బీసీసీఐని హెచ్చరించినప్పటికీ..
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఘోర పరాజయానికి కారణం ఏంటి? బ్యాటింగ్ వైఫల్యమా? నాణ్యత లేని పిచ్ తయారు చేయడమా? ఇవి రెండూ కారణమా? ఏమైనా ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. రెండు రోజుల్లో 24 వికెట్లు పడ్డాయి. పిచ్ పూర్తిగా బౌలింగ్‌కు అనుకూలించింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా ఇద్దరూ కలసి మొత్తం 12 వికెట్లు తీయగా, ఆసీస్ స్పిన్నర్ ఓకెఫీ ఒక్కడే 12 వికెట్లు తీశాడు. ఫలితంగా ఆసీస్ తో్ మ్యాచ్ లో భారత్ ఘోర ఓటమి. మూడొందలకు పైగా పరుగుల తేడాతో పరాజయం. పైగా మూడు రోజుల్లో మ్యాచ్ ముగిసిపో్వడం. దాంతో పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం పిచ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వికెట్‌ను రూపొందించిన క్యూరేటర్ పై ఎన్నో ప్రశ్నలు. ఇందుకు కారణం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కారణమంటున్నాడు పుణె పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సాల్గోన్.
బీసీసీఐ పిచ్ కమిటీ పెద్దలు వ్యవహరించిన తీరు కారణంగానే పుణె మ్యాచ్ మూడు రోజుల్లో ముగిసిందని తాజాగా స్పష్టం చేశాడు.. 'ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. పిచ్ తయారీకి సంబంధించి నాకు నిర్దేశించిన కొన్ని ఆదేశాలు ఆధారంగా బీసీసీఐని ముందుగానే హెచ్చరించా. ఎటువంటి పచ్చదనం లేకుండా పూర్తిగా పొడి పిచ్ ను రూపొందించడం మంచికాదనే చెప్పా. అసలు నీటితో పిచ్ ను తడపకుండా గడ్డిని తీసేయమన్నారు. ఇది ప్రమాదమని ముందుగానే బీసీసీఐ పిచ్ కమిటీ పెద్దలకు తెలిపా. వారు నా మాట వినలేదు. దాంతో పిచ్ పూర్తిగా పొడిగా మారిపోయి స్పిన్ కు అనుకూలించింది. ఆ బీసీసీఐ పెద్దల పేర్లను ఇక్కడ చెప్పాలనుకోవడం లేదు. వారి ఆదేశాల్ని నేను పక్కకు పెట్టలేను కదా. సాధ్యమైనంత వరకూ పిచ్ ను బాగా రూపొందించాలనే యత్నించా. అయినా పిచ్ లో నాణ్యత లేకుండా పోయింది. నా జాబ్ బీసీసీఐ ఆదేశాల్ని పాటించడమే కదా' అని పాండురంగ్ తనపై వస్తున్న విమర్శలకు సమాధానంగా పై విషయాల్ని పేర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భాగంగా పుణె పిచ్ ను బీసీసీఐ పిచ్ కమిటీ హెడ్ దల్జిత్ సింగ్ ఆదేశాలతోనే ఇలా రూపొందించినట్లు తెలుస్తోంది. పుణె టెస్టును రూపొందించేటప్పుడు వెస్ట్ జోన్ చీఫ్ ధీరజ్ ప్రసన్న కలిసి దల్జిత్ సింగ్ అక్కడికి హాజరయ్యాడు. వారిద్దరి ఆదేశాలతోనే పిచ్ ను పూర్తిగా పొడిగా తయారీ చేసినట్లు సమాచారం.