
‘‘స్క్రిప్ట్ చదివి, ఓ మంచి సినిమా తీయడం నిర్మాత బాధ్యత అని భావిస్తాను. అందుకే ప్రతి స్క్రిప్ట్‌ను నేనే చదివి నిర్ణయం తీసుకుంటాను. సినిమా ట్రైలర్, ఫస్ట్ షో తర్వాత వచ్చే ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ నా ట్రంప్‌కార్డ్స్. పరిమిత బడ్జెట్‌తో, తక్కువ సమయంలో సినిమాలు తీస్తే నిర్మాతలకు లాభాలు వస్తాయని నమ్ముతాను’’ అని అన్నారు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా(Rahul Yadav Nakka).
ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam). ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Goutham) లీడ్ రోల్స్‌లో నటించగా, మరో కీలక పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఆర్‌వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు.
ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ– ‘‘తాత–మనవళ్ల కథ ఇది. తాను చేసిన తప్పులను తాత ఎలా రియలైజ్ అయ్యాడు? మనవడు తాను చేసిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకున్నాడు? అనే అంశాలతో ఈ సినిమా ఉంటుంది. అందరినీ ఎంటర్‌టైన్ చేసేలా మూవీ ఉంటుంది. బ్రహ్మానందంగారు కథ ఓకే చేయకపోతే ఈ సినిమాయే లేదు.
ఇందులో మూర్తి పాత్రలో బ్రహ్మానందంగారు, బ్రహ్మా పాత్రలో రాజా గౌతమ్, గిరి పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ నటించారు. ముందుగా బ్రహ్మా పాత్రకు ‘వెన్నెల’ కిశోర్‌గారిని అడగ్గా, ఆయన హీరో ఫ్రెండ్ గిరి పాత్ర చేస్తానన్నారు. దీంతో రాజా గౌతమ్ పేరు ప్రస్తావనకు వచ్చి, ఆయనతో మాట్లాడి, ఈప్రాజెక్ట్‌లోకి తీసుకున్నాం.. ఇక సినీ ఇండస్ట్రీకి కొత్త దర్శకులను పరిచయం చేయాలని నన్ను నేను ఛాలెంజ్ చేసుకున్నాను. నేను పరిచయం చేయబోతున్న నాలుగో దర్శకుడు నిఖిల్. మా నెక్ట్స్‌ప్రాజెక్ట్ ‘వైబ్’. ఇందులో రాజా గౌతమ్ హీరోగా చేస్తున్నారు. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, మసూద’ చిత్రాలకు సీక్వెల్స్ ఉన్నాయి. కానీ ఇంకా సమయం ఉంది ’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment