Pune pitch
-
ఆ ఇద్దరూ ఆడుతుంటే చూడటం గొప్పగా ఉంది
-
ఆ ఇద్దరూ ఆడుతుంటే చూడటం గొప్పగా ఉంది: కోహ్లి
పుణె: న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో భారత్‌కు విజయాన్ని చేకూర్చిన బౌలర్లు, ఫీల్డర్లపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించారు. 'ఇది మాకు చాలా మంచి గేమ్. టాస్ వేసినప్పుడు ఏదైతే చెప్పామో అదే చేశాం. బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫీల్లర్లు సైతం బాగా ఆడారు' అని మ్యాచ్ అనంతరం కోహ్లి తెలిపారు. కీలకమైన రెండో వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొంది.. మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో టీమిండియా సమం చేసిన సంగతి తెలిసిందే. మొదటి వన్డేలో ఓటమి నేపథ్యంలో కీలకమైన రెండో వన్డేలో టీమిండియా అంచనాల మేరకు రాణించి ఆకట్టుకుంది. 'ఆ ఇద్దరూ (భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా) చక్కగా ఆడుతుంటే చూడటం గొప్పగా ఉంది. తాము శుభారంభం ఇవ్వగలమని వారికి తెలుసు' అని కోహ్లి అన్నాడు. వికెట్ స్లోగా ఉన్నా.. సంప్రదాయపద్ధతిలో బౌలింగ్ చేస్తూ.. వికెట్లు పడగొట్టడం ఎంతో హృద్యంగా ఉందని చెప్పాడు. ఓపెనర్ శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ బాగా రాణించి.. మ్యాచ్ విజయంలో కీలకంగా నిలిచారని కొనియాడాడు. కివీస్ నిర్దేశించిన 231 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 4 ఓవర్లు మిగిలుండగానే టీమిండియా చేరుకుంది. మొదట టాస్ నెగ్గి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లాడి 9 వికెట్లు నష్టపోయి 230 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(7) సిరీస్ లో మరోసారి విఫలమైనా.. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (84 బంతుల్లో 68: 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ప్రమోషన్ పొందిన దినేశ్ కార్తీక్ (64 నాటౌట్) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. కెప్టెన్ కోహ్లీ(29 బంతుల్లో 29: 3 ఫోర్లు, 1 సిక్స్) ఔటయ్యాక క్రీజులోకొచ్చిన హార్ధిక్ పాండ్యా (30) పరవాలేదనిపించాడు. ధోని (18)తో కలిసి దినేశ్ కార్తీక్ భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు. కివీస్ బౌలర్లలో సౌధీ, మిల్నే, శాంట్నర్, డి గ్రాండ్ హోమ్మీ తలో వికెట్ తీశారు. -
బీసీసీఐ దిగ్భ్రాంతి.. పిచ్ క్యూరేటర్పై వేటు..!
పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. అడ్డంగా దొరికిపోయిన ఎంసీఏ క్యూరేటర్ వ్యవహారంపై బీసీసీఐ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తాజాగా వెలుగుచూసిన పుణె పిచ్ కుంభకోణం నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకున్నాయి. రెండో వన్డే కొనసాగుతుందా? లేక రద్దవుతుందా? అన్నది ఉత్కంఠ రేపగా.. మ్యాచ్ యథాతథంగా కొనసాగుతుందని బీసీసీఐ వర్గాలు స్పష్టతనిచ్చాయి. పిచ్‌ను బుకీల రూపంలో వచ్చిన రిపోర్టర్లకు చూపించి.. పిచ్ వివరాలు వెల్లడించిన క్యూరేటర్ పాండురంగ్ సల్గావుంకర్ మైదానంలోకి అడుగుపెట్టకుండా బీసీసీఐ బహిష్కరించింది. పిచ్ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యూరేటర్‌ను బీసీసీఐ సస్పెండ్ చేసింది. 'ఇలాంటి విషయాలను బీసీసీఐ ఎంతమాత్రం ఉపేక్షించదు. అసలు పూర్తిగా ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఈ విషయాన్ని వెంటనే తెలుసుకొని సత్వరమే చర్యలు తీసుకుంటాను. బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదు' అని బీసీసీఐ జాయింట్ సెక్రటరీ అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు నియమించిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ (సీఏవో) కూడా స్టింగ్ ఆపరేషన్ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంలో బాధ్యులను వదలబోమని సీఏవో చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. స్టింగ్ ఆపరేషన్ నేపథ్యంలో పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. దేశంలో పాపులర్ అయిన క్రికెట్ క్రీడలో అవినీతిని ఎంతమాత్రం ఉపేక్షించబోనంటూ బీసీసీఐ కఠినమైన నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల సుప్రీంకోర్టు సైతం బీసీఐఐలో ప్రక్షాళన కోసం కీలక చర్యలు తీసుకుంది. మాజీ కాగ్ వినోద్ రాయ్ నేపథ్యంలో అడ్మినిస్ట్రేటర్స్ కమిటీని ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలో పిచ్‌లో మార్పులకు సిద్ధమంటూ బుకీలకు చెప్పడమే కాకుండా.. బుకీలను మైదానంలోకి స్వయంగా పిచ్‌ను చూపించిన ఎంసీఏ క్యూరేటర్ పాండురంగ్ సల్గావుంకర్ వ్యవహారం బీసీసీఐలో కలకలం రేపుతోంది. ఈ స్టింగ్ ఆపరేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, పిచ్ కుంభకోణంపై వ్యవహారంపై మాజీ క్రికెటర్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇలాంటి క్యూరేటర్లపై జీవితకాల నిషేధం విధించాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్ డిమాండ్ చేశారు. -
షాకింగ్: పుణె మ్యాచ్‌కు ముందు భారీ స్కాం!
-
షాకింగ్: పుణె మ్యాచ్‌కు ముందు భారీ స్కాం!
పుణె: భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న కీలక రెండో వన్డే మ్యాచ్ నేపథ్యంలో భారీ స్కాం వెలుగుచూసింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు చెందిన క్యూరేటర్ ఏకంగా పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. 'ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయాడు. రెండో మ్యాచ్ నేపథ్యంలో బుకీల డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌ను మార్చేందుకు సిద్ధమంటూ అతను కెమెరా ముందు ఆఫర్ ఇచ్చాడు. 'ఇండియా టుడే' రిపోర్టర్లు బుకీలుగా పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సల్గావుంకర్‌ను కలిశారు. బుకీలుగా పరిచయం చేసుకున్న రిపోర్టర్ల డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌ను మార్చేందుకు సిద్ధమంటూ సల్గావుంకర్ ఆఫర్ ఇచ్చాడు. ఇద్దరు ఆటగాళ్లు బౌన్సీ పిచ్ కావాలని కోరుకుంటున్నారని రిపోర్టర్లు కోరగా.. సరే పిచ్‌ను అలాగే మారుస్తానంటూ క్యూరేటర్ చెప్పాడు. 337 నుంచి 340 పరుగులు అవలీలగా చేసేవిధంగా పిచ్‌ను తయారుచేస్తున్నట్టు అతను తెలిపాడు. 337 పరుగులను కూడా ఈ పిచ్ మీద ఛేదించవచ్చునని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రిపోర్టర్లు స్వయంగా పిచ్‌ను పరిశీలించేందుకు సల్గావుంకర్ అనుమతించడం గమనార్హం. ఇది బీసీసీఐ, ఐసీసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. కాగా, పిచ్ స్కాం ఆరోపణలను క్యూరేటర్ పాండురంగ్ సల్గావుంకర్ నిరాకరించారు. మీడియాలో ప్రసారమైన ఈ స్టింగ్ ఆపరేషన్‌పై ఎంసీఏ అధ్యక్షుడు అభయ్ ఆప్తే స్పందిస్తూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 2013లో వెలుగుచూసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాండల్ బీసీసీఐని కుదిపేసిన సంగతి తెలిసిందే. బుకీల డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌ను మారుస్తానంటూ క్యూరేటర్ పేర్కొనడం కలకలం రేపుతోంది. పుణె పిచ్‌పై గతంలోనూ వివాదాలు లేకపోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ పిచ్ దారుణంగా ఉందంటూ ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను ఆసీస్ 333 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో 19 టెస్టు మ్యాచ్‌ల భారత విజయ పరంపరకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో కివిస్‌తో కీలకమైన రెండో వన్డేకు కోహ్లిసేన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ స్కాం వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిన కోహ్లిసేన.. ఈ వన్డేలో కూడా పరాభవం పొందితే.. స్వదేశంలో వన్డే సిరీస్‌ను కోల్పోయే ప్రమాదముంది. -
పుణే పిచ్ నాసిరకం
నివేదిక ఇచ్చిన మ్యాచ్ రిఫరీ బీసీసీఐ వివరణ కోరిన ఐసీసీ పుణే: ఊహించినట్లుగా పుణే పిచ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరిగిన ఈ పిచ్‌ను నాసిరకమైనదిగా ఐసీసీ రేటింగ్ ఇచ్చింది. టెస్టు ముగిసిన అనంతరం మ్యాచ్ రిఫరీ క్రిస్ బ్రాడ్ తన నివేదికను ఐసీసీకి అందజేశారు. ‘ఐసీసీ పిచ్, అవుట్ ఫీల్డ్ నిర్వహణకు సంబంధించిన క్లాజ్–3 ప్రకారం బ్రాడ్ ఐసీసీకి నివేదిక ఇచ్చారు. ఇందులో పుణే పిచ్ నాణ్యతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు’ అని ఐసీసీ ప్రకటించింది. ఈ నివేదికను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పంపించామని, దీనిపై స్పందించేందుకు 14 రోజుల గడువు ఇచ్చినట్లు కూడా ఐసీసీ వెల్లడించింది. బీసీసీఐ ఇచ్చే వివరణను ఐసీసీ జనరల్ మేనేజర్ (క్రికెట్) జెఫ్ అలార్డిస్, రంజన్ మదుగలే సమీక్షిస్తారు. తుది సమీక్షలో పుణే పిచ్ కనీస ప్రమాణాలను పాటించలేదని తేలితే తొలి టెస్టు మ్యాచ్ కాబట్టి హెచ్చరికతో వదిలేయడం లేదా అత్యధికంగా 15 వేల డాలర్ల జరిమానా పడే అవకాశం ఉంది. ఈ నెల 23 నుంచి 25 వరకు మూడు రోజుల్లోపే ముగిసిన పుణే టెస్టులో భారత్ 333 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. తొలి రోజు నుంచే ఈ వికెట్‌పై బంతి అనూహ్యంగా స్పిన్ అయింది. ఇరు జట్లు కలిపి కోల్పోయిన మొత్తం 40 వికెట్లలలో 31 వికెట్లను స్పిన్నర్లే పడగొట్టారు. 2015 డిసెంబర్లో కూడా ఇదే తరహాలో నాగ్‌పూర్ పిచ్‌ను కూడా ఐసీసీ తప్పుపట్టింది. మూడు రోజులకే ముగిసిన ఆ మ్యాచ్‌లో కూడా భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తుగా ఓడింది. ఆరు రకాలుగా విభజన... అంతర్జాతీయ పిచ్‌లను నాసిరకం (పూర్)గా గుర్తించే ముందు ఐసీసీ కొన్ని ప్రమాణాలు పాటిస్తుంది. టెస్టు మ్యాచ్ పిచ్‌కు రేటింగ్ ఇవ్వడంలో ఆరు రకాల కేటగిరీలు ఉన్నాయి. వెరీ గుడ్, గుడ్, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్, పూర్, అన్‌ఫిట్ అనే కేటగిరీలు ఉన్నాయి. ఇందులో పిచ్ ప్రమాదకరంగా ఉంటే అన్‌ఫిట్‌గా తేలుస్తారు. ఇప్పుడు పుణే పిచ్‌ను ఐసీసీ పూర్ కేటగిరీలో చేర్చింది. ఇందు కోసం నాలుగు అంశాలు ప్రామాణికంగా ఉంటాయి. ► మ్యాచ్‌లో ఏ దశలోనైనా బంతి సీమ్ గమనం చాలా ఎక్కువగా ఉండటం. ► మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై బౌన్స్‌లో తేడాలు చాలా ఎక్కువగా ఉండటం. ► మ్యాచ్ ప్రారంభంలోనే పిచ్ స్పిన్ బౌలర్లకు చాలా ఎక్కువగా సహకరించడం. ► మ్యాచ్‌లో ఏ దశలోనైనా పిచ్‌పై అసలు ఏమాత్రం బంతి సీమ్, టర్న్ కాకపోవడం లేదా అసలు బౌన్స్ లేకపోవడం. ఈ రకంగా బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతూకాన్ని ఏ మాత్రం పాటించకపోవడం అంటే బౌలర్లను దెబ్బ తీయడమే. -
బీసీసీఐని హెచ్చరించినప్పటికీ..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయానికి కారణం ఏంటి? బ్యాటింగ్ వైఫల్యమా? నాణ్యత లేని పిచ్ తయారు చేయడమా? ఇవి రెండూ కారణమా? ఏమైనా ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. రెండు రోజుల్లో 24 వికెట్లు పడ్డాయి. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇద్దరూ కలసి మొత్తం 12 వికెట్లు తీయగా, ఆసీస్ స్పిన్నర్ ఓకెఫీ ఒక్కడే 12 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్ తో్ మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమి. మూడొందలకు పైగా పరుగుల తేడాతో పరాజయం. పైగా మూడు రోజుల్లో మ్యాచ్ ముగిసిపో్వడం. దాంతో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వికెట్‌ను రూపొందించిన క్యూరేటర్ పై ఎన్నో ప్రశ్నలు. ఇందుకు కారణం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కారణమంటున్నాడు పుణె పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సాల్గోన్. బీసీసీఐ పిచ్ కమిటీ పెద్దలు వ్యవహరించిన తీరు కారణంగానే పుణె మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసిందని తాజాగా స్పష్టం చేశాడు.. 'ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. పిచ్ తయారీకి సంబంధించి నాకు నిర్దేశించిన కొన్ని ఆదేశాలు ఆధారంగా బీసీసీఐని ముందుగానే హెచ్చరించా. ఎటువంటి పచ్చదనం లేకుండా పూర్తిగా పొడి పిచ్ ను రూపొందించడం మంచికాదనే చెప్పా. అసలు నీటితో పిచ్ ను తడపకుండా గడ్డిని తీసేయమన్నారు. ఇది ప్రమాదమని ముందుగానే బీసీసీఐ పిచ్ కమిటీ పెద్దలకు తెలిపా. వారు నా మాట వినలేదు. దాంతో పిచ్ పూర్తిగా పొడిగా మారిపోయి స్పిన్ కు అనుకూలించింది. ఆ బీసీసీఐ పెద్దల పేర్లను ఇక్కడ చెప్పాలనుకోవడం లేదు. వారి ఆదేశాల్ని నేను పక్కకు పెట్టలేను కదా. సాధ్యమైనంత వరకూ పిచ్ ను బాగా రూపొందించాలనే యత్నించా. అయినా పిచ్ లో నాణ్యత లేకుండా పోయింది. నా జాబ్ బీసీసీఐ ఆదేశాల్ని పాటించడమే కదా' అని పాండురంగ్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా పై విషయాల్ని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భాగంగా పుణె పిచ్ ను బీసీసీఐ పిచ్ కమిటీ హెడ్ దల్జిత్ సింగ్ ఆదేశాలతోనే ఇలా రూపొందించినట్లు తెలుస్తోంది. పుణె టెస్టును రూపొందించేటప్పుడు వెస్ట్ జోన్ చీఫ్ ధీరజ్ ప్రసన్న కలిసి దల్జిత్ సింగ్ అక్కడికి హాజరయ్యాడు. వారిద్దరి ఆదేశాలతోనే పిచ్ ను పూర్తిగా పొడిగా తయారీ చేసినట్లు సమాచారం. -
పాఠాలు నేరుస్తారా?
ఆస్ట్రేలియాలో కూడా అలవోకగా పరుగులు సాధించేశారు. అదేంటో కానీ ఇక్కడి పిచ్ చూస్తే స్వయంగా ధోనికి మాత్రం అది ఇంగ్లండ్ వికెట్ తరహాలో కనిపించింది. ఆసీస్ మైదానాల్లో సొంతగడ్డపై ఆడినంత సులభంగా ఆడి... భారీ షాట్లతో కనువిందు చేసినవారు మన దగ్గరికి వచ్చే సరికి అనూహ్యంగా బ్యాట్లు పడేశారు. పరాజయంకంటే పరిస్థితులను అంచనా వేయడంలో, దానికి తగినట్లుగా ఆడటంలో మన బ్యాట్స్‌మెన్ వైఫల్యం మాత్రం స్పష్టంగా కనిపించింది. అంతగా ఏముంది పుణే పిచ్‌లో... ఆరంభంలో కాస్త తేమ, కొద్దిపాటి బౌన్స్ మాత్రమే. మరి ఈ మాత్రం దానికే బెదిరిపోతే వరల్డ్ చాంపియన్ అయ్యేదెలా? ప్రపంచకప్‌లో సరిగ్గా ఇదే తరహా పిచ్‌లు ఉండకపోవచ్చు లేదా మన కోసం పూర్తిగా బ్యాటింగ్ పిచ్‌లు తయారు కావచ్చు. కానీ మన గల్లీలే కదా, మమ్మల్ని ఆపేదెవరు అన్నట్లుగా కాకుండా... ఇక ముందు జాగ్రత్త పడాలి. శ్రీలంకతో తొలి టి20 ఓటమితో జట్టు మేలుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్ మేలుకోవాల్సిన సమయం సొంతగడ్డలో పిచ్‌పై తప్పిన అంచనా వరల్డ్‌కప్‌లో ఇలాగే ఉంటే కష్టం సాక్షి క్రీడా విభాగం తొలి టి20 మ్యాచ్‌లో మొదటి ఓవర్లోనే భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాతి ఓవరే మెయిడిన్ కాగా... మూడో ఓవర్లో ఫీల్డర్ సునాయాస క్యాచ్ వదిలేయడంతో రైనా అవుట్ కాకుండా తప్పించుకున్నాడు. ఈ సమయంలోనైనా పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని మన బ్యాట్స్‌మెన్ సంయమనం పాటించలేదు. టి20ల్లో దూకుడే ప్రధానం కావచ్చు. కానీ పరిస్థితిని బట్టి బ్యాటింగ్‌ను మార్చుకోవడం కూడా కీలకం. పిచ్ పేస్ బౌలింగ్‌కు అనుకూలిస్తోందని అప్పటికే భారత్‌కు అర్థమైపోయి ఉండాలి. కానీ ఒకరి వెంట మరొకరు గుడ్డిగా షాట్లు ఆడబోయి మొత్తం 20 ఓవర్లు ఆడకుండానే చాప చుట్టేశారు. తొలి మ్యాచ్ ఆడుతున్న బౌలర్, తొలి సారి బౌలింగ్ చేస్తున్న బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌కు చెరో మూడు వికెట్లు అప్పగించడంలో మనోళ్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. తప్పు పిచ్‌దేనా? ఆస్ట్రేలియాలో సిరీస్ విజయం మత్తునుంచి భారత్ ఇంకా బయటికి వచ్చినట్లు లేదు. ఇక్కడి పిచ్‌లకు అనుగుణంగా తమ ఆటను వాళ్లు మార్చుకోలేదు. ఎప్పుడూ సహజంగా పరుగుల వరద పారే భారత్ మైదానాల్లాగే దీనినీ భావించి బోర్లా పడ్డారు. వాస్తవానికి ఇది మరీ 170-180 పరుగుల పిచ్ కాకపోయినా అంత భీకరంగా ఏమీ లేదు. కనీసం 140 పరుగులు చేసినా మన బౌలర్లు మ్యాచ్‌ను గెలిపించగలిగేవారు. మ్యాచ్‌లో నెహ్రా తీసిన 2 వికెట్లు, అశ్విన్‌ను ఆడలేక లంక తడబాటు చూస్తే ఇదేమీ అసాధ్యం కాకపోయేది. దీనిని ధోని కూడా అంగీకరించాడు. ‘ఒక మంచి భాగస్వామ్యం ఉంటే ఫలితం వేరుగా ఉండేది. ఐదు ఓవర్లు అవసరం లేదు. కొన్ని బంతుల పాటు నిలబడ్డా చాలు. మావాళ్లు భారత్ పిచ్‌లు అన్నీ ఒకేలాగా ఉంటాయని భావించినట్లున్నారు. ఇవన్నీ మున్ముందు పరిగణనలోకి తీసుకుంటాం’ అని కెప్టెన్ జట్టు ఓటమిని విశ్లేషించాడు. వ్యూహాలు మార్చాలి భారత్‌లో వరల్డ్ కప్ పిచ్‌లు పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తాయి. సొంతజట్టుకే అంతా అనుకూలం అంటూ టీమిండియాను ప్రత్యర్థులు ముందే చాంపియన్‌ను చేస్తున్నాయి. కానీ పరిస్థితి అంత అనుకూలంగా కూడా ఏమీ లేదు. భారత గడ్డపై ధోని సేనకు ఇది వరుసగా మూడో టి20 ఓటమి. దక్షిణాఫ్రికాలో మొదటి మ్యాచ్‌లో 199 చేసినా ఓడిపోగా, తర్వాతి మ్యాచ్‌లో 92కే జట్టు కుప్పకూలింది. సఫారీవంటి పటిష్ట ప్రత్యర్థితో పోలిస్తే బలహీనమైన లంక చేతిలో పరాజయం షాక్వంటిదే. వరల్డ్ కప్ వేదికలు బ్యాటింగ్ కోసమే అన్నట్లుగా సిద్ధం చేయాలని ఒకవేళ నిర్ణయించినా... కేవలం పిచ్‌ల కారణంగా ఫలితం మనకే అనుకూలంగా ఉంటుందని గ్యారంటీ ఏమీ లేదు. పైగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో ఒక చోట పుణేలాంటి పిచ్ కూడా ఎదురు కావచ్చు. కాబట్టి అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఇటీవలి టీమిండియా విజయాల్లో టాప్-3 రోహిత్, ధావన్, కోహ్లిలే దాదాపుగా మ్యాచ్‌లు ముగించారు. దాంతో తర్వాతి వారికి బ్యాటింగ్ అవకాశమూ రాలేదు. తొలి టి20లో మన బ్యాటింగ్ లోతు తెలిసింది. అందరికీ బ్యాటింగ్ అవకాశం రావడం మంచిదే అంటూ ధోని వెనకేసుకొచ్చినా... అవసరమైన సమయంలో వారిలో ఎవరి సత్తా ఏమిటో కూడా బయటపడాలి. దాదాపు ఏడేళ్ల అనుభవం తర్వాత కూడా జడేజా కనీస బ్యాటింగ్ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. తన విలువేంటో చూపించాల్సిన మ్యాచ్‌లో రహానే విఫలం కావడం నిరాశ కలిగించింది. టి20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు పుణే మ్యాచ్ ఒక హెచ్చరికలాంటిది. ఆటగాళ్లందరినీ పరీక్షించడంతో పాటు వ్యూహాలను సిద్ధం చేసుకోవడంలో కూడా ఈ పరాజయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ధోని సేన ప్రపంచ చాంపియన్ కాగలుగుతుంది.