నీరజ్ చోప్రా నేతృత్వంలో భారత బృందం మార్చ్‌పాస్ట్
పచ్చటి ప్రకృతిని తలపించే పర్వతం నేపథ్యంతో... వారసత్వ ఘన చరితకు ప్రతీకైన సమన్ నృత్యంతో... గాయని అన్గున్ సిప్టా సస్మి బృందం పాటతో... సంగీత హోరు నడుమ... కిక్కిరిసిన ప్రేక్షకాభిమాన ఆనంద పరవశంతో... మహామహులైన ప్రతినిధుల సమక్షాన... ఆసియా అతిపెద్ద క్రీడా సంబరానికి తెరలేచింది.
జకార్తా: ఇండోనేసియా రాజధాని జకార్తాలోని జలోరా బంగ్ కర్నొ స్టేడియంలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7 గంటలకు పద్దెనిమిదో ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఆ దేశ ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, 1992 బార్సిలోనా ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత సుశీ సుశాంతి... జ్యోతి ప్రజ్వలనతో ఏషియాడ్ సమర భేరి మోగినట్లైంది. ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడొడొ, ఆసియా ఒలింపిక్ సమాఖ్య (ఓసీఏ) అధ్యక్షుడు షేక్ అహ్మద్ అల్ ఫదా అల్ సబా, ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎరిక్ తొహిర్... ప్రాతినిధ్య దేశాల ప్రతినిధులకు సాదర ఆహ్వానం పలికారు.
►ప్రారంభ వేడుకలు రెండున్నర గంటల పాటు సాగాయి. ఈ సందర్భంగా ఇటీవల ఇండోనేసియాలోని లంబొక్ ద్వీపంలో భూకంపంతో మృతి చెందిన 460 మందికి నివాళులర్పించారు.
►600 టన్నుల బరువు, 120 మీటర్ల పొడవు, 30 మీటర్ల వైశాల్యంతో కూడిన వేదికపై 44 దేశాలకు చెందిన 6 వేల మంది అథ్లెట్లు తమతమ దేశాల పతకాలతో మార్చ్‌పాస్ట్ నిర్వహించారు. ఉత్తర, దక్షిణ కొరియాల అథ్లెట్లు ఉభయ కొరియా పతాకం కింద పాల్గొనడం విశేషం.
► ఇండోనేసియా దేశ అధికార చిహ్నమైన గరుడ పక్షి వేషధారి ముందు నడుస్తుండగా... ఆయా దేశాల క్రీడా బృందాలు వెనుక అనుసరించాయి.
► ఇండోనేసియా స్వాతంత్య్ర దినం 1945 ఆగస్టు 17. ఈ వేడుక సందర్భంగా 70 మంది విద్యార్థుల బృందం పతాకావిష్కరణ చేసింది. ఇందులో 17 మంది అబ్బాయిలు రక్షకులుగా, 8 మంది పతాకధారులుగా, 45 మంది సహాయకులుగా వ్యవహరించడం విశేషం.
►18 మంది ఇండోనేసియా ప్రముఖ గాయకులు... మూడుసార్లు గ్రామీ అవార్డు నామినీ జాయ్ అలెగ్జాండర్, ప్రఖ్యాత గాయని అన్గున్ సస్మి తదితరులు గానంతో అలరించారు. 3,600 మంది నృత్యకారులు ప్రదర్శనలిచ్చారు.
► 50 వేల మంది పైగా ఆహ్వానిత అతిథులతో పాటు అథ్లెట్లు, అధికారులు, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులు, సాధారణ ప్రజలతో స్టేడియం నిండిపోయింది.
► ‘మనందరం ఇక్కడకు చేరింది వైవిధ్యాన్ని చాటేందుకు..., విభిన్నతను చూపేందుకు, మానవత్వాన్ని ప్రదర్శించేందుకు’ అని ఆసియా క్రీడల నిర్వహణ కమిటీ చైర్మన్ ఎరిక్ తొహిర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
► సరిగ్గా 48 గంటల ముందు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సస్పెన్షన్ ఎత్తివేయడంతో కువైట్ అథ్లెట్లు తమ సొంత జెండాతో మార్చ్‌పాస్ట్‌లో పాల్గొనడం విశేషం.
► ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడు షేక్ అహ్మద్ ఆల్ సబా... ఉత్తర, దక్షిణ కొరియాల ఉమ్మడి మార్చ్‌పాస్ట్‌ను ప్రస్తుతించారు.
► ఈ క్రీడల నిర్వహణకు మరో వేదికైన పాలెంబాంగ్ నగరంలో... భారీ తెరలపై ప్రారంభ వేడుకలను ప్రసారం చేశారు.
► సమన్ నృత్య ప్రదర్శనలో 2200 మంది పాఠశాల విద్యార్థులు పాలు పంచుకున్నారు.
► జూలై 15న భారత రాజధాని ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ స్టేడియం నుంచి ప్రారంభమై 53 నగరాలను చుట్టివచ్చిన ఆసియా క్రీడల టార్చ్‌ను ఇండోనేసియాకు చెందిన ప్రఖ్యాత అథ్లెట్లు... ఏషియాడ్ ప్రారంభ వేడుకల వద్దకు తీసుకొచ్చారు.
►మార్చ్‌పాస్ట్‌లో భారత బృందానికి జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సారథ్యం వహించాడు.
విడొడొ... విభిన్నంగా?
ఆసియా క్రీడల ప్రారంభోత్సవానికి ముందు... టీవీల్లో ఓ వీడియో ప్రసారమైంది. బైక్‌లకు సంబంధించిన సాధారణ వాణిజ్య ప్రకటన తరహాలో కనిపించినా ఇది సుదీర్ఘంగా సాగింది. అందులో... ట్రాఫిక్‌లో చిక్కుకున్న తన కాన్వాయ్ నుంచి ఓ ప్రముఖుడు కిందకు దిగి, ద్విచక్ర వాహనాన్ని తీసుకుని, హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలను పక్కాగా అనుసరిస్తూ... ఏషియాడ్ ప్రారంభ వేడుకల వేదికైన జలోరా బంగ్ కర్నొ స్టేడియానికి సురక్షితంగా చేరుకుంటాడు. తీరా చూస్తే... అతడు ఇండోనేసియా అధ్యక్షుడు జొకొ విడొడొ. ఇదే వీడియో స్టేడియం బయట ఉన్న భారీ తెరల పైనా ప్రసారమైంది. దీని నేపథ్యాన్ని విడొడొనే వివరించి చెప్పడంతో వేడుకలకు హాజరైన ప్రతినిధులంతా హర్షాతిరేకం వ్యక్తం చేశారు. అయితే, ఇది పూర్తిస్థాయి అధికారికంగా ప్రకటితం కాలేదు.
ఏషియాడ్‌లో నేటి భారతీయం
(సమయం భారత కాలమానం ప్రకారం)
షూటింగ్: పురుషుల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం. 6.30 నుంచి; లక్షయ్, మానవ్‌జిత్ సింగ్); మహిళల ట్రాప్ క్వాలిఫయింగ్ (ఉ.గం. 7 నుంచి; శ్రేయసి సింగ్, అల్కా తోమర్).
► 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫయింగ్ (ఉ.గం. 8 నుంచి; రవి కుమార్, అపూర్వీ చండేలా); 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫయింగ్ (ఉ.గం. 10 నుంచి; అభిషేక్ వర్మ, మనూ భాకర్).
► 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్ (మ.గం. 12 నుంచి); 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఫైనల్స్ (మ.గం. 3.20 నుంచి).
కబడ్డీ: భారత్(vs)జపాన్ (మహిళల విభాగం లీగ్ మ్యాచ్, ఉ.గం. 7.30 నుంచి)
►భారత్(vs)శ్రీలంక (పురుషుల విభాగం లీగ్ మ్యాచ్, సా.గం. 5.30 నుంచి)
►బ్యాడ్మింటన్: పురుషుల టీమ్ తొలి రౌండ్ మ్యాచ్ (భారత్(vs)మాల్దీవులు; మ.గం. 1 నుంచి)
►మహిళల హాకీ: భారత్(vs)ఇండోనేసియా (లీగ్ మ్యాచ్; రా.గం. 7 నుంచి)
►పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ (మ.గం. 12 నుంచి రాత్రి 9 వరకు)
►సందీప్ తోమర్ (57 కేజీలు); బజరంగ్ పూనియా (65 కేజీలు); సుశీల్ కుమార్ (74 కేజీలు); పవన్ కుమార్ (86 కేజీలు); మౌజమ్ ఖత్రి (97 కేజీలు).
Comments
Please login to add a commentAdd a comment