
పుణె: భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న కీలక రెండో వన్డే మ్యాచ్ నేపథ్యంలో భారీ స్కాం వెలుగుచూసింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు చెందిన క్యూరేటర్ ఏకంగా పిచ్‌ను బుకీలకు అమ్మేస్తూ.. 'ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా దొరికిపోయాడు. రెండో మ్యాచ్ నేపథ్యంలో బుకీల డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌ను మార్చేందుకు సిద్ధమంటూ అతను కెమెరా ముందు ఆఫర్ ఇచ్చాడు.
'ఇండియా టుడే' రిపోర్టర్లు బుకీలుగా పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సల్గావుంకర్‌ను కలిశారు. బుకీలుగా పరిచయం చేసుకున్న రిపోర్టర్ల డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌ను మార్చేందుకు సిద్ధమంటూ సల్గావుంకర్ ఆఫర్ ఇచ్చాడు. ఇద్దరు ఆటగాళ్లు బౌన్సీ పిచ్ కావాలని కోరుకుంటున్నారని రిపోర్టర్లు కోరగా.. సరే పిచ్‌ను అలాగే మారుస్తానంటూ క్యూరేటర్ చెప్పాడు. 337 నుంచి 340 పరుగులు అవలీలగా చేసేవిధంగా పిచ్‌ను తయారుచేస్తున్నట్టు అతను తెలిపాడు. 337 పరుగులను కూడా ఈ పిచ్ మీద ఛేదించవచ్చునని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా రిపోర్టర్లు స్వయంగా పిచ్‌ను పరిశీలించేందుకు సల్గావుంకర్ అనుమతించడం గమనార్హం. ఇది బీసీసీఐ, ఐసీసీ నిబంధనలకు పూర్తి విరుద్ధం. కాగా, పిచ్ స్కాం ఆరోపణలను క్యూరేటర్ పాండురంగ్ సల్గావుంకర్ నిరాకరించారు.
మీడియాలో ప్రసారమైన ఈ స్టింగ్ ఆపరేషన్‌పై ఎంసీఏ అధ్యక్షుడు అభయ్ ఆప్తే స్పందిస్తూ ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నామని, విచారణలో ఎవరైనా దోషులుగా తేలితే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 2013లో వెలుగుచూసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాండల్ బీసీసీఐని కుదిపేసిన సంగతి తెలిసిందే. బుకీల డిమాండ్లకు అనుగుణంగా పిచ్‌ను మారుస్తానంటూ క్యూరేటర్ పేర్కొనడం కలకలం రేపుతోంది. పుణె పిచ్‌పై గతంలోనూ వివాదాలు లేకపోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన భారత్-ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్ సందర్భంగా ఈ పిచ్ దారుణంగా ఉందంటూ ఐసీసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్‌ను ఆసీస్ 333 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో 19 టెస్టు మ్యాచ్‌ల భారత విజయ పరంపరకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో కివిస్‌తో కీలకమైన రెండో వన్డేకు కోహ్లిసేన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ స్కాం వెలుగుచూడటం కలకలం రేపుతోంది. ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిన కోహ్లిసేన.. ఈ వన్డేలో కూడా పరాభవం పొందితే.. స్వదేశంలో వన్డే సిరీస్‌ను కోల్పోయే ప్రమాదముంది.
Comments
Please login to add a commentAdd a comment