రోస్‌బర్గ్ హవా... | Nico Rosberg wins Austrian Grand Prix as Lewis Hamilton battles to second spot and Sebastian Vettel is forced to retire | Sakshi
Sakshi News home page

రోస్‌బర్గ్ హవా...

Published Mon, Jun 23 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 9:13 AM

రోస్‌బర్గ్ హవా...

రోస్‌బర్గ్ హవా...

ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం
  సీజన్‌లో మూడో విజయం
  హామిల్టన్‌కు రెండో స్థానం
  టాప్-10లో ‘ఫోర్స్’ డ్రైవర్లు
 
 స్పీల్‌బర్గ్ (ఆస్ట్రియా): వేదిక మారినా ఫలితం మారలేదు. ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ జట్టుకు చెందిన డ్రైవర్లు టాప్-2లో ఒక్కరైనా ఉన్నారు. అదే ఆనవాయితీ ఏడో రేసులోనూ కొనసాగింది. ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. అదే జట్టుకు చెందిన లూయిస్ హామిల్టన్ రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు.
 
 ఆదివారం జరిగిన 71 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 27 నిమిషాల 54.976 సెకన్లలో పూర్తి చేశాడు. మూడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ తొలి ల్యాప్ మలుపులోనే రెండో స్థానానికి దూసుకొచ్చాడు. ఆ తర్వాత కొన్ని ల్యాప్‌ల పాటు ఆధిక్యం పలువురు డ్రైవర్లతో దోబూచులాడింది. అయితే 29 ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చిన రోస్‌బర్గ్ ఆ తర్వాత అదే జోరును చివరిదాకా కొనసాగించాడు. ఈ సీజన్‌లో మూడో విజయం నమోదు చేసిన ఈ జర్మన్ డ్రైవర్ ఏడు రేసుల్లోనూ టాప్-2లో ఉండటం విశేషం. ఆరేళ్ల తర్వాత తొలిసారి ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన విలియమ్స్ జట్టు డ్రైవర్ ఫెలిప్ మసా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
 
 భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు ఈ రేసు ఆనందాన్ని మిగిల్చింది. ఇద్దరు డ్రైవర్లు టాప్-10లో నిలిచి పాయింట్లు సంపాదించారు. 15వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన సెర్గియో పెరెజ్ ఆరో స్థానంలో నిలిచి 8 పాయింట్లు... 10వ స్థానం నుంచి రేసును ఆరంభించిన హుల్కెన్‌బర్గ్ తొమ్మిదో స్థానంలో నిలిచి రెండు పాయింట్లు గెల్చుకున్నారు.
 
 వెటెల్‌కు నిరాశ: గత నాలుగేళ్లుగా ప్రపంచ చాంపియన్‌గా ఉన్న రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు ఈ సీజన్ ఏమాత్రం కలిసిరావడం లేదు. ఆస్ట్రియా రేసులో అతను తొలి ల్యాప్‌లోనే నిష్ర్కమించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement