
మాంచెస్టర్: తన కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన అంతర్జాతీయ సెంచరీలతో పోలిస్తే మంగళవారం ఇంగ్లండ్‌పై చేసిన 101 పరుగులు వెల కట్టలేనివని భారత బ్యాట్స్‌మన్ లోకేశ్ రాహుల్ వ్యాఖ్యానించాడు. ఈ ఇన్నింగ్స్‌కు తన దృష్టిలో ఎంతో ప్రాధాన్యత ఉందని అతను అన్నాడు. ‘ఈ శతకం చాలా సంతృప్తినిచ్చింది. గతంలోనూ నేను అంతర్జాతీయ సెంచరీలు సాధించినా వాటన్నింటికంటే ఇదే గొప్పగా అనిపిస్తోంది. నేను దాదాపు రెండేళ్ల తర్వాత సెంచరీ చేయడమే అందుకు కారణం. ఐపీఎల్‌లో, టెస్టుల్లో అర్ధ సెంచరీలతో పాటు అడపాదడపా పరుగులు సాధించినా... గాయాలు, జట్టులోకి వచ్చిపోవడంతో ఏడాదిన్నర కాలం కష్టంగా సాగింది. గతంలో ఫలానా లక్ష్యాన్ని అందుకోవాలని ఇంత కసిగా, పట్టుదలగా ఎప్పుడూ కోరుకోలేదు. కాబట్టి ఈ సెంచరీ నా దృష్టిలో ఎంతో ప్రత్యేకం’ అని రాహుల్ ఉద్వేగంగా చెప్పాడు.
మంగళవారం రాత్రి ఇక్కడి ఓల్డ్‌ట్రాఫర్డ్ మైదానంలో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 160 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెరీర్‌లో రెండో సెంచరీతో లోకేశ్ రాహుల్ (54 బంతుల్లో 101 నాటౌట్; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) ముందుండి గెలిపించగా, రోహిత్ శర్మ (30 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 123 పరుగులు జోడించారు. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ (4) ఔటైన తర్వాత జట్టు ఇన్నింగ్స్‌ను రాహుల్ నడిపించాడు. ప్లంకెట్ వేసిన 11వ ఓవర్లో రాహుల్ 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 20 పరుగులు సాధించడం ఈ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. రోహిత్ ఔటయ్యాక కోహ్లి (20 నాటౌట్) అండగా నిలవడంతో రాహుల్ 53 బంతుల్లో సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ టి20ల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లి...అలీ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. కుల్దీప్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. రెండో టి20 శుక్రవారం కార్డిఫ్‌లో జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment