హామిల్టన్ హ్యాట్రిక్
సీజన్‌లో వరుసగా మూడో టైటిల్
చైనా గ్రాండ్‌ప్రిలో విజేత
తొలి రెండు స్థానాలు మెర్సిడెస్‌వే
టాప్-10లో ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు
షాంఘై: ఫార్ములావన్‌లో గత నాలుగేళ్లుగా ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టుకు ఈసారి పగ్గాలు వేస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తన జోరు కొనసాగిస్తూ సీజన్‌లో వరుసగా మూడో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ 54 ల్యాప్‌ల రేసును గంటా 33 నిమిషాల 28.338 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు.
ఈ క్రమంలో తన కెరీర్‌లో తొలిసారి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. సీజన్‌లో తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మధ్యలోనే వైదొలిగిన హామిల్టన్... రెండో రేసు మలేసియా గ్రాండ్‌ప్రిలో, మూడో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అదే జోరును చైనాలోనూ పునరావృతం చేసి మెర్సిడెస్ జట్టుకు వరుసగా నాలుగో విజయాన్ని అందించాడు. సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన నాలుగు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్స్ లభించడం విశేషం. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ టైటిల్ సాధించాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు మరోసారి ఆకట్టుకున్నారు. సీజన్‌లో మూడోసారి టాప్-10లో స్థానాన్ని సంపాదించారు. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో... సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఐదో స్థానంతో సరిపెట్టుకోగా... ఈ రేసు గత ఏడాది విజేత అలోన్సో మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో 20 మంది రేసు పూర్తిచేయగా... గ్రోస్యెన్ (లోటస్), సుటిల్ (సాబెర్) మధ్యలో వైదొలిగారు. తదుపరి రేసు మే 11న స్పెయిన్ గ్రాండ్‌ప్రి జరుగుతుంది.
తప్పిదంతో రేసు కుదింపు...
చైనా గ్రాండ్‌ప్రి రేసు 56 ల్యాప్‌లపాటు జరగాల్సింది. అయితే రేసు ముగింపునకు సూచికగా ప్రదర్శించే చెకర్డ్ ఫ్లాగ్‌ను పొరపాటుగా 55వ ల్యాప్ ముగింపు దశలో చూపించారు. ఫలితంగా నిర్వాహకులు రేసును తొందరగా ముగించాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం రేసు ఫలితాలను 54 ల్యాప్‌ల వరకు తీసుకొని ప్రకటించారు. చెకర్డ్ ఫ్లాగ్ విషయంలో జరిగిన తప్పిదాన్ని అన్ని జట్ల డ్రైవర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు.