'మిషన్‌' ముగిసింది | India's victory in the third T20 | Sakshi
Sakshi News home page

'మిషన్‌' ముగిసింది

Published Sun, Feb 25 2018 1:40 AM | Last Updated on Tue, Sep 18 2018 8:48 PM

India's victory in the third T20 - Sakshi

రోహిత్, ధావన్, రైనా

దక్షిణాఫ్రికా ఆధిపత్యంతో టెస్టు సిరీస్‌ ఫలితం ముందే తెలిసిపోయింది. భారత్‌ దూకుడుతో  వన్డే సిరీస్‌ ఏకపక్షంగా సాగింది. ఉత్కంఠ రేపే టి20 ఫార్మాట్లో మాత్రం రెండు జట్లూ పోటాపోటీగా ఆడాయి. సిరీస్‌ విజయం కోసం ఆఖరి మ్యాచ్‌ వరకు ఆగాయి. ఇందుకు తగ్గట్లే ఒకింత ఆసక్తిగా సాగిన మూడో టి20లో విజయం మన జట్టునే వరించింది. తద్వారా సఫారీ గడ్డపై వన్డే, టి20 సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా రికార్డు సొంతమైంది. ఏ లక్ష్యంతో దక్షిణాఫ్రికాకు టీమిండియా వచ్చిందో దానిని సాధించి సగర్వంగా తిరుగు పయనం కానుంది.  

కేప్‌టౌన్‌: సఫారీ పర్యటనలో ఆఖరి పంచ్‌ మనదే అయింది. దక్షిణాఫ్రికా పోరాటంతో శనివారం ఇక్కడ ఒకింత ఉత్కంఠగా సాగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో 7 పరుగులతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (40 బంతుల్లో 47; 3 ఫోర్లు), సురేశ్‌ రైనా (27 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. అనంతరం ఆతిథ్య జట్టు 6 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ డుమిని (41 బంతుల్లో 55; 3 సిక్స్‌లు, 2 ఫోర్లు) అర్ధ శతకం, జాన్‌కర్‌ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులు ప్రొటీస్‌ను గెలిపించలేకపోయాయి. దీంతో భారత్‌ 2–1 తేడాతో సిరీస్‌ను గెల్చుకుంది. సురేశ్‌ రైనాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ పురస్కారం లభించింది. మూడో మ్యాచ్‌కు సఫారీ జట్టులో స్మట్స్‌ స్థానంలో క్రిస్టియన్‌ జాన్‌కర్‌ అరంగేట్రం చేయగా, ప్యాటర్సన్‌ బదులు ఫాంగిసోను తీసుకున్నారు. భారత్‌ మూడు మార్పులతో బరిలో దిగింది. వెన్ను పట్టేయడంతో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దూరం కాగా... అతడి స్థానంలో దినేశ్‌ కార్తీక్‌ వచ్చాడు. గత మ్యాచ్‌లో విఫలమైన చహల్, ఉనాద్కట్‌లను పక్కనపెట్టి అక్షర్‌ పటేల్, బుమ్రాలకు చోటిచ్చారు.  

రైనా మెరుపులు... ధావన్‌ నిలకడ 
టాస్‌కు కోహ్లి కాకుండా రోహిత్‌ శర్మ మైదానంలోకి రావడంతో ఆశ్చర్యపోవడం అభిమానుల వంతైంది. అయితే సారథ్య బాధ్యత కూడా రోహిత్‌ (11) ఆటలో మార్పు చూపలేదు. ఈ ఫార్మాట్‌లో అతడి పేలవ ఫామ్‌ కొనసాగింది. మోరిస్‌ వేసిన ఇన్నింగ్స్‌ మొదటి ఓవర్‌లో రెండు ఫోర్లు కొట్టినప్పటికీ... రెండో ఓవర్‌ మూడో బంతికే డాలాకు ఎల్బీగా చిక్కాడు. మూడు టి20ల్లోనూ డాలా బౌలింగ్‌లోనే రోహిత్‌ అవుటవడం గమనార్హం. భారత ఇన్నింగ్స్‌లో హైలైట్‌ ఆటంటే రైనాదే. వన్‌డౌన్‌లో మరోసారి మెరుపులు మెరిపించాడీ లెఫ్ట్‌ హ్యాండర్‌. ఎదుర్కొన్న తొలి బంతినే స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ బాదాడు. ఓవైపు ధావన్‌ టైమింగ్‌ కుదరక ఇబ్బంది పడుతుంటే తను మాత్రం స్వేచ్ఛగా ఆడాడు. చకచకా సింగిల్స్, డబుల్స్‌ తీస్తూనే అలవోకగా ఫోర్లు కొట్టాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 49 బంతుల్లోనే 65 పరుగులు జోడించారు. ఇదే ఊపులో షమ్సీ బంతిని భారీ షాట్‌ ఆడబోయిన రైనా లాంగాన్‌లో బెహర్దీన్‌కు చిక్కాడు. మరోవైపు రెండు లైఫ్‌లు పొందిన ధావన్‌ 29వ బంతికి తొలి బౌండరీ సాధించాడు. వెంటవెంటనే ఇంకో రెండు ఫోర్లు కొట్టినా... జట్టు అవతలి ఎండ్‌లో మనీశ్‌ పాండే (10 బంతుల్లో 13; 1 సిక్స్‌) వికెట్‌ కోల్పోయింది. కొద్దిసేపటికే రెండో పరుగుకు యత్నించిన ధావన్‌ డీప్‌ మిడ్‌వికెట్‌ నుంచి డాలా విసిరిన డైరెక్ట్‌ హిట్‌కు రనౌటయ్యాడు. హార్దిక్‌ పాండ్యా (17 బంతుల్లో 21; 1 సిక్స్‌), ధోని (11 బంతుల్లో 12) బ్యాట్‌ ఝళిపించలేకపోయారు. క్రీజులో కీలక బ్యాట్స్‌మెన్‌ ఉన్నా ఆతిథ్య జట్టు బౌలర్లు పుంజుకోవడంతో ఒక దశలో టీమిండియాకు 29 బంతుల పాటు బౌండరీ కూడా రాలేదు. చివర్లో దినేశ్‌ కార్తీక్‌ (6 బంతుల్లో 13; 3 ఫోర్లు) దూకుడుతో  స్కోరు బోర్డులో కొంత కదలిక వచ్చింది. 

డుమిని నిలిచాడు... జాన్‌కర్‌ భయపెట్టాడు 
173 పరుగుల ఛేదనలో ప్రొటీస్‌కు శుభారంభం దక్కలేదు. భారత ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా, శార్దుల్‌తో పాటు హార్దిక్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆ జట్టు లక్ష్యం దిశగా పరుగులు చేయలేకపోయింది. మూడో ఓవర్లో హెన్‌డ్రిక్స్‌ (7)ను అవుట్‌ చేసి భువీ బ్రేక్‌ ఇవ్వగా, ఓపెనర్‌గా వచ్చిన మిల్లర్‌ (23 బంతుల్లో 24; 1సిక్స్, 2 ఫోర్లు)ను రైనా వెనక్కుపంపాడు. విధ్వంసక క్లాసెన్‌ (7) ఆటలు ఈసారి సాగలేదు. కానీ కెప్టెన్‌ డుమిని పోరాటం సాగించాడు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఇతడిని శార్దుల్‌ ఔట్‌ చేశాడు. వెంటనే మోరిస్‌ (4) కూడా అవుటయ్యాడు. అప్పటికి విజయ సమీకరణం 21 బంతుల్లో 59. అయితే... అరంగేట్ర ఆటగాడు జాన్‌కర్‌ తన విధ్వంసంతో భయపెట్టాడు. బెహర్దీన్‌ (15 నాటౌట్‌) తోడుగా విరుచుకుపడ్డాడు. జాన్‌కర్‌ ధాటికి 17, 18, 19 ఓవర్లలో కలిపి సఫారీ జట్టుకు ఏకంగా 45 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్‌లో 19 చేయాల్సి ఉండగా భువీ 11 పరుగులతోనే సరిపెట్టాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement