సర్ఫరాజ్ , కేఎల్ రాహుల్ (PC: BCCI)
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను పరాజయంతో ప్రారంభించిన టీమిండియా.. రెండో టెస్టులో విజయానికి గురిపెట్టింది. పుణెలో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మీడియాతో మాట్లాడాడు.
ఈ సందర్భంగా శుబ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. గిల్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్‌లలో ఎవరిని తప్పిస్తారని విలేకరులు అడుగగా.. ‘‘శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. బెంగళూరులో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇక తుదిజట్టులో ఎవరు ఉండాలన్న అంశంపై పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటాం.
జట్టులో ఒకరికి చోటు నిరాకరించడం అనేది ఉండదు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ కాస్త నిరాపరిచిన మాట వాస్తవమే. అయితే, తను ఎన్ని బంతులు మిస్ చేశాడని అడిగినపుడు అందుకు బదులుగా ఒక్కటి కూడా మిస్ చేయలేదనే సమాధానమే వచ్చింది.
ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది. బాగా ఆడినా పరుగులు రాబట్టలేకపోవచ్చు. కాబట్టి కేఎల్ రాహుల్ గురించి ఆందోళన అక్కర్లేదు. తను మానసికంగానూ ఏమాత్రం అలసటకు గురికాలేదు. అయితే, అందుబాటులో ఉన్న ఆరు స్థానాల్లో ఏడుగురిని ఇరికించడం కుదరదు. కాబట్టి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌నే ఎంచుకుంటాం.
ఇప్పటికైతే కేఎల్ రాహుల్ ఫామ గురించి మాకెలాంటి బెంగా లేదు. అతడి ఆట తీరుపై పూర్తి నమ్మకం ఉంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా గౌతీ(హెడ్‌కోచ్ గౌతం గంభీర్) తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్.. అతడు బెంగళూరులో 150 పరుగులు చేశాడు. ఇరానీ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. కాబట్టి మిడిలార్డర్‌లో చోటు కోసం ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది’’ అని టెన్ డష్కాటే తెలిపాడు.
ఇక రిషభ్ పంత్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పుణెలో జరుగనున్న రెండో టెస్టులో అతడే వికెట్ కీపింగ్ చేస్తాడని ఈ సందర్భంగా డష్కాటే సంకేతాలు ఇచ్చాడు. కాగా మెడనొప్పి కారణంగా శుబ్‌మన్ గిల్ బెంగళూరలో జరిగిన తొలి టెస్టుకు దూరం కాగా.. వన్‌డౌన్‌లో అతడి స్థానంలో విరాట్ కోహ్లి వచ్చాడు. కోహ్లి ఆడే నాలుగో స్థానంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ 0, 12 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment