ఐపీఎల్-9 నుంచి మలింగా అవుట్
ముంబై: శ్రీలంక స్టార్ పేసర్ లసిత్ మలింగా గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. కొంతకాలంగా మోకాలి గాయంతో బాధపడుతున్న మలింగా ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్తో చేరినా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. టోర్నీలో సగం మ్యాచ్లకు మలింగ దూరంగా ఉండవచ్చని ముంబై కోచ్ రికీ పాంటింగ్ చెప్పాడు. అయితే వైద్యుల సలహా మేరకు అతను టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. ముంబై జట్టులో మలింగా స్థానంలో మరొకరిని తీసుకోవాల్సివుంది.
గత నవంబర్ నుంచి మలింగా గాయాలతో సతమతమవుతున్నాడు. ఎడమ మోకాలి గాయంతో బాధపడుతున్న లంక పేసర్ ఆసియా కప్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. ఆ తర్వాత ప్రతిష్టాత్మక టి-20 ప్రపంచ కప్లో కూడా పాల్గొనలేదు. మరోవైపు ఐపీఎల్లో ఆడేందుకుగాను మలింగాకు ఎన్ఓసీ ఇచ్చే ముందు అతడి ఫిట్నెస్ను పరిశీలించాల్సివుందని శ్రీలంక క్రికెట్ బోర్డు ఇటీవల తెలిపింది. తమ అనుమతి లేకుండా వెళ్తే బెంచ్పై కూర్చోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మలింగా ఐపీఎల్కు దూరంకావాల్సి వచ్చింది.