
పాఠాలు నేరుస్తారా?
ఆస్ట్రేలియాలో కూడా అలవోకగా పరుగులు సాధించేశారు. అదేంటో కానీ ఇక్కడి పిచ్ చూస్తే స్వయంగా ధోనికి మాత్రం అది ఇంగ్లండ్ వికెట్ తరహాలో కనిపించింది. ఆసీస్ మైదానాల్లో సొంతగడ్డపై ఆడినంత సులభంగా ఆడి... భారీ షాట్లతో కనువిందు చేసినవారు మన దగ్గరికి వచ్చే సరికి అనూహ్యంగా బ్యాట్‌లు పడేశారు. పరాజయంకంటే పరిస్థితులను అంచనా వేయడంలో, దానికి తగినట్లుగా ఆడటంలో మన బ్యాట్స్‌మెన్ వైఫల్యం మాత్రం స్పష్టంగా కనిపించింది.
అంతగా ఏముంది పుణే పిచ్‌లో... ఆరంభంలో కాస్త తేమ, కొద్దిపాటి బౌన్స్ మాత్రమే. మరి ఈ మాత్రం దానికే బెదిరిపోతే వరల్డ్ చాంపియన్ అయ్యేదెలా? ప్రపంచకప్‌లో సరిగ్గా ఇదే తరహా పిచ్‌లు ఉండకపోవచ్చు లేదా మన కోసం పూర్తిగా బ్యాటింగ్ పిచ్‌లు తయారు కావచ్చు. కానీ మన గల్లీలే కదా, మమ్మల్ని ఆపేదెవరు అన్నట్లుగా కాకుండా... ఇక ముందు జాగ్రత్త పడాలి. శ్రీలంకతో తొలి టి20 ఓటమితో జట్టు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
భారత్ మేలుకోవాల్సిన సమయం సొంతగడ్డలో పిచ్‌పై తప్పిన అంచనా వరల్డ్‌కప్‌లో ఇలాగే ఉంటే కష్టం
సాక్షి క్రీడా విభాగం తొలి టి20 మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాతి ఓవరే మెయిడిన్ కాగా... మూడో ఓవర్లో ఫీల్డర్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో రైనా అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. ఈ సమయంలోనైనా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని మన బ్యాట్స్‌మెన్ సంయమనం పాటించలేదు. టి20ల్లో దూకుడే ప్రధానం కావచ్చు. కానీ పరిస్థితిని బట్టి బ్యాటింగ్‌ను మార్చుకోవడం కూడా కీలకం. పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తోందని అప్పటికే భారత్‌కు అర్థమైపోయి ఉండాలి. కానీ ఒకరి వెంట మరొకరు గుడ్డిగా షాట్లు ఆడబోయి మొత్తం 20 ఓవర్లు ఆడకుండానే చాప చుట్టేశారు. తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్, తొలి సారి బౌలింగ్ చేస్తున్న బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు చెరో మూడు వికెట్లు అప్పగించడంలో మనోళ్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది.
తప్పు పిచ్‌దేనా?
ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం మత్తునుంచి భారత్ ఇంకా బయటికి వచ్చినట్లు లేదు. ఇక్కడి పిచ్‌లకు అనుగుణంగా తమ ఆటను వాళ్లు మార్చుకోలేదు. ఎప్పుడూ సహజంగా పరుగుల వరద పారే భారత్ మైదానాల్లాగే దీనినీ భావించి బోర్లా పడ్డారు. వాస్తవానికి ఇది మరీ 170-180 పరుగుల పిచ్ కాకపోయినా అంత భీకరంగా ఏమీ లేదు. కనీసం 140 పరుగులు చేసినా మన బౌలర్లు మ్యాచ్‌ను గెలిపించగలిగేవారు. మ్యాచ్‌లో నెహ్రా తీసిన 2 వికెట్లు, అశ్విన్‌ను ఆడలేక లంక తడబాటు చూస్తే ఇదేమీ అసాధ్యం కాకపోయేది. దీనిని ధోని కూడా అంగీకరించాడు. ‘ఒక మంచి భాగస్వామ్యం ఉంటే ఫలితం వేరుగా ఉండేది. ఐదు ఓవర్లు అవసరం లేదు. కొన్ని బంతుల పాటు నిలబడ్డా చాలు. మావాళ్లు భారత్ పిచ్‌లు అన్నీ ఒకేలాగా ఉంటాయని భావించినట్లున్నారు. ఇవన్నీ మున్ముందు పరిగణనలోకి తీసుకుంటాం’ అని కెప్టెన్ జట్టు ఓటమిని విశ్లేషించాడు.
వ్యూహాలు మార్చాలి
భారత్‌లో వరల్డ్ కప్ పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. సొంతజట్టుకే అంతా అనుకూలం అంటూ టీమిండియాను ప్రత్యర్థులు ముందే చాంపియన్‌ను చేస్తున్నాయి. కానీ పరిస్థితి అంత అనుకూలంగా కూడా ఏమీ లేదు. భారత గడ్డపై ధోని సేనకు ఇది వరుసగా మూడో టి20 ఓటమి. దక్షిణాఫ్రికాలో మొదటి మ్యాచ్‌లో 199 చేసినా ఓడిపోగా, తర్వాతి మ్యాచ్‌లో 92కే జట్టు కుప్పకూలింది. సఫారీవంటి పటిష్ట ప్రత్యర్థితో పోలిస్తే బలహీనమైన లంక చేతిలో పరాజయం షాక్‌వంటిదే. వరల్డ్ కప్ వేదికలు బ్యాటింగ్ కోసమే అన్నట్లుగా సిద్ధం చేయాలని ఒకవేళ నిర్ణయించినా... కేవలం పిచ్‌ల కారణంగా ఫలితం మనకే అనుకూలంగా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. పైగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట పుణేలాంటి పిచ్ కూడా ఎదురు కావచ్చు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఇటీవలి టీమిండియా విజయాల్లో టాప్-3 రోహిత్, ధావన్, కోహ్లిలే దాదాపుగా మ్యాచ్‌లు ముగించారు.
దాంతో తర్వాతి వారికి బ్యాటింగ్ అవకాశమూ రాలేదు. తొలి టి20లో మన బ్యాటింగ్ లోతు తెలిసింది. అందరికీ బ్యాటింగ్ అవకాశం రావడం మంచిదే అంటూ ధోని వెనకేసుకొచ్చినా... అవసరమైన సమయంలో వారిలో ఎవరి సత్తా ఏమిటో కూడా బయటపడాలి. దాదాపు ఏడేళ్ల అనుభవం తర్వాత కూడా జడేజా కనీస బ్యాటింగ్ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. తన విలువేంటో చూపించాల్సిన మ్యాచ్‌లో రహానే విఫలం కావడం నిరాశ కలిగించింది. టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు పుణే మ్యాచ్ ఒక హెచ్చరికలాంటిది. ఆటగాళ్లందరినీ పరీక్షించడంతో పాటు వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో కూడా ఈ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ధోని సేన ప్రపంచ చాంపియన్ కాగలుగుతుంది.