చూస్తే ప్రత్యర్థికి ఛేదన కష్టమే అనిపించింది. అయితే, వచ్చీరావడంతోనే రెండు సిక్స్‌లు కొట్టిన క్లాసెన్... తర్వాత స్పిన్నర్ చహల్‌ను లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడ్డాడు. అతడు వేసిన 13వ ఓవర్లో విశ్వరూపం చూపాడు. దీంతో అప్పటిదాకా 10కి పైగా ఉన్న సాధించాల్సిన రన్‌రేట్ 8కి పడిపోయింది. వెంటనే క్లాసెన్ వెనుదిరిగినా... అప్పటికే చేయాల్సినంత నష్టం చేసేశాడు. తర్వాత డుమిని కెప్టెన్ ఇన్నింగ్స్‌తో పని పూర్తిచేశాడు. లోటు కనిపించింది... ప్రభావం చూపని ఉనాద్కట్ బౌలింగ్‌తో పాటు, ప్రధాన పేసర్ బుమ్రా లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. క్లిష్టమైనదైనా... డుమిని స్టంపౌంట్ (16వ ఓవర్లో)ను ధోని చేజార్చాడు. వికెట్ల వెనుక చురుగ్గా ఉండే ధోని చేతిలో ఇలా జరగడం ఊహించనిదే. ఇక ఒత్తిడిలో కెప్టెన్ కోహ్లి సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకోలేకపోయాడు. రైనా వంటి ప్రత్యామ్నాయాన్ని ఆలోచించకుండా.., గాలిలో తేమ కారణంగా బంతిపై పట్టు చిక్కక ఇబ్బంది పడుతూ, ఓవర్‌కు 15పైగా పరుగులిస్తూ, రెండుసార్లు రనప్ విరమించుకున్న చహల్‌నే కొనసాగించాడు. రైనా ఒక్క ఓవరే వేసి ఏడెనిమిది పరుగులిచ్చినా కొంతలో కొంత నయంగా ఉండేది. పేలవ సారథ్యం అంటూ దీనిపై వ్యాఖ్యలు కూడా వచ్చాయి. ఇక 12 బంతుల్లో 16 పరుగులు చేయాల్సిన దశలో భువనేశ్వర్‌ను కాదని ఉనాద్కట్‌కు బంతినివ్వడమూ సరైనదిగా అనిపించలేదు. భువీ 19వ ఓవర్ వేసి కట్టడి చేసి ఉంటే... ఒత్తిడిలో చేతులెత్తేసే లక్షణమున్న దక్షిణాఫ్రికాకు చివరి ఓవర్లో పరీక్ష ఎదురయ్యేది. తద్వారా ఆశలు నిలిచి ఏదైనా జరిగేందుకు అవకాశం చిక్కేది. అసహనం బయటకొచ్చింది... సెంచూరియన్‌లో రెండుసార్లు భారత ఆటగాళ్ల సహనానికి పరీక్ష ఎదురైంది. బ్యాటింగ్ సందర్భంగా చివరి ఓవర్లో రెండో పరుగుకు రాని మనీశ్పాండేపై ధోని ఆగ్రహం చూసినవారంతా ఆశ్చర్యపోయారు. మిస్టర్ కూల్‌గా పేరున్న ధోని... పాండేను పరుష పదజాలంతో దూషించినట్లు కనిపించింది. వేగంగా త్రో విసరనందుకు ఉనాద్కట్‌పై పాండ్యా విసురును ప్రదర్శించగా, కోహ్లి సైతం కఠిన పదాలు ప్రయోగించాడు. బౌలర్లు ఇబ్బందిపడ్డారు మేం 175 పరుగులే చేయగలమనుకున్నా. రైనా, మనీశ్, ధోని అద్భుతంగా ఆడటంతో 190కి చేరువయ్యాం. ఇది గెలిచే స్కోరే. వాతావరణంతో బౌలర్లకు ఇబ్బంది ఎదురైంది. చినుకుల కారణంగా 13వ ఓవర్ నుంచి బంతిపై పట్టు చిక్కలేదు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌దే ఘనతంతా. రిస్క్ తీసుకుంటూనే క్లాసెన్, డుమిని బాగా ఆడారు. ఆ జట్టు నుంచి ఇలాంటి ప్రతిఘటననే మేం ఆశిస్తున్నాం. ప్రేక్షకుడి కోణంలో ఇది మంచి మ్యాచ్. – భారత కెప్టెన్ విరాట్ కోహ్లి చహల్‌ను లక్ష్యంగా చేసుకున్నా భారత పేసర్లు బాగా బౌలింగ్ చేశారు. దీంతో చహల్‌పై దృష్టిపెట్టా. దీనికోసం ప్రత్యేక ప్రణాళికేమీ వేసుకోలేదు. కెరీర్ ఆరంభంలో అమెచ్యూర్‌గా నాణ్యమైన లెగ్‌స్పిన్నర్లను ఎదుర్కొనడం ఇక్కడ పనికొచ్చింది. ఓవర్ ఓవర్‌కు లక్ష్యం పెట్టుకుని ఆడా. నా ఇన్నింగ్స్‌కు ముఖ్య కారణం కెప్టెన్ డుమిని. అతడు నాలో భయాన్ని పోగొట్టాడు. సహజంగా ఆడమని సూచించాడు. చినుకుల వర్షంతో మారిన వాతావరణం కూడా మేలు చేసింది. సొంత మైదానంలో దేశానికి ఆడుతూ జట్టును గెలిపించాలని చిన్నప్పుడు అనుకుంటాం. అదిప్పుడు నిజమైంది. – దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ క్లాసెన్ -
ధోనినా.. మజాకా..!
సాక్షి, ఇండోర్: శ్రీలంకతో ఇండోర్‌లో జరిగిన రెండో టి 20లో భారత్ విజయం సాధించి సరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోని అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు. మొదటి టి 20లో ధోని రెండు క్యాచ్‌లు, రెండు స్టంప్ అవుట్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టి 20లో కూడా అటూ బ్యాటింగ్‌లో, ఇటూ కీపింగ్‌లో అందర్ని అబ్బురపరిచాడు. భారత్ 20 ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఇండియాకు టి20లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక లక్ష్యఛేదనలో తడబడి 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కుల్దీప్ యాదవ్ వేసిన 15 ఓవర్లో గుణరాత్నే షాట్ ఆడబోయి వికెట్ల వెనుక ధోనికి చిక్కాడు. అందరూ నాటౌట్అనుకున్నారు.. కానీ ధోని మాత్రం ఆ సమయంలో చాలా కానిఫిడెంట్గా కనిపించారు. లెగ్ ఆంపైర్ నిర్ణయాన్ని థర్డ్ ఆంపైర్కు ఇచ్చాడు. చివరకు అది స్టంప్ అవుట్ అని తేలింది. అలాగే, చాహల్ వేసిన 16 ఓవర్లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ సమరవిక్రమను కూడా ధోని స్టంప్ అవుట్ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ధోని ఇటీవల తనపై వచ్చిన రూమర్స్‌కు తనదైన శైలిలో సమాధానం చెబుతున్నాడు. వన్‌డౌన్‌లో ధోని... రోహిత్ అవుట్ అయిన తర్వాత అనూహ్యంగా వన్‌డౌన్‌లో వచ్చిన ధోని (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాహుల్‌కు జత కలిశాడు. 14వ ఓవర్ తొలి రెండు బంతులను బౌండరీలు బాదాడు. మధ్యలో కొంత తగ్గినా... స్పిన్నర్ ధనంజయ వేసిన 17వ ఓవర్లో రెండు సిక్స్‌లు కొట్టాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 78 పరుగులు జత చేశాడు. ధోని మరో రికార్డు చేరువలో.. ధోని మరో మూడు క్యాచ్‌లు పడితే అంతర్జాతీయ టీ 20 క్రికెట్లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం 47 అంతర్జాతీయ టీ 20 క్యాచ్‌లతో ధోని ఉన్నాడు. ముంబైలో ఆదివారం జరగనున్న మూడో టి 20 మ్యాచ్‌లో ధోని ఈ ఘనత సాధిస్తాడో లేదో వేచి చూడాలి. -
ధోనినా.. మజాకా..!
