విరాట్ కోహ్లి
కొత్తగా వర్ణించేందుకు విశేషణాలు కరువైపోతున్నాయి... గొప్పతనం గురించి మళ్లీ మళ్లీ చెప్పడానికి అంకెలు కూడా చిన్నబోతున్నాయి... దిగ్గజాలతో పోలికను కూడా దాటిపోయి చాలా కాలమైంది... అయినా ఆ పరుగుల దాహం, సెంచరీలపై వ్యామోహం మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. కాస్త బయటకు వెళ్లి టీ తాగి వస్తానని చెప్పినట్లుగా అలా మైదానంలోకి వెళ్లడం, సెంచరీ బాది వచ్చేయడం అలవాటుగా మారిపోయింది. రోజుకో రికార్డు సవరించడాన్ని రొటీన్ వ్యవహారంగా మార్చుకున్న విరాట్ కోహ్లి మూడో వన్డేలోనూ మళ్లీ అదే చేసి చూపించాడు. 49 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచి మరో అరుదైన ఇన్నింగ్స్‌తో తన స్థాయిని ప్రదర్శించాడు. పరిస్థితులు ప్రతికూలంగా మారిపోయినా, అవతలి ఎండ్ నుంచి సహకారం లోపించినా ఎక్కడా వెనకడుగు వేయకుండా అతను దూసుకుపోయిన తీరు కోహ్లిని మరోసారి సూపర్ స్టార్‌గా నిలబెట్టింది. దూకుడుగా ఆడిన శిఖర్ ధావన్ అవుటయ్యాక జట్టు ఇన్నింగ్స్‌ను విరాట్ భుజాన వేసుకొని నడిపించిన వైనం అతడిని మరింత ఉన్నత స్థాయిలో నిలబెడుతుంది. శిఖర్ వెనుదిరిగాక భారత్ 163 పరుగులు చేస్తే... అందులో కోహ్లి ఒక్కడివే 101 పరుగులు ఉన్నాయి. తన వికెట్ విలువేమిటో కోహ్లికి తెలిసినంతగా మరెవరికీ తెలీదంటే అతిశయోక్తి కాదు. ఈ మ్యాచ్‌లో కూడా ప్రత్యర్థి బౌలర్లకు అతను ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఏ దశలో కూడా అతను ఒక్క తప్పుడు షాట్ ఆడలేదు.
ఎక్కడా బౌండరీల కోసం బలవంతపు దూకుడుకు ప్రయత్నించలేదు. ఫోర్లు, సిక్సర్లకంటే వికెట్ల మధ్య పరుగెత్తడాన్నే కోహ్లి ఎక్కువగా ప్రేమిస్తాడని అనిపిస్తుంది ఈ ఇన్నింగ్స్ చూస్తే. విధ్వంసకర బ్యాటింగ్ ప్రదర్శన చూపించకుండానే కేవలం సింగిల్స్ ద్వారా వంద పరుగులు చేయడం అనితర సాధ్యం. మధ్యలో ఒక దశలో 45 బంతుల పాటు కోహ్లి ఒక్క ఫోర్ కూడా కొట్టలేదు. ఏం పర్లేదు...క్రీజ్‌లో ఉంటే చాలు తర్వాత చూసుకోవచ్చులే అనే ధీమా అతనిది. సరిగ్గా అదే జరిగింది కూడా. తనదైన శైలిలో లెక్క సరి చేస్తూ ఇన్నింగ్స్ ముగిసేసరికి అతను 100కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో ఇన్నింగ్స్ ముగించడం విశేషం. సెంచరీ పూర్తి చేసుకునే సమయానికి 7 ఫోర్లు మాత్రమే కొట్టిన కోహ్లి...ఆ తర్వాత మరో 5 ఫోర్లు కొట్టాడు. శతకం తర్వాత మాత్రమే రెండు సార్లు బంతి గాల్లోకి లేచింది. ముఖ్యంగా రబడ వేసిన చివరి ఓవర్లో శరీరం మొత్తాన్ని గుండ్రంగా తిప్పేస్తూ మిడ్ వికెట్ మీదుగా కొట్టిన భారీ సిక్సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చివరి బంతికి మిడాఫ్ మీదుగా కొట్టిన బుల్లెట్‌లాంటి ఫోర్‌తో విరాట్ తన క్లాసిక్ ఇన్నింగ్స్‌కు ఇచ్చిన ముగింపును అంతా సులువుగా మరిచిపోలేం. ఇప్పటికే లెక్కలేనన్ని రికార్డులతో గణాంక నిపుణులను తనతో పాటు పరుగెత్తిస్తున్న కోహ్లి బుధవారం కూడా వారికి మరోసారి భారీ హోంవర్క్ ఇచ్చేశాడు. ఈ జోరు ఇలాగే సాగితే అసలు కోహ్లి పరుగుల వరద ఎక్కడ ఆగుతుందో ఊహకు కూడా అందడం లేదు!
►100 సింగిల్స్ ద్వారానే వంద పరుగులు చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్ కోహ్లి. ఈ మ్యాచ్‌లో 75 సింగిల్స్ తీసిన అతను 11 సార్లు 2 పరుగులు, ఒకసారి 3 పరుగుల చొప్పున సాధించాడు.
►1 కెరీర్‌లో 34వ సెంచరీ చేసిన క్రమంలో దక్షిణాఫ్రికాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాట్స్‌మన్ గా కోహ్లి రికార్డులకెక్కాడు. సచిన్ (152) స్కోరును అతను దాటేశాడు.
Comments
Please login to add a commentAdd a comment