స్టేడియంను సిద్ధం చేస్తున్న సిబ్బంది
విశాఖ స్పోర్ట్స్: విశాఖలో క్రికెట్ సందడి నెలకొంది. వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా గురు వారం రాత్రి 7 గంటలకు భారత్, ఆస్ట్రేలియా మొదటి టీ–20 మ్యాచ్ ప్రారంభం కానుంది. మ్యాచ్ కోసం ఇప్పటికే విశాఖ చేరుకున్న ఇరు జట్లు స్టేడియంలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో కూడా టికెట్ విక్రయించారు. ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ ఓటమి తర్వాత క్రికెట్ అభిమానులు చాలా డీలా పడ్డారు. ఆ ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
కీలక పో రు ముగిసిన తర్వాత జరుగుతున్న టీ–20 మ్యాచ్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారత జట్టు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో.. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో యువ క్రికెటర్లకు ఈ సిరీస్ గొప్ప సువర్ణావకాశం. ఐపీఎల్, ఇటీవల ఐర్లాండ్ టూర్‌లో విజృంభించిన కుర్రాళ్లు.. విశాఖ వేదికగా సత్తా చాటి జాతీయ జట్టులో బెర్త్ పదిలం చేసుకోవచ్చు. జోరుమీదున్న ఆస్ట్రేలియా జట్టును ఢీకొట్టి శుభారంభం అందించాలని కోరుకుంటున్నారు.
వరల్డ్ కప్ క్రికెట్ టైటిల్ సాధించి ఊపు మీదు న్న ఆస్ట్రేలియా నాలుగు రోజుల వ్యవధిలోనే విశాఖ వేదికగా టీ20 సిరీస్‌కి సిద్ధమైంది. భారత్ తరఫున ప్రధాన ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకుంటుండగా.. ఆస్ట్రేలియా తరఫున కొందరు ఆటగాళ్లు తమ ఇళ్లకు చేరారు. ఫైనల్‌లో సత్తాచాటిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పటికే విశాఖకు చేరుకుని నెట్స్‌లో శ్రమించారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటు అంతర్జాతీయ ఆరంగేట్రం చేసే కుర్రాళ్లు ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగనుండగా.. ఆసియా కప్, ఐర్లాండ్ టీ–20 సిరీస్ మినహా పూర్తిస్థాయిలో మేజర్ టోర్నీలు ఆడిన అనుభవం లేని యువ భారత్ జట్టు వారితో ఢీ కొట్టనుంది. భారత్‌కు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్‌కు, కోచ్‌గా వి.వి.ఎస్ లక్ష్మణ్‌కు ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్‌లో భారత్ కుర్రాళ్లు శుభారంభం చేసి ఆధిక్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటున్నారు.
పరిస్థితికి తగ్గట్టుగా రాణిస్తే విజయమే
విశాఖ స్పోర్ట్స్: పరిస్థితులకు తగ్గట్టుగా రాణిస్తే విజయం సాధ్యమేనని భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నారు. టీ–20 సిరీస్‌లోశుభారంభం చేసేందుకు ఎలాంటి ప్రణాళిక చేశారనే విషయాలను బుధవారం ఆయన మీడియాకు వివరించారు. వరల్డ్ కప్ ఫైనల్ ఓటమితో చాలా డిస్పాయింట్ అయ్యామని, అయితే టోర్నీ మొత్తం చాలా కష్టపడ్డామన్నారు. ఫైనల్‌కు చేరడంలో ప్రతీ ఆటగాడు సమష్టిగా జట్టుకు తోడ్పడినట్లు చెప్పారు. విశాఖలో పిచ్‌ను పరిశీలించానని, చాలా మంచి పిచ్ అన్నారు. నాయకుడిగా జట్టును ముందుండి నడిపించడం సవాలేనని, దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటానన్నారు. నూతనోత్తేజంతో ముందుకు సాగుతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment