
కొలంబో: దాదాపు ఏడాది కాలంగా శ్రీలంక క్రికెట్ జట్టుకు దూరమైన సీనియర్ పేసర్ లసిత్ మలింగా పునరాగమనం చేయబోతున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భాగంగా ప్రకటించిన శ్రీలంక జట్టులో మలింగా చోటు కల్పించారు. ఈ మేరకు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శనివారం లంక సెలక్టర్లు ప్రకటించారు.
2017లో భారత్‌పై చివరిసారిగా మలింగ తన వన్డే మ్యాచ్‌ని ఆడాడు. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక జట్టు పేలవ ప్రదర్శనపై ఆ దేశ క్రీడల మంత్రి పెదవి విరిచారు. ఆటగాళ్లకి కనీస ఫిట్‌నెస్ ప్రమాణాలు కూడా లేవని ఆ సమయంలో మంత్రి విమర్శించడంతో లసిత్ మలింగ క్రీడల మంత్రిపై వ్యంగ్యంగా స్పందించాడు. ఆ తర్వాత కొద్దిరోజులకే శ్రీలంక జట్టులో చోటు కోల్పోయాడు. 2018 ఐపీఎల్ సీజన్‌లో కూడా ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయలేదు.
దీంతో మలింగ కెరీర్ ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా అతడిని ఆసియా కప్ కోసం ప్రకటించిన వన్డే జట్టులోకి సెలక్టర్లు ఎంపిక చేశారు. ఆసియా కప్‌లో శ్రీలంక జట్టుకి ఏంజెలో మాథ్యూస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.