-
థ్రిల్లర్ 67
పవర్ ప్లే లెక్కలు లేవు... ఆరంభ ఓవర్లు, డెత్ ఓవర్లు అని ప్రత్యేకంగా ఏమీ లేవు... ప్రతీ ఓవర్ డెత్ ఓవరే, ప్రతీ బంతి ఉత్కంఠను, ఆందోళనను పెంచేదే! భారీ షాట్ ఒకటి పడితే ఆ వెంటనే వికెట్ కూడా... 48 ప్లస్ 48 బంతుల సమరం ఆసక్తికరంగా, హోరాహోరీగా సాగి చివరకు విజయం భారత్ పక్షాన నిలిచింది.టి8 మ్యాచ్‌లో విజయంతో సిరీస్ సొంతమైందికివీస్ చక్కటి బౌలింగ్, ఫీల్డింగ్‌తో భారత్ చేసింది 67 పరుగులే! కానీ ఆ స్కోరును కూడా నిలబెట్టుకోవడంలో కోహ్లి సేన సఫలమైంది. విరామం లేకుండా వికెట్లు తీసి ఒత్తిడి పెంచుతూ ఈ చిట్టి మ్యాచ్‌లోనూ మన జట్టు సత్తా చాటింది. బుమ్రా, చహల్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తోడు మెరుపు ఫీల్డింగ్ కలగలిసి భారత్‌ను మరో సిరీస్‌లో విజేతగా నిలబెట్టాయి. తిరువనంతపురం: భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్‌కు ఉత్కంఠభరిత ముగింపు లభించింది. భారీ వర్షం కారణంగా 8 ఓవర్లకే పరిమితమైన చివరి టి20 మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. వాన కారణంగా దాదాపు రెండున్నర గంటల పాటు మ్యాచ్ ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 8 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. మనీశ్ పాండే (11 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం న్యూజిలాండ్ 8 ఓవర్లలో 6 వికెట్లకు 61 పరుగులు మాత్రమే చేయగలిగింది. గ్రాండ్‌హోమ్ (10 బంతుల్లో 17 నాటౌట్; 2 సిక్సర్లు) పోరాడే ప్రయత్నం చేశాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా (2/9)తో పాటు చహల్ (0/8) కివీస్‌ను కట్టి పడేశారు. తాజా ఫలితంతో భారత్ ఈ సిరీస్‌ను 2–1తో గెలుచుకుంది. బుమ్రాకే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా... ► ఓవర్ 1 (బౌల్ట్–7 పరుగులు): తొలి నాలుగు బంతుల్లో మూడు పరుగులే రాగా, ఐదో బంతిని ధావన్ ఫోర్ కొట్టాడు. ► ఓవర్ 2 (సాన్‌ట్నర్–7 పరుగులు): నాలుగో బంతికి ఫోర్ కొట్టిన రోహిత్, మిగతా బంతులను ఆడలేక ఇబ్బంది పడ్డాడు. ►ఓవర్ 3 (సౌతీ–4 పరుగులు/2 వికెట్లు): రెండో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన ధావన్, సాన్‌ట్నర్‌కు క్యాచ్ ఇవ్వగా... తర్వాతి బంతికే రోహిత్ కూడా పుల్ చేయబోయి డీప్ స్క్వేర్ లెగ్‌లో సాన్ట్నర్కే క్యాచ్ ఇచ్చాడు. నాలుగు సింగిల్స్‌తో పరుగులు వచ్చాయి. ► ఓవర్ 4 (సోధి–13 పరుగులు/ఒక వికెట్): తొలి బంతిని ఫోర్‌గా మలచిన కోహ్లి రెండో బంతిని లాంగాన్ మీదుగా సిక్సర్ కొట్టాడు. అయితే ఐదో బంతికి అదే తరహా షాట్ ఆడబోయి డీప్ మిడ్వికెట్లో బౌల్ట్ చేతికి చిక్కాడు. ► ఓవర్ 5 (సౌతీ–9 పరుగులు): తొలి బంతిని మనీశ్ పాండే ఫోర్ కొట్టగా, తర్వాతి ఐదు బంతుల్లో మరో ఐదు పరుగులు మాత్రమే లభించాయి. ► ఓవర్ 6 (సోధి–10 పరుగులు/ఒక వికెట్): మొదటి బంతిని పాండే భారీ సిక్సర్ కొట్టగా... నాలుగో బంతికి క్యాచ్ ఇచ్చి అయ్యర్ వెనుదిరిగాడు. ► ఓవర్ 7 (సాన్‌ట్నర్–11 పరుగులు): మొదటి నాలుగు బంతులను ఆడటంలో ఇబ్బంది పడ్డ పాండ్యా, ఐదో బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. ► ఓవర్ 8 (బౌల్ట్–6 పరుగులు/ఒక వికెట్): రెండో బంతికి కివీస్ అద్భుత ఫీల్డింగ్‌తో భారత్ మరో వికెట్ కోల్పోయింది. పాండే కొట్టిన షాట్‌ను బౌండరీ వద్ద సాన్‌ట్నర్ అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే చివరి క్షణంలో తాను నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఉండటంతో బంతిని విసిరేయగా పక్కనే ఉన్న గ్రాండ్‌హోమ్ దానిని చక్కగా అందుకొని పాండే ఆట ముగించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ సాగిందిలా... ► ఓవర్ 1 (భువనేశ్వర్–8 పరుగులు/ఒక వికెట్): రెండో బంతిని మున్రో భారీ సిక్సర్ బాదాడు. అయితే చివరి బంతికి షాట్‌కు ప్రయత్నించిన గప్టిల్ తన ఆఫ్‌స్టంప్‌ను కోల్పోయాడు. ► ఓవర్ 2 (బుమ్రా–3 పరుగులు/ఒక వికెట్): తొలి రెండు బంతులకు పరుగు తీయలేకపోయిన మున్రో మూడో బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించగా... మిడాన్ వైపు రోహిత్ వెనక్కి పరుగెడుతూ అత్యద్భుత క్యాచ్ అందుకున్నాడు. ► ఓవర్ 3 (చహల్–5 పరుగులు): చహల్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డ కివీస్ బ్యాట్స్‌మన్ భారీ షాట్ ఆడటంలో విఫలమయ్యారు. ► ఓవర్ 4 (భువనేశ్వర్–10 పరుగులు): తొలి మూడు బంతుల్లో రెండు పరుగులే రాగా, తర్వాతి రెండు బంతులను వరుసగా ఫిలిప్స్ ఫోర్లు కొట్టాడు. ► ఓవర్ 5 (కుల్దీప్–10 పరుగులు/2 వికెట్లు): ఈ ఓవర్ మ్యాచ్‌ను భారత్ పక్షాన మార్చేసింది. మూడో బంతికి విలియమ్సన్... తర్వాతి బంతికే ఫిలిప్స్ అవుటయ్యారు. అయితే ఆఖరి బంతిని గ్రాండ్‌హోమ్ సిక్సర్ బాదాడు. ► ఓవర్ 6 (చహల్–3 పరుగులు): కివీస్ బ్యాట్స్‌మెన్ చహల్ బంతులను ఆడలేక మూడు సింగిల్స్‌తోనే సరిపెట్టారు. ►ఓవర్ 7 (బుమ్రా–10 పరుగులు/2 వికెట్లు): తొలి బంతికే నికోల్స్‌ను బుమ్రా అవుట్ చేశాడు. మూడో బంతికి బ్రూస్ ఫోర్ కొట్టినా... మరో రెండు బంతుల తర్వాత లేని రెండో పరుగు కోసం ప్రయత్నించి అతను రనౌటయ్యాడు. ► ఓవర్ 8 (పాండ్యా–12 పరుగులు): మూడో బంతిని గ్రాండ్‌హోమ్ భారీ సిక్సర్ కొట్టగా, తర్వాతి బంతి వైడ్ కావడంతో 3 బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన స్థితిలో కివీస్‌లో ఆశలు రేగాయి. అయితే పాండ్యా కట్టుదిట్టంగా బంతులు విసిరి నాలుగు పరుగులు మాత్రమే ఇవ్వడంతో భారత్ గెలుపు ఖాయమైంది. -
ఆఖరి పోరుకు రె'ఢీ'!
భారత్, న్యూజిలాండ్ పోరు ఆఖరి అంకానికి చేరుకుంది. తొలి వన్డేలో అనూహ్యంగాఓడి ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో భారత్ సిరీస్ సొంతం చేసుకోగలిగింది. అదే జోరు తొలి టి20లో కొనసాగినా... గత మ్యాచ్‌లో మాత్రం కివీస్ విశ్వరూపం చూపించింది.ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకోవాలనిఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. భారత గడ్డపై రాక రాక వచ్చిన సిరీస్ గెలుపు అవకాశాన్ని పోగొట్టుకోరాదని న్యూజిలాండ్ భావిస్తుండగా, సొంతగడ్డపై అవమానం ఎదుర్కోరాదని కృత నిశ్చయంతో ఉన్న విరాట్ బృందంపైనే ఒత్తిడి అధికంగా ఉంది. తిరువనంతపురం: దాదాపు మూడు దశాబ్దాల క్రితం త్రివేండ్రం పేరుతో అంతర్జాతీయ వన్డేకు ఆతిథ్యం ఇచ్చిన నగరంలో మళ్లీ ఇన్నాళ్లకు క్రికెట్ సందడి వచ్చింది. ఇక్కడ నూతనంగా నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో నేడు భారత్, న్యూజిలాండ్ మధ్య చివరిదైన మూడో టి20 మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో ప్రస్తుతం ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్న స్థితిలో ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ విజేతను కూడా నిర్ణయిస్తుంది. అందుకే భారత్‌లో కివీస్ పరిమిత ఓవర్ల పర్యటనకు ముగింపు ఇస్తున్న ఈ మ్యాచ్ కీలకంగా మారింది. 1988లో ఇదే నగరంలోని మరో స్టేడియంలో జరిగిన నాటి మ్యాచ్‌లో భారత జట్టు కెప్టెన్‌గా ఉన్న రవిశాస్త్రి ఇప్పుడు కోచ్‌గా, అప్పుడు ఇంకా పుట్టని విరాట్ కోహ్లి ఇప్పుడు కెప్టెన్‌గా టీమిండియా కొత్త వ్యూహాలకు సిద్ధమవుతుండగా... తమ ఆటగాళ్లు గత మ్యాచ్ తరహాలో దూకుడును కొనసాగించాలని విలియమ్సన్ కోరుకుంటున్నాడు. కుల్దీప్కు చాన్స్! సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను సునాయాసంగా గెలుచుకున్న భారత్‌కు న్యూజిలాండ్ ఎంత ప్రమాదకారినో రెండో మ్యాచ్‌లో గానీ అర్థం కాలేదు. దాదాపు 200 పరుగుల స్కోరుతో ఆ జట్టు విసిరిన సవాల్‌ను భారత్ అధిగమించలేకపోయింది. కోహ్లి పోరాటాన్ని మినహాయిస్తే అక్కడ జట్టు బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. నిజానికి కోహ్లి ఐదుగురు బౌలర్ల వ్యూహం కారణంగా ఆ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మన్ తగ్గిన లోటు కనిపించింది. ఈ సారి దానిని టీమిండియా ఎలా అధిగమిస్తుందో చూడాలి. సిరీస్ గెలవాలంటే కోహ్లి ఒక్కడే కాకుండా ఓపెనర్లిద్దరూ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్‌కు మరో అవకాశం ఖాయం. ధోని బ్యాటింగ్ తీరుపైనే కాకుండా అతని బ్యాటింగ్ స్థానంపై కూడా తీవ్ర చర్చ మొదలైన నేపథ్యంలో మేనేజ్మెంట్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడాలి. అయితే పాండ్యా బ్యాటింగ్ మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఆస్ట్రేలియాతో చివరి వన్డే తర్వాత అతని మెరుపులు అసలు కనిపించలేదు. అయితే కెప్టెన్ కోహ్లి విశ్వాసం చూరగొన్న అతను ఈ మ్యాచ్‌లోనైనా సత్తా చాటాల్సి ఉంది. మరోవైపు రాజ్‌కోట్ మ్యాచ్‌లో కివీస్ పరుగులు సాధించినా... ముగ్గురు ప్రధాన బౌలర్లు బుమ్రా, భువీ, చహల్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. కేవలం అక్షర్, కొత్త ఆటగాడు సిరాజ్‌లపై మాత్రమే ప్రతాపం చూపించి ప్రత్యర్థి భారీ స్కోరు చేయగలిగింది. కాబట్టి బౌలింగ్ విషయంలో ఆందోళన అనవసరం. బ్యాటింగ్ పిచ్‌పై దురదృష్టవశాత్తూ రాణించలేకపోయిన సిరాజ్‌కు మరో అవకాశం ఇస్తారా లేక కివీస్‌ను ఇబ్బంది పెట్టేందుకు చైనామన్ బౌలర్ కుల్దీప్ను తీసుకుంటారా చూడాలి. మార్పుల్లేకుండానే... సిరీస్ తొలి పోరులో చిత్తుగా ఓడిన తర్వాత రాజ్‌కోట్‌లో దక్కిన విజయం న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. బ్యాటింగ్ బలంతో భారీ స్కోరు చేయగలిగితే ఆ తర్వాత భారత జట్టులోని స్టార్ ఆటగాళ్లను కూడా ఒత్తిడిలో చిత్తు చేయవచ్చనే విశ్వాసం వారికి కలిగింది. బౌల్ట్ మినహా చెప్పుకోదగ్గ బౌలర్ లేకపోయినా... కివీస్ గత మ్యాచ్‌లో పట్టు చేజారకుండా చేయగలిగింది. స్పిన్నర్లు సోధి, సాన్‌ట్నర్ కూడా ఆశించిన దానికంటే మెరుగైన ప్రదర్శన ఇస్తుండటం కూడా ఆ జట్టుకు బలంగా మారింది. ఇప్పుడు కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని న్యూజిలాండ్ ఆశిస్తోంది. సెంచరీ హీరో మున్రోతో పాటు మరో హిట్టింగ్ ఓపెనర్ గప్టిల్ మళ్లీ చెలరేగితే కివీస్‌కు తిరుగుండదు. విలియమ్సన్, బ్రూస్లతో జట్టు బ్యాటింగ్ బలంగా కనిపిస్తుంటే ‘జూనియర్ మెకల్లమ్’గా గుర్తింపు తెచ్చుకున్న కీపర్ ఫిలిప్స్ ఈ మ్యాచ్‌లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే భారత్‌లో అడుగు పెట్టిన దగ్గరి నుంచి ప్రభావం చూపలేకపోయిన ఆల్‌రౌండర్ గ్రాండ్‌హోమ్ జట్టును తీవ్రంగా నిరాశ పర్చాడు. ఐపీఎల్ అనుభవం కూడా ఉన్న గ్రాండ్‌హోమ్ ఎప్పుడైనా చెలరేగుతాడనే నమ్మకంతో ఉన్న మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లో కూడా మరో అవకాశం ఇవ్వనుంది. మొత్తంగా గత మ్యాచ్ వ్యూహాన్నే సమర్థంగా అమలు చేసి ఫలితం సాధించాలనుకుంటున్న కివీస్‌ను భారత్ తక్కువగా అంచనా వేస్తే కష్టం. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, అయ్యర్, పాండ్యా, ధోని, అక్షర్, భువనేశ్వర్, బుమ్రా, చహల్, సిరాజ్/కుల్దీప్. న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, మున్రో, బ్రూస్, ఫిలిప్స్, గ్రాండ్‌హోమ్, నికోల్స్, సాన్‌ట్నర్, బౌల్ట్, మిల్నే, సోధి. పిచ్, వాతావరణం కొత్తగా కట్టిన స్టేడియం, కొత్త పిచ్ కావడంతో వికెట్ స్పందించే తీరుపై ఇంకా స్పష్టత లేదు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన వార్మప్ మ్యాచ్‌లోనైతే భారీగా పరుగులు వచ్చాయి. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. సోమవారం కూడా ఇక్కడ భారీగా వర్షం కురిసింది. డ్రైనేజీ వ్యవస్థ చాలా బాగుందని చెబుతున్నా... ప్రస్తుత పరిస్థితి చూస్తే ఆటకు అంతరాయం కలగడం మాత్రం ఖాయం. ► ధోని బ్యాటింగ్ గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అతనో దిగ్గజం. తాను ఏం చేస్తున్నాడో తనకు చాలా బాగా తెలుసు. బుమ్రాతో కలిసి బౌలింగ్ చేస్తుంటే సహచరుడిగా నాలో కూడా ఉత్సాహం పెరుగుతుంది. చివరి ఓవర్లలో అతను పరుగులు నిరోధిస్తే, నేను కూడా అదే చేయగలను. మ్యాచ్ ఆరంభానికి ముందు మేమిద్దరం ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్, పిచ్‌లాంటి అన్ని అంశాలను చర్చించుకుంటాం. – భువనేశ్వర్, భారత బౌలర్ ► రాత్రి 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ఆసీస్‌కు వైట్‌వాష్ తప్పింది
చివరి టి20లో లంకపై గెలుపు అడిలైడ్: శ్రీలంకతో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. బౌలర్లు ఫాల్క్‌నర్ (3/20), జంపా (3/25) లంకేయుల్ని కట్టడి చేయడంతో ఆస్ట్రేలియా వైట్‌వాష్ నుంచి తప్పించుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను శ్రీలంక 2–1తో కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఓపెనర్లు క్లింగర్ (43 బంతుల్లో 62; 6 ఫోర్లు, 1 సిక్స్), ఫించ్ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. మలింగ, షణక చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక 18 ఓవర్లలో 146 పరుగుల వద్ద ఆలౌటైంది. సిరివర్ధన (35), మునవీర (37) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. -
నాకంటూ సొంత శైలి ఉంది: రహానే
టి20 ఫార్మాట్ వచ్చాక బ్యాటింగ్ చేసే విధానంలో విపరీత మార్పులు వచ్చినా తాను మాత్రం ఫ్యాన్సీ షాట్ల జోలికి పోనని బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే స్పష్టం చేశాడు. అలాంటి షాట్లు స్వల్ప కాలంలో పేరు తెచ్చినా అత్యున్నత స్థాయి కెరీర్‌కు చేర్చలేవని ఐపీఎల్-9లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడుతున్న రహానే తెలిపాడు. ‘ఐపీఎల్లో నా బ్యాటింగ్ తీరుపై సంతృప్తిగా ఉన్నాను. ఇతరులను అనుకరించాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను. నాకంటూ విభిన్న శైలి ఉంది. సంప్రదాయక క్రికెట్ షాట్లతో నేను బాగానే పరుగులు సాధిస్తున్నాను. దీన్ని మార్చాలని అనుకోవడం లేదు’ అని పుణే తరఫున 419 పరుగులు చేసిన రహానే తెలిపాడు. -
రో‘హిట్’ ఫార్ములా
భారత్‌ను గెలిపించిన రోహిత్ శర్మ 45 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు ఆసియా కప్ టి20 టోర్నీ శనివారం పాక్‌తో భారత్ పోరు పిచ్ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ఒక వైపు వరుసగా వికెట్లు పడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ అడ్డుగా నిలబడ్డాడు. ముందుగా నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగిపోయాడు. కొద్దిలో సెంచరీ అవకాశం కోల్పోయినా తన సూపర్ హిట్ బ్యాటింగ్‌తో జట్టుకు మరో విజయాన్ని అందించాడు. కుర్రాడు పాండ్యా కూడా మళ్లీ నమ్మకాన్ని నిలబెట్టాడు. భారత్ బలం ముందు బంగ్లాదేశ్ ఆటలు సాగలేదు. ఏడాది క్రితం వన్డేల ఫలితాన్ని మళ్లీ చూపిద్దామనుకున్న ఆ జట్టు టి20ల్లో బోర్లా పడింది. మన జట్టు బౌలింగ్ ముందు కనీస ప్రదర్శన చూపలేక చేతులెత్తేసింది. ఫలితంగా టీమిండియా సమష్టితత్వంతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. వరుస విజయాల జోరులో ఉన్న ధోనిసేన తమ జైత్రయాత్రను మిర్పూర్లోనూ కొనసాగించింది. మిర్పూర్: ఆసియా కప్‌ను భారత్ ఘనవిజయంతో ఆరంభించింది. బుధవారం ఇక్కడి షేర్ ఎ బంగ్లా స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 45 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (55 బంతుల్లో 83; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడగా, హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 27 బంతుల్లోనే 61 పరుగులు జోడించడం విశేషం. హుస్సేన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. షబ్బీర్ రహమాన్ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతావారంతా ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రా (3/23) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో శనివారం పాకిస్తాన్‌తో తలపడుతుంది. రోహిత్ మెరుపులు ఆరంభంలో భారత్ ఇన్నింగ్స్ తడబాటుకు లోనైంది. రెండో ఓవర్లోనే ధావన్ (2) అవుట్ కాగా, కోహ్లి (8) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత రైనా (13)ను చక్కటి బంతితో మహ్ముదుల్లా బౌల్డ్ చేయడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ మాత్రం భారీ షాట్లు కొట్టకపోయినా, నెమ్మదిగా క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. 21 పరుగుల వద్ద తస్కీన్ బౌలింగ్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను పాయింట్లో షకీబ్ వదిలేయగా...తర్వాతి మూడు బంతుల్లో రోహిత్ 4,6,4 బాదడంతో స్కోరు జోరు పెరిగింది. ఈ క్రమంలో 42 బంతుల్లో అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువరాజ్ (16 బంతుల్లో 15; 1 ఫోర్) పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, రోహిత్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 55 పరుగులు జోడించారు. అయితే రోహిత్, పాండ్యా భాగస్వామ్యం భారత్‌ను ముందంజలో నిలిపింది. మొర్తజా ఓవర్లో వరుసగా 6,4,4 కొట్టి రోహిత్ తన ధాటిని కొనసాగించగా...మరో ఎండ్‌లో పాండ్యా కూడా ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాడు. వీరిద్దరి దూకుడుకు ముస్తాఫిజుర్ వేసిన ఒక ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 15-19 మధ్య ఐదు ఓవర్లలో భారత్ 67 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రోహిత్, పాండ్యా వెనుదిరిగినా, ధోని (8 నాటౌట్) భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. షకీబ్ క్యాచ్ వదిలేసే సమయానికి 28 బంతుల్లో 21 పరుగులే చేసిన రోహిత్...తర్వాతి 27 బంతుల్లో 62 పరుగులు చేయడం విశేషం. షబ్బీర్ మినహా... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. మిథున్ (1)ను అవుట్ చేసి నెహ్రా శుభారంభం ఇవ్వగా, మరుసటి ఓవర్లోనే బుమ్రా బౌలింగ్‌లో సర్కార్ (11) వెనుదిరిగాడు. షబ్బీర్ ఒంటరి పోరాటం చేసినా... మరో ఎండ్‌లో అతనికి ఎవరూ అండగా నిలవలేదు. ఆ జట్టు తక్కువ వ్యవధిలో వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. సగం ఓవర్లు ముగిసే సరికే జట్టు విజయంపై ఆశలు వదులుకుంది. ముష్ఫికర్ (16 నాటౌట్), తస్కీన్ (15 నాటౌట్) చివర్లో కొద్దిగా పోరాడే ప్రయత్నం చేసినా లక్ష్యానికి బంగ్లా చాలా దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో ఐదుగురు తలా 4 ఓవర్లు వేశారు. ఇందులో జడేజా 25 పరుగులు ఇవ్వగా... మిగతా నలుగురు సరిగ్గా 23 పరుగుల చొప్పున ఇవ్వడం విశేషం. టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకునేవాడిని. భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి లక్ష్యం విధించాలని ముందే నిర్ణయించుకున్నా. బంగ్లా బౌలర్లు షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతులు ఎక్కువగా వేశారు. నేరుగా భారీషాట్లకు పోకుండా చాలా జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. భయపడకుండా దూకుడుగా ఆడగల నైపుణ్యం హార్దిక్‌లో ఉంది. అందుకే అతనికి ఎక్కువ మ్యాచ్‌లలో అవకాశం ఇస్తున్నాం. పైగా మంచి ఫీల్డర్, మూడో పేసర్‌గా ఎంతో పనికొస్తాడు. నా వెన్నునొప్పి గురించి అప్పుడే చెప్పలేను. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటా. -ధోని అంతర్జాతీయ టి20ల్లో వేయి పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత ఆటగాడు యువరాజ్. అతనికంటే ముందు విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ ఈ మైలురాయి దాటారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సర్కార్ (బి) హుస్సేన్ 83; ధావన్ (బి) హుస్సేన్ 2; కోహ్లి (సి) మహ్ముదుల్లా (బి) మొర్తజా 8; రైనా (బి) మహ్ముదుల్లా 13; యువరాజ్ (సి) సర్కార్ (బి) షకీబ్ 15; పాండ్యా (సి) మహ్ముదుల్లా (బి) హుస్సేన్ 31; ధోని (నాటౌట్) 8; జడేజా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1-4; 2-22; 3-42; 4-97; 5-158; 6-158. బౌలింగ్: తస్కీన్ 3-0-22-0; హుస్సేన్ 4-0-37-3; ముస్తఫిజుర్ 4-0-40-0; మొర్తజా 4-0-40-1; మహ్ముదుల్లా 2-0-9-1; షకీబ్ 3-0-15-1. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: సర్కార్ (సి) ధోని (బి) బుమ్రా 11; మిథున్ (బి) నెహ్రా 1; షబ్బీర్ (సి) ధోని (బి) పాండ్యా 44; కైస్ (సి) యువరాజ్ (బి) అశ్విన్ 14; షకీబ్ (రనౌట్) 3; ముష్ఫికర్ (నాటౌట్) 16; మహ్ముదుల్లా (సి) రోహిత్ (బి) నెహ్రా 7; మొర్తజా (సి) జడేజా (బి) నెహ్రా 0; తస్కీన్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1-9; 2-15; 3-50; 4-73; 5-82; 6-100; 7-100.; బౌలింగ్: నెహ్రా 4-0-23-3; బుమ్రా 4-0-23-1; పాండ్యా 4-0-23-1; అశ్విన్ 4-0-23-1; జడేజా 4-0-25-0. -
పొట్టి క్రికెట్టు గట్టి పోటి
టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధం రేపు విశాఖ చేరనున్న ఇండియా, శ్రీలంక జట్లు ఒకే ఏడాదిలో మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు... విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియం సరికొత్త రికార్డును సొంతం చేసుకోనుంది. ఒకే ఏడాదిలో మూడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్ని నిర్వహించే స్టేడియం కానుంది. ఆదివారం జరిగే టీ20 మ్యాచ్ ఇందులో తొలిది కాగా ఏడాది చివరిలోగానే మరో రెండు అంతర్జాతీయ జట్లు ఇక్కడ మ్యాచ్‌లు ఆడనున్నాయి. అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్ ఐదు వన్డేలు భారత్‌లో ఆడనుండగా... ఆ వెంటనే ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటించనుంది. నవంబర్-డిసెంబర్లో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో ఒకే ఏడాది విశాఖ వేదికగా శ్రీలంకతో టీ20 మ్యాచ్‌ను...