రెండు వరుస విజయాల ఊపులో భారత్... శ్రీలంకపై రికార్డు ఛేదన ఆత్మవిశ్వాసంతో బంగ్లాదేశ్... టీమిండియా గెలిస్తే రాజసంగా ఫైనల్ చేరుతుంది... బంగ్లాదేశ్ నెగ్గితే తుది పోరు రేసులో ముందుంటుంది!
కొలంబో: అనుభవం లేని ఆటగాళ్లతో బరిలో దిగి... ఆరంభ విఘ్నాన్ని అధిగమించి గాడిన పడిన టీమిండియా బుధవారం నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నీలో బంగ్లాదేశ్‌ను ఎదుర్కోనుంది. రోహిత్ సేనకిది చివరి లీగ్ మ్యాచ్. కాగా ముష్ఫికర్ బృందం ఆతిథ్య శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దీంట్లో నెగ్గితే... రన్‌రేట్ వంటి సాంకేతికాంశాల అవసరం లేకుండా భారత్ నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఓడినా ప్రస్తుతానికి రన్‌రేట్ మెరుగ్గా (+0.21) ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది రాదు. అయితే... శ్రీలంక, బంగ్లాదేశ్ మ్యాచ్ ఫలితం కోసం కొంత ఎదురుచూడాల్సి రావచ్చు.
మార్పుల్లేకుండానే భారత్!
టోర్నీ తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై పరాజయం నుంచి టీమిండియా త్వరగానే కోలుకుంది. స్థాయికి తగ్గట్లు ఆడి తర్వాత వరుసగా రెండు విజయాలు అందుకుంది. బంగ్లాదేశ్‌పై ఈ స్థితిలో ప్రయోగాలు చేసి ఇబ్బంది పడటం ఎందుకని భావిస్తే గత మ్యాచ్‌లో ఆడిన జట్టునే బరిలో దించే అవకాశం ఉంది. దీంతో రిషభ్ పంత్ సహా మొహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, దీపక్ హుడా మరోసారి బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. అయితే... ప్రధాన ఆందోళనంతా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ గురించే. మరో ఓపెనర్ ధావన్ రాణిస్తున్నా, రోహిత్ తక్కువ స్కోర్లకే వెనుదిరుగుతుండటంతో శుభారంభాలు దక్కడం లేదు. కీలకమైన ఫైనల్‌కు ముందు కెప్టెన్ ఫామ్ అందుకుంటే జట్టుకు అంతకుమించిన ఆనందం ఉండదు. మరోవైపు కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపి రోహిత్ నాలుగో స్థానంలో వచ్చే ఆలోచనపైనా చర్చ జరుగుతోంది. రైనా మెరుపులకు తోడు మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్‌లతో మిడిలార్డర్ స్థిరంగా ఉంది. అచ్చం బ్యాటింగ్‌లోలాగే బౌలింగ్‌లో ‘ఓపెనింగ్’ ఇబ్బంది ఎదురవుతోంది. పేసర్ జైదేవ్ ఉనాద్కట్ భారీగా పరుగులిస్తున్నాడు. కొత్త బంతి పంచుకుంటున్న యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ పొదుపైన బౌలింగ్, ఆపై శార్దుల్ ఠాకూర్, విజయ్ శంకర్ కొంత కట్టడి చేస్తుండటంతో ప్రభావం కనిపించడం లేదు. వీరితో పాటు చహల్ సైతం మెరుగ్గా రాణిస్తేనే... బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను నిలువరించగలరు.
బ్యాటింగ్‌పైనే బంగ్లా ఆశలు
తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్‌దాస్, ముష్ఫికర్ రహీమ్ లంకపై చెలరేగి ఆడారు. కెప్టెన్ మహ్మూదుల్లా, షబ్బీర్ రెహ్మాన్ రాణించకున్నా జట్టు ఘన విజయం సాధించిందంటే వీరే కారణం. ఇప్పటివరకు పెద్దగా బయటపడని తన ఆటను లిటన్‌దాస్ గత మ్యాచ్‌లో రుచి చూపించాడు. సౌమ్యను కాదని తనను ఓపెనర్‌గా పంపిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌కు బంగ్లాదేశ్ రెండు మార్పులు చేసేలా కనిపిస్తోంది. భారీగా పరుగులిస్తున్న తస్కిన్ అహ్మద్ స్థానంలో అబు జయేద్‌ను, బ్యాట్స్‌మన్ షబ్బీర్ బదులు ఆరిఫుల్ హక్‌ను ఎంచుకోవచ్చు. మంచి బ్యాటింగ్ లైనప్ ఉన్న ఈ జట్టుకు... పేసర్లు ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, స్పిన్నర్ మెహదీ హసన్‌ల ప్రతిభ తోడైతే విజయం కష్టం కాబోదు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రైనా, రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, చహల్, శార్దుల్ ఠాకూర్, జైదేవ్ ఉనాద్కట్.
బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్‌దాస్, ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్/ఆరిఫుల్ హక్, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్/అబు జయేద్, మెహదీ హసన్, నజ్ముల్ ఇస్లాం.
పిచ్, వాతావరణం
సాయంత్రం, రాత్రి వేళల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది.
రాత్రి గం. 7 నుంచి డి స్పోర్ట్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment