రాహుల్... జిగేల్
లాగోస్ ఓపెన్‌లో సింగిల్స్ టైటిల్ సొంతం
హైదరాబాద్: గత వారం రష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్‌లో కాంస్య పతకంతో సరిపెట్టుకున్న హైదరాబాద్ బ్యాడ్మింటన్ ప్లేయర్ చిట్టబోయిన రాహుల్ యాదవ్... ఈసారి లాగోస్ ఓపెన్ అంతర్జాతీయ చాలెంజ్ టోర్నీలో విజేతగా అవతరించాడు. నైజీరియాలో జరిగిన ఈ టోర్నీలో 19 ఏళ్ల రాహుల్ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. భారత్‌కే చెందిన కరణ్ రాజన్‌తో జరిగిన ఫైనల్లో రాహుల్ 21–15, 21–13తో విజయం సాధించాడు. నాలుగో సీడ్‌గా ఈ టోర్నీలో బరిలోకి దిగిన రాహుల్ సెమీఫైనల్లో 21–13, 22–24, 21–14తో టాప్ సీడ్ మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)ను బోల్తా కొట్టించాడు.
గతేడాది మారిషస్ అంతర్జాతీయ సిరీస్ టోర్నీ ఫైనల్లో తన సోదరుడు రోహిత్ యాదవ్‌ను ఓడించి రాహుల్ తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌ను గెలిచాడు. తాజా విజయంతో అతను తన ఖాతాలో రెండో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రాహుల్‌కు ఈ విజయంతో 2,200 డాలర్ల (రూ. లక్షా 41 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సుమీత్ రెడ్డి తన భాగస్వామి మనూ అత్రితో కలిసి టైటిల్‌ను గెలిచాడు. ఫైనల్లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–13, 21–15తో గాడ్విన్ ఒలోఫువా–జువన్ ఒపెయోరి (నైజీరియా) జంటపై నెగ్గింది.