మెస్సీ అస్త్ర సన్యాసం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన
మెస్సీ అస్త్ర సన్యాసం అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటన
క్లబ్ ఫుట్‌బాల్‌లో తిరుగు లేని సూపర్ స్టార్... వేసే ప్రతి అడుగు, మైదానంలో పరుగుకు కోట్లాది రూపాయల కనకవర్షం కురుస్తుంది. మెస్సీ అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగించే ఒక మాయ. నాలుగు చాంపియన్స్ లీగ్ టైటిల్స్, ఏకంగా ఎనిమిది స్పానిష్ లీగ్ ట్రోఫీలు, లెక్క లేనన్ని అవార్డులు, రివార్డులు, లెక్క పెట్టలేనంత మంది ఫ్యాన్స్.
దేశం తరఫున 11 ఏళ్ల కెరీర్... చెప్పుకోదగ్గ అంతర్జాతీయ టైటిల్ ఒక్కటి కూడా లేదు. మూడు కోపా అమెరికా ఫైనల్స్‌లో ఓటమి. వరల్డ్ కప్ ఫైనల్ పోరు కూడా చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఐదు సార్లు ‘ఫిఫా’ ఉత్తమ ఆటగాడే అయినా ఆ ఉత్తమ ప్రదర్శన అర్జెంటీనాకు మాత్రం ఏ టైటిల్‌నూ తేలేదు. అతను ఆడిన నాలుగు ఫైనల్స్‌లోనూ పరాభవమే.
సాక్షి క్రీడా విభాగం:- 29వ పుట్టిన రోజు జరుపుకున్న రెండు రోజులకే ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇక దేశం తరఫున ఆడలేనంటూ అస్త్ర సన్యాసం చేశాడు. అర్జెంటీనా తరఫున అంతర్జాతీయ టోర్నీల్లో విజేతగా నిలిచేందుకు అన్ని ప్రయత్నాల్లోనూ విఫలమై, నిరాశా నిస్పృహకు లోనై, చివరకు ‘కోపా’ పరాజయ భారంలో ప్రధాన భాగమై అతను నిష్ర్కమించాడు. ఫైనల్లో చిలీ చేతిలో ఓడిన తర్వాత ‘నేను అర్జెంటీనా తరఫున ఆఖరి మ్యాచ్ ఆడేశాను’ అని అతను ప్రకటించాడు. 2005లో అర్జెంటీనా జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడిన మెస్సీ మొత్తం 113 మ్యాచ్‌లలో 55 గోల్స్ చేశాడు. ‘నేను చేయాల్సిందంతా చేశాను. నాలుగు ఫైనల్స్ ఆడినా గెలుపు దక్కలేదు. దేశం తరఫున టైటిల్ గెలవాలని అందరికంటే ఎక్కువగా భావించాను. రిటైర్మెంట్ కఠిన నిర్ణయమే. వెనక్కి వచ్చే ఆలోచన లేదు’ అని మెస్సీ స్పష్టం చేశాడు.
రికార్డులే రికార్డులు
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ను శిఖరాన నిలిపిన మారడోనా తర్వాత మెస్సీనే ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 2005లో తన దేశానికి అండర్-20 ప్రపంచకప్‌ను అందించాక ఈ కుర్రాడు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ తర్వాత అతి పిన్న వయసులో దేశం తరఫున ‘ఫిఫా’ ప్రపంచ కప్ ఆడిన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోవటం లాంఛనమే అయింది. 5’7’’ ఎత్తు అంటే సాధారణంగా ఫుట్‌బాలర్లలో తక్కువగానే లెక్క. కానీ దీంతోనే అతను మైదానంలో చురుగ్గా దూసుకుపోయి ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచాడు. వరుసగా నాలుగు సార్లు ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా నీరాజనాలందుకున్న మెస్సీ... తక్కువ వ్యవధిలోనే దిగ్గజ ఫుట్‌బాలర్లలో ఒకడిగా తనదైన ముద్ర వేశాడు.
ఆ ఒక్కటీ తప్ప...
క్లబ్ ఆటగాడిగా ఉన్న గుర్తింపును పక్కన పెడితే అర్జెంటీనా తరఫున కూడా మెస్సీ ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. జట్టులో సీనియర్లు ఎంత మంది ఉన్నా... ఒంటిచేత్తో పలు మ్యాచ్‌లలో గెలిపించాడు. అయితే ఇన్నేళ్ల కెరీర్‌లో దురదృష్టం అతడిని వెంటాడింది. ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం గుర్తుంచుకునే ప్రధాన టోర్నీలలో మాత్రం అతనికి విజయానందం దక్కలేదు. మెస్సీ జట్టులోకి వచ్చిన తర్వాత మూడు ప్రపంచకప్‌లు, కోపా అమెరికా కప్‌లలో అర్జెంటీనా ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. దాంతో కీలక టోర్నీల్లో జట్టును గెలిపించలేడనే విమర్శను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆటతో ఎంత మెప్పించినా...
ఈ విషయంలో మాత్రం మారడోనాను అతను మరిపించలేకపోయాడు. ఫలితంగా ఈ ‘పదో నంబర్’ ఆటగాడికి ప్రపంచం అర్జెంటీనా తరఫున రెండో స్థానమే ఇచ్చింది! 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడం ఒక్కటే అతనికి కాస్త ఊరటనిచ్చే విషయం. 31 ఏళ్ల వయసులో మరో ప్రపంచకప్ బరిలోకి దిగే అవకాశం ఉన్నా అతను దానిని వద్దనుకున్నాడు.
తిరిగొస్తాడా..!
మెస్సీ అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచింది. ఓటమి కారణంగా ఇది ఆవేశంలో తీసుకున్న నిర్ణయంగా కొందరు అభివర్ణిస్తుండగా, మరో వరల్డ్ కప్ ఆడినా అతని అంతర్జాతీయ కెరీర్‌కు పెద్దగా లాభం లేదని మరి కొందరు చెబుతున్నారు. అర్జెంటీనా సహచరులు రొమెరో, అగ్వెరో, హిగుయెన్ మాత్రం మెస్సీ లేని జట్టును ఊహించలేమని, అతను మళ్లీ ఆడతాడని విశ్వాసం వ్యక్తం చేశారు.
జట్టు మేనేజర్ గెరార్డో వ్యాఖ్యలు కూడా మెస్సీని ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు సూచిస్తున్నాయి. రిటైర్మెంట్ ప్రకటించినట్లు తమకే తెలీదని ఆయన మీడియా సమావేశంలో చెప్పడం విశేషం. ‘మేం ప్రపంచ కప్ అర్హత పోటీలు ఆడుతున్నాం. వీటిని అర్ధాంతరంగా వదిలేసి అతను వెళ్లిపోలేడు. అసలు కొనసాగకపోవడానికి తగిన కారణం కనిపించడం లేదు. అతను చాలా బాగా ఆడుతున్నాడు. ఫైనల్లో ఓటమి ఎవరినైనా బాధిస్తుంది’ అని గెరార్డో వ్యాఖ్యానించారు.