ముంబై: అత్యంత విజయవంతమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పెట్టుబడులు పెట్టేందుకు దిగ్గజ పారిశ్రామిక వేత్త లక్ష్మీ మిట్టల్ కూడా ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ లీగ్‌లో ముకేశ్ అంబానీతో పాటు విజయ్ మాల్యా లాంటి వ్యాపార దిగ్గజాలు ఉన్నారు. అయితే ఐపీఎల్‌లో ఆట పరంగా, ఆర్థికంగానూ అంత లాభసాటిగా లేని ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో వాటా తీసుకునేందుకు మిట్టల్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంలో ఆయన అల్లుడు అమిత్ శర్మ జీఎంఆర్ గ్రూప్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో క్వీన్స్ పార్క్ రేంజర్స్ జట్టులోనూ మిట్టల్‌కు వాటాలున్నాయి.
అయితే ఆ జట్టు ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. మరోవైపు ఆర్‌పీజీ గ్రూపు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టులో భాగస్వామ్యం కోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అటు కోల్‌కతా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు కూడా తమ ఆర్థిక భారాన్ని పంచుకునేందుకు వాటాదార్ల కోసం చూస్తున్నట్టు సమాచారం.