తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ‘పోల్’
రైకోనెన్ సంచలనం ∙నేడు మొనాకో గ్రాండ్‌ప్రి
మోంటెకార్లో: ఒకటా... రెండా... ఏకంగా తొమ్మిదేళ్ల తర్వాత ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్ ఫార్ములావన్‌లో ‘పోల్ పొజిషన్’ ఘనత సాధించాడు. శనివారం జరిగిన మొనాకో గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో రైకోనెన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 12.178 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
చివరిసారి రైకోనెన్ 2008లో ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రిలో పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత అతను 128 రేసుల్లో పాల్గొన్నా ఏ రేసులోనూ పోల్ పొజిషన్ ఘనత సాధించలేకపోయాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్ ఎనిమిదో స్థానం నుంచి, ఒకాన్ 16వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు.