సాయిప్రణీత్ ఓటమి
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్, ప్రణయ్
ఇండోనేసియా ఓపెన్ టోర్నీ
మ.గం. 1.30 నుంచి
సా. గం. 4.15 వరకు
స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
జకార్తా: వరుసగా సింగపూర్ ఓపెన్, థాయ్‌లాండ్ ఓపెన్ టైటిల్స్ సాధించి జోరుమీదున్న భారత యువ షట్లర్ భమిడిపాటి సాయిప్రణీత్‌కు ఇండోనేసియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్‌లో నిరాశ ఎదురైంది. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో సాయిప్రణీత్ 14–21, 18–21తో రెండో సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయాడు. అయితే భారత్‌కే చెందిన కిడాంబి శ్రీకాంత్, హెచ్‌ఎస్ ప్రణయ్ తొలి రౌండ్‌లో విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.
శ్రీకాంత్ 21–15, 17–21, 21–16తో వోంగ్ వింగ్ కి విన్సెంట్ (హాంకాంగ్)పై, ప్రణయ్ 21–13, 21–18తో జిన్‌టింగ్ (ఇండోనేసియా)పై గెలిచారు. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 9–21, 19–21తో ఫజర్–అర్దియాంతో (ఇండోనేసియా) జంట చేతిలో... మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప ద్వయం 21–19, 19–21, 13–21తో దియాన్ ఫిత్రియాని–నాద్యా మెలాతి (ఇండోనేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. గురువారం జరిగే ప్రిక్వార్టర్స్‌లో లీ చోంగ్ వీ (మలేసియా)తో ప్రణయ్; జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్; నిచావోన్ (థాయ్‌లాండ్)తో సైనా; బీవెన్ జాంగ్ (అమెరికా)తో సింధు తలపడతారు.