
'టీమిండియా కోచ్ గా చేసే ఉద్దేశం లేదు'
మెల్ బోర్న్:టీమిండియా క్రికెట్ కొత్త కోచ్ గా తనపై వచ్చిన వార్తలకు సంబంధించి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ స్పందించాడు. ప్రస్తుతం తనకు టీమిండియా కోచ్ గా పని చేసే ఉద్దేశం లేదని తాజాగా స్పష్టం చేశాడు. తనకు అంతర్జాతీయంగా క్రికెట్ కోచ్ గా పనిచేసే అభిలాష ఉన్నా.. మరికొంత కాలం వేచి చూడాలనుకుంటున్నట్లు తెలిపాడు. కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న లాంగర్ .. తాను అంతర్జాతీయ కోచ్ గా పనిచేయడానికి ఇది సరైన సమయం కాదన్నాడు. మంగళవారం వెస్ట్రన్ ఆస్ట్రేలియా క్రికెట్ అసోసియేషన్(డబ్యూఏసీఏ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో లాంగర్ పై విధంగా స్పందించాడు. తన ముందున్నది డబ్యూసీఏ క్రికెట్ ను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడమేనని పేర్కొన్నాడు.
భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ జస్టిన్ లాంగర్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. డంకెన్ ఫ్లెచర్ వారసుడిగా అతను పగ్గాలు స్వీకరించే అవకాశాలున్నాయని వార్తలు చోటు చేసుకున్నాయి. గతంలో ఆసీస్ జాతీయ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పని చేసిన లాంగర్.. ప్రస్తుతం వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు ఛీప్ కోచ్‌గా పని చేస్తున్నారు.