మళ్లీ హామిల్టన్‌కే ‘పోల్’
నేడు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి
సిల్వర్‌స్టోన్ (యునెటైడ్ కింగ్‌డమ్): సొంతగడ్డపై దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో ఎనిమిదోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఇంగ్లండ్‌కు చెందిన హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 32.248 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు.
డిఫెండింగ్ చాంపియన్ అయిన 30 ఏళ్ల హామిల్టన్ ప్రస్తుతం డ్రైవర్స్ స్టాండింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానం నుంచి మొదలుపెట్టే మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ నుంచి హామిల్టన్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. చివరి నాలుగు రేసుల్లో రోస్‌బర్గ్ మూడింటిలో గెలవడం విశేషం. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా 9, 11వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు.
టాప్-10 గ్రిడ్ పొజిషన్స్
1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. మసా (విలియమ్స్), 4. బొటాస్ (విలియమ్స్), 5. రైకోనెన్ (ఫెరారీ), 6. వెటెల్ (ఫెరారీ), 7. క్వియాట్ (రెడ్‌బుల్), 8. సెయింజ్ (ఎస్టీఆర్), 9. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 10. రికియార్డో (రెడ్‌బుల్).
నేటి ప్రధాన రేసు సా.గం. 5.25 నుంచి
స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం