
ధోనీ, నేను ఆ విషయాలు మాట్లాడుకున్నాం
సిడ్నీ: టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోనీ ఒకరని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అన్నాడు. కెప్టెన్‌గా జట్టును గెలిపించేందుకు ధోనీ నిరంతరం ప్రయత్నించేవాడని, దూకుడుగా వ్యవహరించేవాడని చెప్పాడు. ఈ లక్షణాలే అతణ్ని గొప్ప కెప్టెన్‌ను చేశాయని అభిప్రాయపడ్డాడు. ధోనీలో క్రికెట్ ఆడే సత్తా ఇంకా ఉందని, విరాట్ కోహ్లీకి అతని మద్దతు ఉంటుందని క్లార్క్ అన్నాడు. మహీ కెప్టెన్గా కొనసాగినా విజయవంతమయ్యేవాడని, కేవలం ఆటగాడిగా ఉండాలని భావిస్తున్నాడని, బ్యాట్‌తో రాణిస్తాడని చెప్పాడు.
ధోనీతో తనకున్న అనుబంధాన్ని క్లార్క్ గుర్తు చేసుకున్నాడు. 'ధోనీ, భారత్‌లపై చాలా మ్యాచ్‌లు ఆడాను. చెన్నైలో డబుల్ సెంచరీ చేశాను. ఆ విషయాన్ని ఎప్పటికీ మరిచిపోను. చాలాసార్లు క్లిష్ట సమయాల్లో ధోనీ భారత జట్టును గెలిపించాడు. మ్యాచ్‌ను ప్రత్యర్థి జట్టు చేతుల్లోంచి లాగేసుకున్నాడు. ధోనీకి, నాకు మోటార్ బైకులు అంటే చాలా ఇష్టం. అతని దగ్గర చాలా బైకులు ఉన్నాయి. మేమిద్దరం బైక్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. ధోనీ అద్భుతమైన వ్యక్తి. గొప్ప క్రికెటర్. అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నా. చాలాకాలం క్రికెట్ ఆడుతాడని భావిస్తున్నా' అని క్లార్క్ అన్నాడు.