న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌ను విశాఖ క్రీడాభిమానులు వీక్షించనున్నారు. విశాఖ వేదికగా తొలిసారిగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటను ఆస్వాదించనున్నారు. విశాఖపట్నం : విశాఖ వేదికగా పొట్టి క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్, శ్రీలంక జట్లు శనివారం విశాఖ చేరుకోనున్నాయి. ఆ రోజు ప్రాక్టీస్ అనంతరం ఆదివారం ఇరుజట్లు రాత్రి ఏడున్నర గంటలకు సిరీస్‌లో చివరిదైన టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. విశాఖలో జరిగే టీ20 మ్యాచ్ తర్వాత ఇరుజట్లు ఆసియా కప్ టీ20లోనే ఆడనున్నాయి. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను సాధించిన జట్టుగా భారత్ పేరుగడిస్తే...టీ20 వరల్డ్ రాంకింగ్స్‌లో తొలి స్థానంలో కొనసాగుతున్న జట్టు శ్రీలంక. దీంతో ఇరు జట్లకు విశాఖ వేదికగా జరగనున్న మ్యాచ్ కీలకంగా మారింది. టీ20 ఎలా అయింది... క్రికెట్‌కు పుట్టిల్లు ఇంగ్లండ్ అని అందరికి తెలిసిందే. 1744 నాటికి క్రికెట్ ఆడేందుకు నిబంధనల్ని రూపొందించారు. 1962 నాటికి నిర్ణీత ఓవర్ల క్రికెట్ పురుడు పోసుకుంది. 71లో డొమెస్టిక్ టోర్నీ నిర్వహించారు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ నలభై ఓవర్ల ఇన్నింగ్స్‌తో జరిగింది. అప్పట్లో ఓవర్‌కి ఎనిమిది బంతులుండేవి. ఇక 1990 వచ్చేనాటికి మరింత కుదించి ఇరుజట్లు పదేసి ఓవర్లతో (ఓవర్‌కు పది బంతులు) ఆడే విధంగా న్యూజిలాండ్ కెప్టెన్ మార్టిన్ క్రో ప్రవేశపెట్టాడు. ఆస్ట్రేలియన్లు సూపర్ 8గా మార్చగా పొట్టి క్రికెట్‌పై పరిశోధన జరిగింది. ఇరవై ఓవర్ల ఇన్నింగ్స్‌తో ఆడే విధంగా రూపకల్పన జరిగింది. 2003లో హాంప్‌షైర్‌తో ససెక్స్ ఈ పొట్టి ఫార్మేట్ మ్యాచ్‌లో తలపడింది. తొలి విజేత భారతే... అప్పటికే ఐదు రోజులు ఆడినా కొన్ని సందర్భాల్లో ఫలితం రాకపోతుండడంతో మ్యాచ్ కాస్తా వన్డేగా రూపాంతరం చెందింది. ఇక టీ20గా మారిపోయిన తర్వాత క్రికెట్ వీక్షించే అభిమానులు పెరిగిపోయారు. దీంతో 2007లో తొలి అంతర్జాతీయ టీ20 టోర్నీ దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. ఈ టోర్నీ ఫైనల్స్‌లో దాయాది పాకిస్తాన్‌పై విజయంతో భారత్ తొలి టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది. టోర్నీ విజయవంతం కావడంతో రెండేళ్ళ అనంతరం నిర్వహించేందుకు తీర్మానం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి రెండేళ్ళకు ఒకసారి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహిస్తున్నారు. భారత్‌దే పై చేయి... ప్రస్తుతం టీ20 అంతర్జాతీయ రాంకింగ్లో శ్రీలంక జట్టే ముందుంది. ఇంగ్లండ్‌తో కలిసి భారత్ మూడో స్థానంలోనే కొనసాగుతుంది. ఇక శ్రీలంక-భారత్ జట్లు టీ20 మ్యాచ్‌ల్లో పలుసార్లు తలపడ్డాయి. రెండు దేశాల మధ్య మూడుసార్లు సిరీస్ జరిగింది. రెండుసార్లు భారత్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. ఒకే మ్యాచ్ సిరీస్‌లో భాగంగా జరగ్గా రెండు సార్లు భారత్‌నే విజయం వరించింది. అయితే శ్రీలంక జట్టు భారత్‌లో ఓసారి పర్యటించగా రెండు మ్యాచ్‌లు జరిగాయి. చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ డ్రాగా ముగిసింది. ఆరేళ్ళ అనంతరం మళ్ళీ భారత్‌లో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రీలంక వచ్చింది. ఈసారి మూడు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన శ్రీలంక మంచి ఊపు మీదుంది. సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ విశాఖ వేదికగానే జరగనుండడంతో ఉత్కంఠ రేపుతున్నది. రికార్డు స్కోర్... టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ రికార్డు శ్రీలంక పేరిటే ఉంది. 2007లో కెన్యాపై ఏకంగా ఆరు వికెట్లకు 260 పరుగులు చేసేసింది. అత్యధిక మార్జిన్‌తో గెలిచిన మ్యాచ్‌కూడా అదే. అయితే అత్యధిక రికార్డుతోపాటు అత్యల్ప రికార్డు కూడా శ్రీలంకదే. నెదర్లాండ్స్ జట్టు 2014లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 39 పరుగులకే చుట్టేశారు. క్రికెట్ ఫీవర్ మొదలైంది విశాఖపట్నం : భారత్, శ్రీలంక టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌కు విశాఖ సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు గురువారం తెలవారక ముందే మీ సేవా కౌంటర్ల వద్ద పడిగాపులు పడీ మరీ టిక్కెట్లను సొంతం చేసుకున్నారు. నగరంలోని 16 సెంటర్లలో లోయర్ డినామినేషన్ టిక్కెట్లు రూ.300, రూ.600 టిక్కెట్లను అమ్మకానికి పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే హాట్‌కేక్‌ల్లా అమ్ముడు పోయాయి. వాస్తవానికి మ్యాచ్ జరిగే వైఎస్ఆర్ స్టేడియంలో 27వేల సీట్ల సామర్ధ్యం ఉన్నా...వాటిలో సగం టిక్కెట్లు మాత్రమే విక్రయించనున్నారు. రెండు వందల రూపాయల టిక్కెట్లును కేవలం క్రీడా క్లబ్‌లకు మాత్రమే ఇవ్వనుండగా హైయ్యర్ డినామినేషన్ టిక్కెట్లు రూ.1500, రూ. 2000, రూ.మూడువేల టిక్కెట్లను ఆన్లైన్ ద్వారాను అమ్మకాలు జరిపారు. మిగిలిన టిక్కెట్లతో పాటు వెయ్యి రూపాయిల టిక్కెట్లను శుక్రవారం విక్రయించనున్నారు. మీ సేవా కేంద్రాలతో పాటు స్టేడియంలోనూ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాట్టు చేసి టిక్కెట్ల విక్రయాలు జరిపారు. టీ20 క్రికెట్ రాంకింగ్ తొలి స్థానంలో నిలిచిన శ్రీలంక జట్టుతో అతిథ్య జట్టు భారత్ అమీ తుమీ తేల్చుకునే ఘట్టానికి ఆదివారం తెరలేవనుంది. -
పాఠాలు నేరుస్తారా?
ఆస్ట్రేలియాలో కూడా అలవోకగా పరుగులు సాధించేశారు. అదేంటో కానీ ఇక్కడి పిచ్ చూస్తే స్వయంగా ధోనికి మాత్రం అది ఇంగ్లండ్ వికెట్ తరహాలో కనిపించింది. ఆసీస్ మైదానాల్లో సొంతగడ్డపై ఆడినంత సులభంగా ఆడి... భారీ షాట్లతో కనువిందు చేసినవారు మన దగ్గరికి వచ్చే సరికి అనూహ్యంగా బ్యాట్లు పడేశారు. పరాజయంకంటే పరిస్థితులను అంచనా వేయడంలో, దానికి తగినట్లుగా ఆడటంలో మన బ్యాట్స్‌మెన్ వైఫల్యం మాత్రం స్పష్టంగా కనిపించింది. అంతగా ఏముంది పుణే పిచ్‌లో... ఆరంభంలో కాస్త తేమ, కొద్దిపాటి బౌన్స్ మాత్రమే. మరి ఈ మాత్రం దానికే బెదిరిపోతే వరల్డ్ చాంపియన్ అయ్యేదెలా? ప్రపంచకప్‌లో సరిగ్గా ఇదే తరహా పిచ్‌లు ఉండకపోవచ్చు లేదా మన కోసం పూర్తిగా బ్యాటింగ్ పిచ్‌లు తయారు కావచ్చు. కానీ మన గల్లీలే కదా, మమ్మల్ని ఆపేదెవరు అన్నట్లుగా కాకుండా... ఇక ముందు జాగ్రత్త పడాలి. శ్రీలంకతో తొలి టి20 ఓటమితో జట్టు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్ మేలుకోవాల్సిన సమయం సొంతగడ్డలో పిచ్‌పై తప్పిన అంచనా వరల్డ్‌కప్‌లో ఇలాగే ఉంటే కష్టం సాక్షి క్రీడా విభాగం తొలి టి20 మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాతి ఓవరే మెయిడిన్ కాగా... మూడో ఓవర్లో ఫీల్డర్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో రైనా అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. ఈ సమయంలోనైనా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని మన బ్యాట్స్‌మెన్ సంయమనం పాటించలేదు. టి20ల్లో దూకుడే ప్రధానం కావచ్చు. కానీ పరిస్థితిని బట్టి బ్యాటింగ్‌ను మార్చుకోవడం కూడా కీలకం. పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తోందని అప్పటికే భారత్‌కు అర్థమైపోయి ఉండాలి. కానీ ఒకరి వెంట మరొకరు గుడ్డిగా షాట్లు ఆడబోయి మొత్తం 20 ఓవర్లు ఆడకుండానే చాప చుట్టేశారు. తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్, తొలి సారి బౌలింగ్ చేస్తున్న బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు చెరో మూడు వికెట్లు అప్పగించడంలో మనోళ్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. తప్పు పిచ్‌దేనా? ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం మత్తునుంచి భారత్ ఇంకా బయటికి వచ్చినట్లు లేదు. ఇక్కడి పిచ్‌లకు అనుగుణంగా తమ ఆటను వాళ్లు మార్చుకోలేదు. ఎప్పుడూ సహజంగా పరుగుల వరద పారే భారత్ మైదానాల్లాగే దీనినీ భావించి బోర్లా పడ్డారు. వాస్తవానికి ఇది మరీ 170-180 పరుగుల పిచ్ కాకపోయినా అంత భీకరంగా ఏమీ లేదు. కనీసం 140 పరుగులు చేసినా మన బౌలర్లు మ్యాచ్‌ను గెలిపించగలిగేవారు. మ్యాచ్‌లో నెహ్రా తీసిన 2 వికెట్లు, అశ్విన్‌ను ఆడలేక లంక తడబాటు చూస్తే ఇదేమీ అసాధ్యం కాకపోయేది. దీనిని ధోని కూడా అంగీకరించాడు. ‘ఒక మంచి భాగస్వామ్యం ఉంటే ఫలితం వేరుగా ఉండేది. ఐదు ఓవర్లు అవసరం లేదు. కొన్ని బంతుల పాటు నిలబడ్డా చాలు. మావాళ్లు భారత్ పిచ్‌లు అన్నీ ఒకేలాగా ఉంటాయని భావించినట్లున్నారు. ఇవన్నీ మున్ముందు పరిగణనలోకి తీసుకుంటాం’ అని కెప్టెన్ జట్టు ఓటమిని విశ్లేషించాడు. వ్యూహాలు మార్చాలి భారత్‌లో వరల్డ్ కప్ పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. సొంతజట్టుకే అంతా అనుకూలం అంటూ టీమిండియాను ప్రత్యర్థులు ముందే చాంపియన్‌ను చేస్తున్నాయి. కానీ పరిస్థితి అంత అనుకూలంగా కూడా ఏమీ లేదు. భారత గడ్డపై ధోని సేనకు ఇది వరుసగా మూడో టి20 ఓటమి. దక్షిణాఫ్రికాలో మొదటి మ్యాచ్‌లో 199 చేసినా ఓడిపోగా, తర్వాతి మ్యాచ్‌లో 92కే జట్టు కుప్పకూలింది. సఫారీవంటి పటిష్ట ప్రత్యర్థితో పోలిస్తే బలహీనమైన లంక చేతిలో పరాజయం షాక్వంటిదే. వరల్డ్ కప్ వేదికలు బ్యాటింగ్ కోసమే అన్నట్లుగా సిద్ధం చేయాలని ఒకవేళ నిర్ణయించినా... కేవలం పిచ్‌ల కారణంగా ఫలితం మనకే అనుకూలంగా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. పైగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట పుణేలాంటి పిచ్ కూడా ఎదురు కావచ్చు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఇటీవలి టీమిండియా విజయాల్లో టాప్-3 రోహిత్, ధావన్, కోహ్లిలే దాదాపుగా మ్యాచ్‌లు ముగించారు. దాంతో తర్వాతి వారికి బ్యాటింగ్ అవకాశమూ రాలేదు. తొలి టి20లో మన బ్యాటింగ్ లోతు తెలిసింది. అందరికీ బ్యాటింగ్ అవకాశం రావడం మంచిదే అంటూ ధోని వెనకేసుకొచ్చినా... అవసరమైన సమయంలో వారిలో ఎవరి సత్తా ఏమిటో కూడా బయటపడాలి. దాదాపు ఏడేళ్ల అనుభవం తర్వాత కూడా జడేజా కనీస బ్యాటింగ్ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. తన విలువేంటో చూపించాల్సిన మ్యాచ్‌లో రహానే విఫలం కావడం నిరాశ కలిగించింది. టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు పుణే మ్యాచ్ ఒక హెచ్చరికలాంటిది. ఆటగాళ్లందరినీ పరీక్షించడంతో పాటు వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో కూడా ఈ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ధోని సేన ప్రపంచ చాంపియన్ కాగలుగుతుంది. -
మరో క్లీన్‌స్వీప్‌పై దృష్టి!
జోరు మీదున్న టీమిండియా ఒత్తిడిలో జింబాబ్వే నేడు తొలి టి20 మ్యాచ్ స్టార్ ఆటగాళ్లు లేకపోయినా భారత జట్టు బలమేమిటో వన్డే సిరీస్‌లో ఏకపక్ష విజయంతో తేలిపోయింది. మన కుర్రాళ్ల సత్తా ఏమిటో కూడా అందులో బయటపడింది. ఇక ఇదే జోరును కొనసాగించి పర్యటనలో పరిపూర్ణ విజయం అందుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో టి20 సిరీస్‌కు రంగం సిద్ధమైంది. మరో వైపు ఆతిథ్య జట్టు కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉంది. హరారే: ఐదేళ్ల క్రితం భారత్, జింబాబ్వే మధ్య జరిగిన రెండు టి20 మ్యాచ్‌లలోనూ మన జట్టుదే పైచేయి అయింది. ఇది మినహా ఈ టీమ్‌ల మధ్య మరో అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. ఇప్పుడు అదే మైదానంలో మరో సారి పొట్టి ఫార్మాట్లో ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. వన్డే సిరీస్ గెలిచిన భారత్ మరింత ఉత్సాహంతో బరిలోకి దిగుతుండగా, జింబాబ్వే సంచలనాన్ని ఆశిస్తోంది. అంతా సిద్ధం ఐపీఎల్ ద్వారా టి20ల్లో అమితానుభవం గడించిన భారత ఆటగాళ్లు ఈ ఫార్మాట్లో ప్రత్యర్థితో పోలిస్తే చాలా ముందంజలో ఉన్నారు. ఒకరు ఇద్దరు కాకుండా జట్టులో దాదాపు అంతా టి20 శైలికి తగిన ఆటగాళ్లే. మూడో వన్డేలో విజయం సాధించిన తుది జట్టునే ఈ మ్యాచ్‌లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. అయితే అన్ని మ్యాచ్‌లలో విఫలమైన మనోజ్ తివారిని తప్పిస్తే సంజు శామ్సన్‌కు కెరీర్లో తొలి మ్యాచ్ ఆడే చాన్స్ రావచ్చు. రహానే, విజయ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగితే ఆ తర్వాత ఉతప్ప మూడో స్థానంలో వస్తాడు. వన్డేల్లో ఘోరంగా విఫలమైన ఉతప్ప ఇక్కడైనా రాణించాల్సి ఉంది. రాయుడు స్థానంలో వన్డేలో బరిలోకి దిగిన మనీశ్ పాండే ఈ ఫార్మాట్లోనూ ధాటిగా ఆడగల సమర్థుడు కాబట్టి మిడిలార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. ఇద్దరు పేసర్లు భువీ, మోహిత్‌లతో పాటు ఆల్‌రౌండర్‌గా బిన్నీ కీలక పాత్ర పోషిస్తాడు. రికార్డు అంతంత మాత్రం మరో వైపు జింబాబ్వే టి20 రికార్డు గొప్పగా ఏమీ లేదు. ఓవరాల్‌గా గెలిచిన 6 మ్యాచ్‌లలో 2007లో ఆస్ట్రేలియాపై మినహా మిగతా అన్నీ చిన్న జట్లపైనే. ఆ జట్టులోని ఆటగాళ్లకు కూడా అనుభవం తక్కువ. వన్డే సిరీస్‌లో కాస్త మెరుగ్గా కనిపించిన తమ బౌలింగ్ ఇక్కడా ఏదైనా సంచలనానికి అవకాశం కల్పిస్తుందని కోచ్ వాట్మోర్ ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌లో చిబాబా ప్రధాన ఆటగాడు కాగా, వన్డేల్లో పెద్దగా రాణించని సీనియర్లు మసకద్జా, చిగుంబురాలపై జట్టు ఆధార పడింది. బౌలింగ్‌లో రజా, ఉత్సెయ, విటోరిలు రాణించడంపైనే జింబాబ్వే అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. మొత్తానికి అన్ని రంగాల్లోనూ భారత్‌దే పైచేయిగా కనిపిస్తున్న చోట ఆతిథ్య జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వగలదో చూడాలి. జట్ల వివరాలు (అంచనా) భారత్: రహానే (కెప్టెన్), విజయ్, ఉతప్ప, తివారి/శామ్సన్, పాండే, జాదవ్, బిన్నీ, హర్భజన్, అక్షర్, భువనేశ్వర్, మోహిత్. జింబాబ్వే: చిగుంబుర (కెప్టెన్), మసకద్జా, చిబాబా, చకాబ్వా, రిచ్మండ్, రజా, విలియమ్స్/వాలర్, ఉత్సెయ, తిరిపనో, మద్జివా, విటోరి. రెండో ర్యాంక్‌లోనే భారత్ దుబాయ్: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం టీమిండియాకు కలిసొచ్చింది. ప్రస్తుతం 115 పాయింట్లతో ఉన్న భారత్... అ గ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా (129) కంటే 14 పాయింట్లు వెనుకబడి ఉంది. మరోవైపు స్వదేశంలో వరుసగా నాలుగు వన్డే సిరీస్‌లను గెలిచి ఏడో ర్యాంక్‌లో నిలిచిన బంగ్లాదేశ్ 2017 చాంపియన్స్ ట్రోఫీలో బెర్త్‌ను ఖాయం చేసుకుంది. -
బంగ్లాదేశ్‌పై దక్షిణాఫ్రికా ఘన విజయం
మిర్పూర్: బంగ్లాదేశ్ పర్యటనను దక్షిణాఫ్రికా ఘనంగా ఆరంభించింది. ఆదివారం ఇక్కడ ఏకపక్షంగా జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. కెప్టెన్ డు ప్లెసిస్ (61 బంతుల్లో 79 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగాడు. బంగ్లాదేశ్ 18.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. డుమి ని, వీస్, రబడ తలా 2 వికెట్లు తీశారు. రెండో టి20 మ్యాచ్ మంగళవారం జరుగుతుంది. -
భారత మహిళల గెలుపు
దక్షిణాఫ్రికాతో టి20 మ్యాచ్ బెంగళూరు: మూడు వన్డేల సిరీస్‌లో ఓటమి పాలైన భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో మాత్రం గెలిచి ఊరట చెందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ బృందం 16 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 146 పరుగులు చేసింది. ఓపెనర్ మిథాలీ రాజ్ (31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 40), స్మృతి మందన (42 బంతుల్లో 5 ఫోర్లతో 52) ఆకట్టుకున్నారు. అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 130 పరుగులు సాధించి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ (2/20), పూనమ్ యాదవ్ (3/18) రాణించారు. -
ఆసీస్‌దే టి20 సిరీస్
ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా సిడ్నీ: ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టి20లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. స్టేడియం ఆస్ట్రేలియాలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఫించ్‌సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.... బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. డి కాక్ (27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హెండ్రిక్స్ (48 బంతుల్లో 49; 5 ఫోర్లు); మిల్లర్ (26 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ఫాల్క్‌నర్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేసి నెగ్గింది. వైట్ (31 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ఫించ్ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్వెల్ (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. డేవిడ్ వైస్, పీటర్సన్ చెరో మూడు వికెట్లు తీశారు. వైట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ఫాల్క్‌నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.