సాక్షి, న్యూఢిల్లీ : బీసీసీఐని సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) పరిధిలోకి తీసుకురావాలని లా కమిషన్ బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. తమది ప్రైవేట్ సంస్థ అన్న బీసీసీఐ వాదనను లా కమిషన్ తోసిపుచ్చింది. బీసీసీఐతో పాటు దాని అనుబంధ క్రికెట్ అసోసియేషన్లను ఆర్‌టీఐ చట్ట పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. 2019 నుంచే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడంపై ముసాయిదా శ్వేతపత్రాన్ని లా కమిషన్ వెల్లడించిన నేపథ్యంలో తాజా ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచడం గమనార్హం. బీసీసీఐ ప్రభుత్వ తరహాలో వ్యవహరిస్తుండటంతో ఇతరులకు రాజ్యాంగం నిర్ధేశించిన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతోందని లా కమిషన్ పేర్కొంది.
బీసీసీఐని ఆర్‌టీఐ చట్టపరిధిలోకి తీసుకురావాలనే ప్రతిపాదనపై సిఫార్సు చేయాలని 2016, జులైలో సుప్రీం కోర్టు లా కమిషన్‌ను కోరింది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరొందిన బీసీసీఐ తమిళనాడు సొసైటీల రిజిస్ర్టేషన్ చట్టం కింద నమోదై ప్రైవేట్ సంస్థగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment