
నాకంటూ సొంత శైలి ఉంది: రహానే
టి20 ఫార్మాట్ వచ్చాక బ్యాటింగ్ చేసే విధానంలో విపరీత మార్పులు వచ్చినా తాను మాత్రం ఫ్యాన్సీ షాట్ల జోలికి పోనని బ్యాట్స్‌మన్ అజింక్యా రహానే స్పష్టం చేశాడు. అలాంటి షాట్లు స్వల్ప కాలంలో పేరు తెచ్చినా అత్యున్నత స్థాయి కెరీర్‌కు చేర్చలేవని ఐపీఎల్-9లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టుకు ఆడుతున్న రహానే తెలిపాడు. ‘ఐపీఎల్‌లో నా బ్యాటింగ్ తీరుపై సంతృప్తిగా ఉన్నాను.
ఇతరులను అనుకరించాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను. నాకంటూ విభిన్న శైలి ఉంది. సంప్రదాయక క్రికెట్ షాట్లతో నేను బాగానే పరుగులు సాధిస్తున్నాను. దీన్ని మార్చాలని అనుకోవడం లేదు’ అని పుణే తరఫున 419 పరుగులు చేసిన రహానే తెలిపాడు.