పొట్టి క్రికెట్టు గట్టి పోటి | T20 match to prepare for the sector | Sakshi
Sakshi News home page

పొట్టి క్రికెట్టు గట్టి పోటి

Published Thu, Feb 11 2016 11:31 PM | Last Updated on Tue, May 29 2018 6:13 PM

పొట్టి  క్రికెట్టు  గట్టి పోటి - Sakshi

పొట్టి క్రికెట్టు గట్టి పోటి

టీ20 మ్యాచ్‌కు రంగం సిద్ధం
రేపు విశాఖ చేరనున్న ఇండియా, శ్రీలంక జట్లు

 
ఒకే ఏడాదిలో మూడు అంతర్జాతీయ మ్యాచ్‌లు... విశాఖలోని వైఎస్‌ఆర్ స్టేడియం సరికొత్త రికార్డును సొంతం చేసుకోనుంది.  ఒకే ఏడాదిలో మూడు అంతర్జాతీయ మ్యాచ్‌ల్ని నిర్వహించే స్టేడియం కానుంది.  ఆదివారం జరిగే టీ20 మ్యాచ్ ఇందులో తొలిది కాగా ఏడాది చివరిలోగానే మరో రెండు అంతర్జాతీయ జట్లు ఇక్కడ మ్యాచ్‌లు ఆడనున్నాయి.  అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్ ఐదు వన్డేలు భారత్‌లో ఆడనుండగా... ఆ వెంటనే ఇంగ్లండ్ జట్టు భారత్ పర్యటించనుంది.  నవంబర్-డిసెంబర్‌లో నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.  దీంతో ఒకే ఏడాది విశాఖ వేదికగా శ్రీలంకతో టీ20 మ్యాచ్‌ను...న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌ను విశాఖ క్రీడాభిమానులు వీక్షించనున్నారు. విశాఖ వేదికగా తొలిసారిగా జరగనున్న టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటను ఆస్వాదించనున్నారు.
 
విశాఖపట్నం : విశాఖ వేదికగా పొట్టి క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు భారత్, శ్రీలంక జట్లు శనివారం విశాఖ చేరుకోనున్నాయి.  ఆ రోజు ప్రాక్టీస్ అనంతరం ఆదివారం ఇరుజట్లు రాత్రి ఏడున్నర గంటలకు సిరీస్‌లో చివరిదైన టీ20 మ్యాచ్ ఆడనున్నాయి. విశాఖలో జరిగే టీ20 మ్యాచ్ తర్వాత ఇరుజట్లు ఆసియా కప్ టీ20లోనే ఆడనున్నాయి. ఆ తర్వాత టీ20 వరల్డ్‌కప్. తొలి టీ20 వరల్డ్‌కప్‌ను సాధించిన జట్టుగా భారత్ పేరుగడిస్తే...టీ20 వరల్డ్ రాంకింగ్స్‌లో తొలి స్థానంలో కొనసాగుతున్న జట్టు శ్రీలంక. దీంతో ఇరు జట్లకు విశాఖ వేదికగా జరగనున్న మ్యాచ్ కీలకంగా మారింది.

టీ20 ఎలా అయింది...
క్రికెట్‌కు పుట్టిల్లు ఇంగ్లండ్ అని అందరికి తెలిసిందే.  1744 నాటికి క్రికెట్ ఆడేందుకు నిబంధనల్ని రూపొందించారు. 1962 నాటికి నిర్ణీత ఓవర్ల క్రికెట్ పురుడు పోసుకుంది. 71లో డొమెస్టిక్ టోర్నీ నిర్వహించారు. ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ నలభై ఓవర్ల ఇన్నింగ్స్‌తో జరిగింది.  అప్పట్లో ఓవర్‌కి ఎనిమిది బంతులుండేవి. ఇక 1990 వచ్చేనాటికి మరింత కుదించి ఇరుజట్లు పదేసి ఓవర్లతో (ఓవర్‌కు పది బంతులు) ఆడే విధంగా న్యూజిలాండ్ కెప్టెన్ మార్టిన్ క్రో ప్రవేశపెట్టాడు.  ఆస్ట్రేలియన్లు సూపర్ 8గా మార్చగా పొట్టి క్రికెట్‌పై పరిశోధన జరిగింది.  ఇరవై ఓవర్ల ఇన్నింగ్స్‌తో ఆడే విధంగా రూపకల్పన జరిగింది. 2003లో హాంప్‌షైర్‌తో ససెక్స్ ఈ పొట్టి ఫార్మేట్ మ్యాచ్‌లో తలపడింది.

తొలి విజేత భారతే...
అప్పటికే ఐదు రోజులు ఆడినా కొన్ని సందర్భాల్లో ఫలితం రాకపోతుండడంతో మ్యాచ్ కాస్తా వన్డేగా రూపాంతరం చెందింది. ఇక టీ20గా మారిపోయిన తర్వాత క్రికెట్ వీక్షించే అభిమానులు పెరిగిపోయారు.  దీంతో 2007లో తొలి అంతర్జాతీయ టీ20 టోర్నీ దక్షిణాఫ్రికాలో నిర్వహించారు.  ఈ టోర్నీ ఫైనల్స్‌లో దాయాది పాకిస్తాన్‌పై విజయంతో భారత్ తొలి టీ20 ట్రోఫీ కైవసం చేసుకుంది. టోర్నీ విజయవంతం కావడంతో రెండేళ్ళ అనంతరం నిర్వహించేందుకు తీర్మానం చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి ప్రతి రెండేళ్ళకు ఒకసారి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహిస్తున్నారు.

భారత్‌దే పై చేయి...
ప్రస్తుతం టీ20 అంతర్జాతీయ రాంకింగ్‌లో శ్రీలంక జట్టే ముందుంది.  ఇంగ్లండ్‌తో కలిసి భారత్ మూడో స్థానంలోనే కొనసాగుతుంది. ఇక శ్రీలంక-భారత్ జట్లు టీ20  మ్యాచ్‌ల్లో పలుసార్లు తలపడ్డాయి.  రెండు దేశాల మధ్య  మూడుసార్లు సిరీస్ జరిగింది. రెండుసార్లు భారత్ జట్టు శ్రీలంకలో పర్యటించింది. ఒకే మ్యాచ్ సిరీస్‌లో భాగంగా జరగ్గా రెండు సార్లు భారత్‌నే విజయం వరించింది. అయితే శ్రీలంక జట్టు భారత్‌లో ఓసారి పర్యటించగా రెండు మ్యాచ్‌లు జరిగాయి. చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ డ్రాగా ముగిసింది.  ఆరేళ్ళ అనంతరం మళ్ళీ భారత్‌లో టీ20 సిరీస్ ఆడేందుకు శ్రీలంక వచ్చింది.  ఈసారి మూడు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.  ఇప్పటికే తొలి మ్యాచ్ గెలిచిన శ్రీలంక మంచి ఊపు మీదుంది.  సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ విశాఖ వేదికగానే జరగనుండడంతో ఉత్కంఠ రేపుతున్నది.
 
రికార్డు స్కోర్...

టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ రికార్డు శ్రీలంక పేరిటే ఉంది.  2007లో కెన్యాపై ఏకంగా ఆరు వికెట్లకు 260 పరుగులు చేసేసింది.  అత్యధిక మార్జిన్‌తో గెలిచిన మ్యాచ్‌కూడా అదే.  అయితే అత్యధిక రికార్డుతోపాటు అత్యల్ప రికార్డు కూడా శ్రీలంకదే.  నెదర్లాండ్స్ జట్టు 2014లో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను 39 పరుగులకే చుట్టేశారు.
 
క్రికెట్ ఫీవర్ మొదలైంది

విశాఖపట్నం : భారత్, శ్రీలంక టీ20 సిరీస్ చివరి మ్యాచ్‌కు విశాఖ సిద్ధమైంది. క్రికెట్ అభిమానులు గురువారం తెలవారక ముందే మీ సేవా కౌంటర్ల వద్ద పడిగాపులు పడీ మరీ టిక్కెట్లను సొంతం చేసుకున్నారు.  నగరంలోని 16 సెంటర్లలో లోయర్ డినామినేషన్ టిక్కెట్లు రూ.300, రూ.600 టిక్కెట్లను అమ్మకానికి పెట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే హాట్‌కేక్‌ల్లా అమ్ముడు పోయాయి. వాస్తవానికి మ్యాచ్ జరిగే వైఎస్‌ఆర్ స్టేడియంలో 27వేల సీట్ల సామర్ధ్యం ఉన్నా...వాటిలో సగం టిక్కెట్లు మాత్రమే విక్రయించనున్నారు.  రెండు వందల రూపాయల టిక్కెట్లును కేవలం క్రీడా క్లబ్‌లకు మాత్రమే ఇవ్వనుండగా హైయ్యర్ డినామినేషన్ టిక్కెట్లు రూ.1500, రూ. 2000, రూ.మూడువేల టిక్కెట్లను ఆన్‌లైన్ ద్వారాను అమ్మకాలు జరిపారు.  మిగిలిన టిక్కెట్లతో పాటు వెయ్యి రూపాయిల టిక్కెట్లను శుక్రవారం విక్రయించనున్నారు. మీ సేవా కేంద్రాలతో పాటు స్టేడియంలోనూ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాట్టు చేసి టిక్కెట్ల విక్రయాలు జరిపారు.  టీ20 క్రికెట్ రాంకింగ్ తొలి స్థానంలో నిలిచిన శ్రీలంక జట్టుతో అతిథ్య జట్టు భారత్ అమీ తుమీ తేల్చుకునే ఘట్టానికి ఆదివారం తెరలేవనుంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement