
రో‘హిట్’ ఫార్ములా
భారత్‌ను గెలిపించిన రోహిత్ శర్మ
45 పరుగులతో బంగ్లాదేశ్ చిత్తు
ఆసియా కప్ టి20 టోర్నీ
శనివారం పాక్‌తో భారత్ పోరు
పిచ్ బౌలింగ్‌కు బాగా అనుకూలిస్తోంది. ఒక వైపు వరుసగా వికెట్లు పడిపోతున్నాయి. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ అడ్డుగా నిలబడ్డాడు. ముందుగా నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత తనదైన శైలిలో చెలరేగిపోయాడు. కొద్దిలో సెంచరీ అవకాశం కోల్పోయినా తన సూపర్ హిట్ బ్యాటింగ్‌తో జట్టుకు మరో విజయాన్ని అందించాడు. కుర్రాడు పాండ్యా కూడా మళ్లీ నమ్మకాన్ని నిలబెట్టాడు.
భారత్ బలం ముందు బంగ్లాదేశ్ ఆటలు సాగలేదు. ఏడాది క్రితం వన్డేల ఫలితాన్ని మళ్లీ చూపిద్దామనుకున్న ఆ జట్టు టి20ల్లో బోర్లా పడింది. మన జట్టు బౌలింగ్ ముందు కనీస ప్రదర్శన చూపలేక చేతులెత్తేసింది. ఫలితంగా టీమిండియా సమష్టితత్వంతో ఆసియా కప్‌లో శుభారంభం చేసింది. వరుస విజయాల జోరులో ఉన్న ధోనిసేన తమ జైత్రయాత్రను మిర్పూర్‌లోనూ కొనసాగించింది.
మిర్పూర్: ఆసియా కప్‌ను భారత్ ఘనవిజయంతో ఆరంభించింది. బుధవారం ఇక్కడి షేర్ ఎ బంగ్లా స్టేడియంలో దాదాపు ఏకపక్షంగా సాగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 45 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (55 బంతుల్లో 83; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడుగా ఆడగా, హార్దిక్ పాండ్యా (18 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్) ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 27 బంతుల్లోనే 61 పరుగులు జోడించడం విశేషం. హుస్సేన్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేయగలిగింది. షబ్బీర్ రహమాన్ (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా మిగతావారంతా ఘోరంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆశిష్ నెహ్రా (3/23) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. భారత్ తమ తర్వాతి మ్యాచ్‌లో శనివారం పాకిస్తాన్‌తో తలపడుతుంది.
రోహిత్ మెరుపులు
ఆరంభంలో భారత్ ఇన్నింగ్స్ తడబాటుకు లోనైంది. రెండో ఓవర్లోనే ధావన్ (2) అవుట్ కాగా, కోహ్లి (8) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఆ తర్వాత రైనా (13)ను చక్కటి బంతితో మహ్ముదుల్లా బౌల్డ్ చేయడంతో జట్టు ఇబ్బందుల్లో పడింది. మరో ఎండ్‌లో రోహిత్ శర్మ మాత్రం భారీ షాట్లు కొట్టకపోయినా, నెమ్మదిగా క్రీజ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నం చేశాడు. 21 పరుగుల వద్ద తస్కీన్ బౌలింగ్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను పాయింట్‌లో షకీబ్ వదిలేయగా...తర్వాతి మూడు బంతుల్లో రోహిత్ 4,6,4 బాదడంతో స్కోరు జోరు పెరిగింది. ఈ క్రమంలో 42 బంతుల్లో అతను అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యువరాజ్ (16 బంతుల్లో 15; 1 ఫోర్) పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, రోహిత్‌కు అండగా నిలిచాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 42 బంతుల్లో 55 పరుగులు జోడించారు. అయితే రోహిత్, పాండ్యా భాగస్వామ్యం భారత్‌ను ముందంజలో నిలిపింది. మొర్తజా ఓవర్లో వరుసగా 6,4,4 కొట్టి రోహిత్ తన ధాటిని కొనసాగించగా...మరో ఎండ్‌లో పాండ్యా కూడా ఆత్మవిశ్వాసంతో షాట్లు ఆడాడు. వీరిద్దరి దూకుడుకు ముస్తాఫిజుర్ వేసిన ఒక ఓవర్లో 21 పరుగులు వచ్చాయి. 15-19 మధ్య ఐదు ఓవర్లలో భారత్ 67 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రోహిత్, పాండ్యా వెనుదిరిగినా, ధోని (8 నాటౌట్) భారీ సిక్సర్‌తో ఇన్నింగ్స్‌ను ముగించాడు. షకీబ్ క్యాచ్ వదిలేసే సమయానికి 28 బంతుల్లో 21 పరుగులే చేసిన రోహిత్...తర్వాతి 27 బంతుల్లో 62 పరుగులు చేయడం విశేషం.
షబ్బీర్ మినహా...
భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. మిథున్ (1)ను అవుట్ చేసి నెహ్రా శుభారంభం ఇవ్వగా, మరుసటి ఓవర్లోనే బుమ్రా బౌలింగ్‌లో సర్కార్ (11) వెనుదిరిగాడు. షబ్బీర్ ఒంటరి పోరాటం చేసినా... మరో ఎండ్‌లో అతనికి ఎవరూ అండగా నిలవలేదు. ఆ జట్టు తక్కువ వ్యవధిలో వెంట వెంటనే వికెట్లు కోల్పోయింది. సగం ఓవర్లు ముగిసే సరికే జట్టు విజయంపై ఆశలు వదులుకుంది. ముష్ఫికర్ (16 నాటౌట్), తస్కీన్ (15 నాటౌట్) చివర్లో కొద్దిగా పోరాడే ప్రయత్నం చేసినా లక్ష్యానికి బంగ్లా చాలా దూరంలో నిలిచిపోయింది. భారత బౌలర్లలో ఐదుగురు తలా 4 ఓవర్లు వేశారు. ఇందులో జడేజా 25 పరుగులు ఇవ్వగా... మిగతా నలుగురు సరిగ్గా 23 పరుగుల చొప్పున ఇవ్వడం విశేషం.
టాస్ గెలిచినా బ్యాటింగే తీసుకునేవాడిని. భారీ స్కోరు చేసి ప్రత్యర్థికి లక్ష్యం విధించాలని ముందే నిర్ణయించుకున్నా. బంగ్లా బౌలర్లు షార్ట్ ఆఫ్ లెంగ్త్ బంతులు ఎక్కువగా వేశారు. నేరుగా భారీషాట్లకు పోకుండా చాలా జాగ్రత్తగా ఆడాల్సి వచ్చింది. భయపడకుండా దూకుడుగా ఆడగల నైపుణ్యం హార్దిక్‌లో ఉంది. అందుకే అతనికి ఎక్కువ మ్యాచ్‌లలో అవకాశం ఇస్తున్నాం. పైగా మంచి ఫీల్డర్, మూడో పేసర్‌గా ఎంతో పనికొస్తాడు. నా వెన్నునొప్పి గురించి అప్పుడే చెప్పలేను. ప్రస్తుతానికి విశ్రాంతి తీసుకుంటా. -ధోని
అంతర్జాతీయ టి20ల్లో వేయి పరుగులు పూర్తి చేసుకున్న నాలుగో భారత ఆటగాడు యువరాజ్. అతనికంటే ముందు విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, రోహిత్ శర్మ ఈ మైలురాయి దాటారు.
స్కోరు వివరాలు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) సర్కార్ (బి) హుస్సేన్ 83; ధావన్ (బి) హుస్సేన్ 2; కోహ్లి (సి) మహ్ముదుల్లా (బి) మొర్తజా 8; రైనా (బి) మహ్ముదుల్లా 13; యువరాజ్ (సి) సర్కార్ (బి) షకీబ్ 15; పాండ్యా (సి) మహ్ముదుల్లా (బి) హుస్సేన్ 31; ధోని (నాటౌట్) 8; జడేజా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 166. వికెట్ల పతనం: 1-4; 2-22; 3-42; 4-97; 5-158; 6-158.
బౌలింగ్: తస్కీన్ 3-0-22-0; హుస్సేన్ 4-0-37-3; ముస్తఫిజుర్ 4-0-40-0; మొర్తజా 4-0-40-1; మహ్ముదుల్లా 2-0-9-1; షకీబ్ 3-0-15-1.
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: సర్కార్ (సి) ధోని (బి) బుమ్రా 11; మిథున్ (బి) నెహ్రా 1; షబ్బీర్ (సి) ధోని (బి) పాండ్యా 44; కైస్ (సి) యువరాజ్ (బి) అశ్విన్ 14; షకీబ్ (రనౌట్) 3; ముష్ఫికర్ (నాటౌట్) 16; మహ్ముదుల్లా (సి) రోహిత్ (బి) నెహ్రా 7; మొర్తజా (సి) జడేజా (బి) నెహ్రా 0; తస్కీన్ (నాటౌట్) 15; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 121.
వికెట్ల పతనం: 1-9; 2-15; 3-50; 4-73; 5-82; 6-100; 7-100.; బౌలింగ్: నెహ్రా 4-0-23-3; బుమ్రా 4-0-23-1; పాండ్యా 4-0-23-1; అశ్విన్ 4-0-23-1; జడేజా 4-0-25-0.