ఆక్లాండ్: కొన్ని రోజుల క్రితం న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ సామర్థ్యం అసాధారణమంటూ ప్రశంసలు కురిపించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. మరోసారి అతన్ని కొనియాడాడు. ప్రపంచ క్రికెట్‌లో విలియమ్సన్ చాలా స్మార్ట్ క్రికెటర్ అని ప్రశంసించాడు. ఒక కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించడంలో కూడా విలియమ్సన్‌ది ప్రత్యేక శైలి అని కోహ్లి తెలిపాడు. జట్టు సాధించే ఫలితాల్ని బట్టి నాయకత్వ లక్షణాలను నిర్ణయించలేమన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కివీస్ వైట్‌వాష్ అయినప్పటికీ అది ఏమీ విలియమ్సన్ కెప్టెన్సీ వైఫల్యం వల్ల కాదన్నాడు.
లీడర్‌షిప్‌ను జట్టు సాధించే ఫలితాల్ని బట్టి నిర్ణయించకూడదు. ఒక జట్టుగా సమిష్టిగా విఫలమైతేనే పరాజయాలు వస్తాయి. ఇక్కడ కెప్టెన్సీకి సంబంధం ఉండదు. సారథిగా విలియమ్సన్ జట్టును నడిపించే తీరు బాగుంటుంది. జట్టులోని సభ్యులకే గౌరవం ఇవ్వడంతో పాటు వారిపై నమ్మకం కూడా ఉంచుతాడు. దాంతోపాటు అతనొక చాలా చాలా స్మార్ట్ క్రికెటర్’ అని కోహ్లి పేర్కొన్నాడు. ఇక న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను గెలవడంపైనే దృష్టి సారించినట్లు కోహ్లి తెలిపాడు. శుక్రవారం నుంచి భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సిరీస్ ఆరంభం కానుంది. ఇందులో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్, రెండు టెస్టుల సిరీస్‌లు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment