Rosberg
-
హామిల్టన్ 'సిక్సర్'!
హాకెన్‌హీమ్:వారం రోజుల క్రితం హంగేరీ గ్రాండ్ ప్రిలో సత్తా చాటిన ప్రపంచ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి దుమ్మురేపాడు. జర్మన్ గ్రాండ్ ప్రిలో భాగంగా ఆదివారం జరిగిన ప్రధాన రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ 67 ల్యాప్‌లను అందరికంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. తద్వారా వరుసగా నాల్గో విజయాన్ని సాధించిన హామిల్టన్.. ఈ సీజన్లో ఆరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రధాన రేసును రెండో స్థానం నుంచి మొదలు పెట్టిన హామిల్టన్ ఆద్యంత ఆకట్టుకున్నాడు. అయితే క్వాలిఫయింగ్ సెషన్లో పోల్ పొజిషన్ సాధించి రేసును ఆరంభించిన తన సహచర మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్ బర్గ్ నాల్గో స్థానానికి పరిమితమై సొంత ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాడు. కాగా, రెడ్ బుల్ కు చెందిన డానియల్ రికియార్డో, మాక్స్ వెర్స్టాపెన్లు పొడియం పొజిషన్ సాధించారు. ఈ రేసులో రికియార్డో రెండో స్థానంలో, వెర్స్టాపెన్ మూడో స్థానంలో నిలవడం విశేషం. గత హంగేరి గ్రాండ్ ప్రితో ఈ సీజన్ లో తొలిసారి డ్రైవర్ల పాయింట్ల పట్టికలో ముందంజలోకి వచ్చిన హామిల్టన్..తాజా రేసులో విజయం సాధించిన అనంతరం 19 పాయింట్ల ఆధిక్యం సాధించి రోస్ బర్గ్ ను మరింత వెనక్కినెట్టాడు. ఇది జర్మన్ గ్రాండ్ ప్రిలో హామిల్టన్ కు మూడో విజయం కాగా, ఓవరాల్ కెరీర్లో 49 విజయం కావడం విశేషం. -
మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ విజేత రోస్‌బర్గ్
మెక్సికో: మెక్సికన్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా వన్ రేసులో జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిలో రోస్బర్గ్కు ఇది నాలుగో విజయం కాగా, అతడి కెరీర్లో 12 వ విజయం. మెర్సిడేజ్ టీమ్మేట్, మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హమిల్టన్ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ తాజా విజయంతో మెర్సిడేజ్ జట్టు 17 రేసుల్లో 10 రేసులను ఒకటీ, రెండు స్థానాలతో గెలుచుకుంది. విజయం అనంతరం రోస్‌బర్గ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది అత్యుత్తమ వేదికను గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది అన్నారు. -
ఆరేళ్ల తర్వాత... అదే తేదీన
బ్రిటిష్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్ సీజన్లో ఐదో విజయం సిల్వర్‌స్టోన్: సొంతగడ్డపై లూయిస్ హామిల్టన్ సత్తా చాటుకున్నాడు. సరిగ్గా ఆరేళ్ల క్రితం జూలై 6న తొలిసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ నెగ్గిన ఈ బ్రిటన్ డ్రైవర్... అదే ఫలితాన్ని, అదే తేదీన 2014లో పునరావృతం చేశాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ సంపూర్ణ ఆధిపత్యం చలాయించి 52 ల్యాప్‌లను 2 గంటల 26 నిమిషాల 52.094 సెకన్లలో పూర్తి చేశాడు. ఆరో స్థానం నుంచి రేసును ప్రారంభించిన హామిల్టన్ 29వ ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వెళ్లాడు. అటునుంచి ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ దూసుకుపోయాడు. చివరికి 30 సెకన్ల తేడాతో విజయాన్ని దక్కించుకొని సీజన్లో ఐదో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. అంతకుముందు ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ 28 ల్యాప్‌ల వరకు ఆధిక్యంలో ఉన్నాడు. అయితే హఠాత్తుగా అతని గేర్‌బాక్స్‌లో సమస్య తలెత్తడంతో రోస్‌బర్గ్ 28వ ల్యాప్‌లో రేసు నుంచి తప్పుకున్నాడు. రేసు ఆరంభమైన కొద్ది క్షణాల్లోనే ఫెలిప్ మసా (విలియమ్స్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) నియంత్రణ కోల్పోయి ట్రాక్‌పై పరస్పరం ఢీకొట్టుకోవడంతో గంటపాటు రేసును నిలిపివేశారు. రేసు పునః ప్రారంభమయ్యాక హామిల్టన్, రోస్‌బర్గ్ హోరాహోరీగా పోటీపడినా తుదకు హామిల్టన్ పైచేయి సాధించాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. సీజన్‌లోని తదుపరి రేసు జర్మనీ గ్రాండ్‌ప్రి ఈనెల 20న జరుగుతుంది. -
రోస్‌బర్గ్ హవా...
ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో మూడో విజయం హామిల్టన్‌కు రెండో స్థానం టాప్-10లో ‘ఫోర్స్’ డ్రైవర్లు స్పీల్బర్గ్ (ఆస్ట్రియా): వేదిక మారినా ఫలితం మారలేదు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ జట్టుకు చెందిన డ్రైవర్లు టాప్-2లో ఒక్కరైనా ఉన్నారు. అదే ఆనవాయితీ ఏడో రేసులోనూ కొనసాగింది. ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. అదే జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 27 నిమిషాల 54.976 సెకన్లలో పూర్తి చేశాడు. మూడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ తొలి ల్యాప్ మలుపులోనే రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఆ తర్వాత కొన్ని ల్యాప్‌ల పాటు ఆధిక్యం పలువురు డ్రైవర్లతో దోబూచులాడింది. అయితే 29 ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చిన రోస్‌బర్గ్ ఆ తర్వాత అదే జోరును చివరిదాకా కొనసాగించాడు. ఈ సీజన్లో మూడో విజయం నమోదు చేసిన ఈ జర్మన్ డ్రైవర్ ఏడు రేసుల్లోనూ టాప్-2లో ఉండటం విశేషం. ఆరేళ్ల తర్వాత తొలిసారి ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన విలియమ్స్ జట్టు డ్రైవర్ ఫెలిప్ మసా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు ఆనందాన్ని మిగిల్చింది. ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచి పాయింట్లు సంపాదించారు. 15వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన సెర్గియో పెరెజ్ ఆరో స్థానంలో నిలిచి 8 పాయింట్లు... 10వ స్థానం నుంచి రేసును ఆరంభించిన హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానంలో నిలిచి రెండు పాయింట్లు గెల్చుకున్నారు. వెటెల్‌కు నిరాశ: గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా ఉన్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు ఈ సీజన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఆస్ట్రియా రేసులో అతను తొలి ల్యాప్‌లోనే నిష్ర్కమించడం గమనార్హం. -
కెరీర్లో తొలిసారి...
హామిల్టన్‌కు స్పానిష్ గ్రాండ్‌ప్రి సీజన్లో వరుసగా నాలుగో విజయం రెండో స్థానంలో రోస్‌బర్గ్ టాప్-10లో నిలిచిన ‘ఫోర్స్’ బార్సిలోనా: ఫార్ములావన్ ప్రస్తుత సీజన్లో ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ జోరు కొనసాగుతోంది. వరుసగా నాలుగో రేసులోనూ విజయబావుటా ఎగురవేశాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రి రేసును హామిల్టన్ 1 గం. 41 ని. 05.155 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. తద్వారా కెరీర్లో తొలిసారి ఈ గ్రాండ్‌ప్రిని సొంతం చేసుకున్నాడు. హామిల్టన్ ఈ రేసుకు ముందు వరుసగా మలేసియా గ్రాండ్‌ప్రితో పాటు బహ్రెయిన్, చైనా గ్రాండ్ప్రిలను సైతం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక్కడ కూడా తన జోరుకు ఎదురులేదని నిరూపిస్తూ మెర్సిడెస్ ఖాతాలో వరుసగా ఐదో విజయాన్ని చేర్చాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 26వ విజయం. ప్రసుత రేసులో ద్వితీయ స్థానంలో నిలిచిన రోస్‌బర్గ్.. హామిల్టన్‌కు గట్టి పోటీనిచ్చాడు. కేవలం 0.6 సెకన్ల తేడాతో వెనకబడ్డాడు. డేనియల్ రికియార్డోకు మూడో స్థానం దక్కగా... డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ నాలుగో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఫోర్స్ ఇండియా డ్రైవర్లు చైనా గ్రాండ్ప్రిలాగే ఇక్కడా మెరిశారు. సీజన్లో నాలుగోసారి ఇద్దరూ టాప్-10లో నిలిచారు. పెరెజ్ తొమ్మిదో స్థానం, హల్కెన్‌బర్గ్ పదో స్థానం దక్కించుకున్నారు. రేసులో పాల్గొన్న 22 మంది డ్రైవర్లలో కొమయషి, జీన్ ఎరిక్ వర్గిన్ మధ్యలో వైదొలిగారు. తదుపరి రేసు ఈనెల 25న మొనాకోలో జరుగనుంది. -
హామిల్టన్ హ్యాట్రిక్
సీజన్లో వరుసగా మూడో టైటిల్ చైనా గ్రాండ్‌ప్రిలో విజేత తొలి రెండు స్థానాలు మెర్సిడెస్వే టాప్-10లో ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు షాంఘై: ఫార్ములావన్‌లో గత నాలుగేళ్లుగా ఆధిపత్యం చలాయించిన రెడ్‌బుల్ జట్టుకు ఈసారి పగ్గాలు వేస్తూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు దూసుకుపోతున్నారు. ముఖ్యంగా ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ తన జోరు కొనసాగిస్తూ సీజన్లో వరుసగా మూడో విజయాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ 54 ల్యాప్‌ల రేసును గంటా 33 నిమిషాల 28.338 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో తన కెరీర్లో తొలిసారి ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. సీజన్లో తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మధ్యలోనే వైదొలిగిన హామిల్టన్... రెండో రేసు మలేసియా గ్రాండ్‌ప్రిలో, మూడో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. అదే జోరును చైనాలోనూ పునరావృతం చేసి మెర్సిడెస్ జట్టుకు వరుసగా నాలుగో విజయాన్ని అందించాడు. సీజన్లో ఇప్పటివరకు జరిగిన నాలుగు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్స్ లభించడం విశేషం. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ టైటిల్ సాధించాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్లు మరోసారి ఆకట్టుకున్నారు. సీజన్లో మూడోసారి టాప్-10లో స్థానాన్ని సంపాదించారు. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో... సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచారు. ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఐదో స్థానంతో సరిపెట్టుకోగా... ఈ రేసు గత ఏడాది విజేత అలోన్సో మూడో స్థానంలో నిలిచాడు. మొత్తం 22 మంది డ్రైవర్లలో 20 మంది రేసు పూర్తిచేయగా... గ్రోస్యెన్ (లోటస్), సుటిల్ (సాబెర్) మధ్యలో వైదొలిగారు. తదుపరి రేసు మే 11న స్పెయిన్ గ్రాండ్‌ప్రి జరుగుతుంది. తప్పిదంతో రేసు కుదింపు... చైనా గ్రాండ్‌ప్రి రేసు 56 ల్యాప్లపాటు జరగాల్సింది. అయితే రేసు ముగింపునకు సూచికగా ప్రదర్శించే చెకర్డ్ ఫ్లాగ్‌ను పొరపాటుగా 55వ ల్యాప్ ముగింపు దశలో చూపించారు. ఫలితంగా నిర్వాహకులు రేసును తొందరగా ముగించాల్సి వచ్చింది. నిబంధనల ప్రకారం రేసు ఫలితాలను 54 ల్యాప్‌ల వరకు తీసుకొని ప్రకటించారు. చెకర్డ్ ఫ్లాగ్ విషయంలో జరిగిన తప్పిదాన్ని అన్ని జట్ల డ్రైవర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం సిగ్గుచేటు అని విమర్శించారు. -
రోస్బర్గ్కు పోల్ పొజిషన్
మెర్సిడెస్వే తొలి రెండు గ్రిడ్లు వెటెల్‌కు నిరాశ నేడు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి మనామా: తొలి రెండు రేసుల్లో దక్కిన విజయాలతో మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు మూడో రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలోనూ దుమ్మురేపేందుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ‘పోల్ పొజిషన్’ సంపాదించగా... అదే జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. రోస్‌బర్గ్ మూడో సెషన్లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 33.185 సెకన్లలో ముగించాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును రోస్‌బర్గ్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ పదో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ రికియార్డో మూడో స్థానం పొందినా... గత రేసులో ప్రమాదకరంగా ట్రాక్‌పై దూసుకురావడంతో అతనిపై పది గ్రిడ్ల పెనాల్టీని విధించారు. దాంతో అతను ఈసారి 13వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. సెర్గియో పెరెజ్ నాలుగో స్థానం నుంచి... హుల్కెన్‌బర్గ్ 11వ స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. సీజన్‌లోని తొలి రెండు రేసులు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో నికో రోస్‌బర్గ్... మలేసియా గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతలుగా నిలిచారు. బహ్రెయిన్లోనూ వీరిద్దరిలో ఒకరికి విజయావకాశాలున్నాయి. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి వివరాలు ల్యాప్‌ల సంఖ్య : 57 సర్క్యూట్ పొడవు : 5.412 కి.మీ. రేసు దూరం : 308.238 కి.మీ. మలుపుల సంఖ్య : 23 ల్యాప్ రికార్డు : 1ని:31.447 సె (రోసా-2005) గతేడాది విజేత : వెటెల్