
మలింగా 200 నాటౌట్!
దంబుల్లా: దశాబ్దకాలానికి పైగా శ్రీలంక క్రికెట్ లో ప్రధాన బౌలర్ గా కొనసాగుతున్న లసిత్ మలింగా అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. తన పదునైన యార్కర్లతో ప్రత్యర్థి జట్లకు సింహస్వప్నంలా నిలిచే మలింగా తన కెరీర్ లో 200 వన్డే ఆడేందుకు సిద్ధమయ్యాడు. భారత్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ దంబుల్లా అంతర్జాతీయ స్టేడియంలో తొలి వన్డే ఆడుతున్న మలింగా.. శ్రీలంక తరపున 200వ వన్డే ఆడుతున్న 13వ క్రికెటర్ గా గుర్తింపు సాధించాడు. అయితే బౌలర్ల విభాగంలో మురళీధరన్, చమిందా వాస్లు తరువాత ఆ ఘనత సాధించిన ఆటగాడు మలింగా.
ప్రస్తుతం 298 వన్డే వికెట్లతో ఉన్న మలింగా మరోఅరుదైన ఘనతకు స్వల్ప దూరంలో ఉన్నాడు. లంక తరపున మూడొందల వన్డే వికెట్లను సాధించడానికి ఇంకా రెండు వికెట్ల దూరంలో మలింగా ఉన్నాడు. అంతకుముందు మురళీధరన్(534 వికెట్లు), చామిందా వాస్(400)లు మాత్రమే మూడొందలకు పైగా వికెట్లు సాధించిన లంక బౌలర్లు. ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్ లో మాత్రమే మలింగా కొనసాగుతున్నాడు. ఫిట్ నెస్ కారణంగా ఇటీవల టెస్టులకు మలింగా గుడ్ బై చెప్పేశాడు.