పేస్ జంటకు మళ్లీ నిరాశ
న్యూఢిల్లీ: తన కెరీర్‌లో 56వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. గత నెలలో విన్‌స్టన్ సాలెమ్ ఓపెన్‌లో నాలుగు మ్యాచ్ పాయింట్లను వదులుకొని రన్నరప్‌గా నిలిచిన పేస్... తాజాగా సెయింట్ పీటర్స్‌బర్గ్ ఓపెన్‌లో ఒక మ్యాచ్ పాయింట్ వదులుకొని మళ్లీ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. జర్మనీకి చెందిన తన భాగస్వామి ఆండ్రీ బెగెమన్‌తో బరిలోకి దిగిన పేస్‌కు ఆదివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో 6-4, 3-6, 10-12తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ డొమినిక్ ఇంగ్లోట్ (బ్రిటన్)-హెన్రీ కొంటినెన్ (ఫిన్‌లాండ్) చేతిలో ఓటమి ఎదురైంది.
గంటా 19 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో తొలి సెట్‌ను దక్కించుకున్న పేస్-బెగెమన్ జంట రెండో సెట్‌లో ఏడో గేమ్‌లో తమ సర్వీస్‌ను కోల్పోయింది. రెండో సెట్‌ను నెగ్గిన ఇంగ్లోట్-కొంటినెన్ నిర్ణాయక సూపర్ టైబ్రేక్‌లో 8-9 వద్ద మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకున్నారు. కీలకదశలో తప్పిదాలు చేసిన పేస్ ద్వయం చివరకు ఓటమిని మూటగట్టుకుంది. రన్నరప్ పేస్ జోడీకి 26,110 డాలర్ల (రూ. 17 లక్షల 41 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 150 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.
43 ఏళ్ల పేస్ 1997 నుంచి ప్రతి ఏడాదీ ఏటీపీ డబుల్స్ టోర్నమెంట్‌లలో కనీసం ఒక టైటిలైనా గెలుస్తూ వచ్చాడు. అయితే ఈ ఏడాది మాత్రం అతను ఇప్పటిదాకా ఒక్క టైటిల్ కూడా నెగ్గలేకపోయాడు. రెండు టోర్నీల్లో మాత్రం టైటిల్‌కు చేరువై దూరమయ్యాడు. గతేడాది జనవరిలో ఆక్లాండ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచాక పేస్ మరో టైటిల్‌ను సాధించలేకపోయాడు.