అన్ని రంగాల్లో ఆధిపత్యం... ప్రత్యర్థిపై సాధికార విజయం... రన్‌రేట్, గణాంకాలతో పని లేదు... అవతలి జట్ల ఫలితాలతో సంబంధం లేదు... తుది సమరానికి ఆత్మవిశ్వాసంతో పయనం... టీమిండియా కప్ గెలవడమే ఇక తరువాయి!
కొలంబో: టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. దాంతో నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నమెంట్‌లో భారత్ రాజసంగా ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఇక్కడ జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... కెప్టెన్ రోహిత్ శర్మ (61 బంతుల్లో 89; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు, సురేశ్ రైనా (30 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్ (27 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)ల సమయోచిత ఆటతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం వాషింగ్టన్ సుందర్ (3/22) స్పిన్ ఉచ్చులో చిక్కిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ (55 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) తుదికంటా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. తమీమ్ ఇక్బాల్ (19 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), షబ్బీర్ రహ్మాన్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప మిగతావారెవరూ రాణించలేదు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది.
రోహిత్ జయహో... రైనా అదరహో
ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం, ఆపై బంగ్లా బలహీన బౌలింగ్‌ను తలచుకుని భారత్ భారీ స్కోరు చేసేందుకు మంచి అవకాశంగా అభిమానులు భావించారు. కానీ ప్రత్యర్థి ఇందుకు ఆస్కారం ఇవ్వలేదు. పైగా తొలి ఐదు ఓవర్లను ఒక్కో బౌలర్‌తో వేయించి ఆశ్చర్యపరిచిం ది. టీమిండియా ఓపెనర్లలో ధావన్ ఎప్పటిలాగే జోరు చూపించినా, రోహిత్ టైమింగ్ కుదరక ఇబ్బంది పడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ ఓ మాదిరిగానే ప్రారంభమైంది. పదో ఓవర్ ఐదో బంతికి ధావన్ అవుటయ్యేసరికి భారత్ స్కోరు 70/1. రోహిత్ ఎక్కువ బంతులు ఎదుర్కొన్నా దూకుడుగా ఆడలేకపోయాడు. 13వ ఓవర్లో కాని అతడి అర్ధ శతకం (42 బంతుల్లో) పూర్తవలేదు. గత నెలలో పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో దక్షిణాఫ్రికాపై శతకం తర్వాత ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌కిదే తొలి అర్ధ శతకం కావడం గమనార్హం. అయితే... తర్వాతి నుంచే పరిస్థితి మారింది. కుదురుకున్న రైనా, మెహదీ హసన్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ఊపులోకి వచ్చాడు. ఇద్దరూ జోరు చూపడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. ఇక అబు హైదర్ వేసిన 18వ ఓవర్లో రోహిత్ రెండు, రైనా ఒక సిక్స్ కొట్టి 21 పరుగులు పిండుకు న్నారు. దీంతో కెప్టెన్ వ్యక్తిగత స్కోరు 79కి చేరింది. 19వ ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టిన ‘హిట్‌మ్యాన్’ సెంచరీ చేయడం ఖాయంగా కనిపించింది. కానీ చివరి ఓవర్ అద్భుతంగా వేసిన రూబెల్ హుస్సేన్ 4 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు.
సుందర్ మాయలో పడి...
గత మ్యాచ్‌లో లంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆశ్చర్యపరిచిన బంగ్లాదేశ్‌కు ఈసారి 177 పరుగులు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ బంగ్లా జట్టు భారత యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వలలో పడిపోయింది. టోర్నీలో కొత్త బంతిని పంచుకుంటూ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్న సుందర్ తన మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. వరుస ఓవర్లలో లిటన్ దాస్ (7), సౌమ్య సర్కార్ (1), తమీమ్ ఇక్బాల్‌లను పెవిలియన్‌కు పంపి బంగ్లాను దెబ్బతీశాడు. కెప్టెన్ మహ్ముదుల్లా (11)ను చహల్ అవుట్ చేయడంతో ఆ జట్టు 61 పరుగులకే నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. ముష్ఫికర్, షబ్బీర్‌లు అయిదో వికెట్‌కు 65 పరుగులు జోడించినా అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. భారత బౌలర్లలో చహల్ (1/21), విజయ్ శంకర్ (0/28) రాణించినా, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (1/50) ధారాళంగా పరుగులిచ్చాడు.
►అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ (75 సిక్సర్లు) రికార్డు.
►భారత్ తరఫున టి20 మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన పిన్న వయస్సు బౌలర్‌గా సుందర్ (18 ఏళ్ల 160 రోజులు) గుర్తింపు. అక్షర్ పటేల్ (21 ఏళ్ల 178 రోజులు; జింబాబ్వేపై 2015లో) పేరిట ఉన్న రికార్డు తెరమరుగు.
►టి20ల్లో బంగ్లాదేశ్‌పై భారత్‌కిది వరుసగా ఏడో విజయం.
Comments
Please login to add a commentAdd a comment